కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారి తన వెంట వచ్చేవారికి మంచి ప్యాకేజీ ఉంటుందని ఎర వేసినా కొందరు కాంగ్రెస్ నేతలు లొంగలేదట. కనీసం ప్రచారానికైనా దూరంగా ఉండండి చాలు, దానికో ప్యాకేజీ ఉందంటూ గాలం వేశారట. ఇది బాగానే వర్కవుట్ అయినట్టు వినికిడి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కుటుంబ సమేతంగా గోవా, ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి విమాన, రైలు టికెట్లు, హోటళ్లలో రూమ్స్, భోజనం ఖర్చులతో పాటు పాకెట్ మనీ ఈ ప్యాకేజీ ప్రత్యేకతట. అంతే కాంగ్రెస్ నాయకులు బ్యాగులు సర్దుకొని మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారట. ఈ రెండు ప్యాకేజీలే కాకుండా ఆకర్షణీయమైన మరో బంపర్ ఆఫర్‌ను ఇప్పటికే కొందరు చోటా మోటా నాయకులు అందుకున్నారట. బైకుల మీద ఎంతకాలం తిరుగుతారు.. బ్యాక్‌పెయిన్ వస్తుంది, ఈ ఎన్నికల్లో తమకు బ్యాక్‌గా నిలిస్తే చాలు ఏకంగా కొత్త కారే సొంతం అవుతుందని ఇచ్చిన ఆఫర్‌కు మంచి స్పందన వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం మునుగోడు రోడ్లపై ఎక్కడచూసినా కొత్త కార్లే కనిపిస్తున్నాయట. ఎవరైనా సొంతంగా కారు కొనుకున్నా జనం నమ్మడం లేదట. ఇదిలా ఉంటే, కార్లు అందుకున్నంత మాత్రాన పొరపాటున ఆ గుర్తుకు ఓటు వేయొద్దు సుమా అని బీజేపీ అభ్యర్థి మరీ మరీ హెచ్చరించి కారు తాళాలు అందజేసినట్టు వినికిడి.