ప్రధాని మోదీకి ధనబలం కారణంగానే రాజకీయ లబ్ధి చేకూరింది, చేకూరుతున్నది. ఆయన అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, ఈ ధనబలం వల్లనే రాజకీయంగా నష్టం జరుగకుండా బయటపడుతున్నారు. ఎన్నికల యుద్ధమైనా, ప్రజలను అల్లకల్లోలపరిచే సంక్షుభిత సమయాల్లోనైనా మోదీని కార్పొరేట్ సంస్థలు తమ భుజాల మీద మోస్తున్నాయి. దేశంలో నేడు రాజకీయపక్షాల ఎన్నికల ఖర్చు యాభై వేల కోట్ల రూపాయలను దాటి ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల శక్తి కీలకంగా నిలుస్తున్నది. నేడు ధనం ప్రజాస్వామ్యాన్ని నడుపుతున్నది. ఎన్నికల సంస్కరణలు జరగాలంటూ వివిధ సంస్థలు ఇచ్చే నివేదికలు చెత్తబుట్టల పాలవుతున్నాయి.
ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు చెలరేగుతుంటే ఓ రాజకీయ పార్టీకి ఓట్లు లభిస్తుండవచ్చు కానీ, పెట్టుబడులకు అనుకూల పరిస్థితి ఉండదు. చిన్న కిరాణా దుకాణం నడిపే వ్యాపారి కూడా.. తనకున్న మతపరమైన అభిప్రాయాలను అదుపులో పెట్టుకొని, అన్ని మతాల వారికి వస్తువులు విక్రయిస్తాడు. డబ్బుకు వర్ణం, జాతి ఉండదు. లండన్ స్టాక్ ఎక్సేంజిని స్థాపించగానే క్యాథలిక్, ప్రొటెస్టెంట్ల మధ్య మతఘర్షణలు ఎలా తగ్గిపోయాయో మనకు బ్రిటిష్ చరిత్ర చెబుతుంది. యూరప్ పునరుజ్జీవనోద్యమ స్ఫూర్తిదాతల్లో ఒకరైన వాల్టేర్ లండన్ స్టాక్ ఎక్సేంజిని చూసి, దానివల్ల ప్రజలు సంతోషంగా కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. వారి దృష్టిలో ‘కాఫిర్ అంటే దివాళా తీసిన వ్యక్తే!’ అని ఆయన చమత్కరించారు.
మోదీ తనకు రహస్యంగా, బహిరంగంగా విరాళాలు ఇచ్చే దాతలకు ప్రభుత్వ సం స్థలను, ప్రజా ఆస్తులను కట్టబెట్టడం ద్వారా కృతజ్ఞత చూపుతున్నారు. అదే సమయంలో ఆయనకు, ఆయన పార్టీకి విరాళాలివ్వని వారు వేధింపులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఇష్టం లేకున్నా వారు కూడా బలవంతంగా విరాళాలు ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వ భయం వల్ల ప్రతిపక్షాలకు నిధులు నిలిపివేస్తున్నారు. ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులను మోదీ దివాళా తీయించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ చేసింది ఇదే. ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత అదే చేస్తున్నారు.
గతంలో మన దేశంలో రాజకీయ నేతలు పెట్టుబడిదారులతో బహిరంగంగా కలవటానికి ఇష్టపడేవారు కాదు. వ్యాపారుల, పెట్టుబడిదారుల ప్రశంసలు పొందితే నాయకులకు నష్టమే జరిగేది. కానీ నయా ఉదారవాద విధానాలు పెట్టుబడిదారులకు అంతకుముందు లేని ప్రతిష్ఠను తెచ్చిపెట్టాయి. ఈ మార్పును గ్రహించాలంటే 1950, 60ల నాటి బాలీవుడ్ సినిమాలు చూడాలి. నాటి సినిమాల్లో పెట్టుబడిదారులను నెగెటివ్‌గా చూపేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి మారింది. వారిని హీరోలుగా చూపుతున్నారు. వాస్తవానికి, పెట్టుబడిదారుల గుణగణాలు అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. వారు అలానే ఉన్నారు. అయినప్పటికీ, సినిమాల్లో ఈ మార్పు వచ్చింది. అయితే, ఈ వ్యాపారవర్గంలో చాలామంది మతోన్మాదాన్ని ప్రోత్సహించరు. ఎందుకంటే, అది వారి వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకం కాబట్టి. కానీ, సమాజ బలహీనతలు మోదీకి బాగా తెలుసు. అందువల్ల ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని, మతోన్మాదాన్ని మమేకం చేయగలిగారు.
వ్యాపారస్థులు, సంపన్నులు తమ వద్ద ధనాన్ని ప్రజాధనంగా భావించి దానికి సంరక్షకులుగా (ట్రస్టీలుగా) వ్యవహరించాలనేది గాంధీజీ ఆశ యం. స్వయంగా గుజరాతీ అయిన మహాత్ముడు చెప్పిన ఈ ఆదర్శాన్ని పలువురు గుజరాతీ వ్యాపారులు పాటించేవారు. అన్యాయంపై గళమెత్తేవారు. కానీ, మోదీ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002లో గుజరాత్లో సంభవించిన మతచిచ్చు వారికి పరీక్ష పెట్టింది. ఎవరూ నోరు తెరిచి ఇది న్యాయం, ఇది అన్యాయం అనే ధైర్యం చేయలేకపోయారు. ఈ ధోరణి మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశమంతటా విస్తరించింది.
ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది పెద్ద వార్త అవుతున్నది. ఒకసారి బజాజ్ గ్రూప్ సంస్థల చైర్పర్సన్ రాహుల్ బజాజ్, కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో ఓ సమావేశంలో మాట్లాడారు. ‘దేశంలో అసహనం పెరిగిపోతున్నది. పెట్టుబడిదారులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి భయపడుతున్నారు’ అని రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. భయం, ఆర్థిక ప్రయోజనాల రీత్యా వ్యాపారవేత్తలు ప్రభుత్వ విధానాలపై స్పందించటం మానేశారు. మోదీ తమను సువర్ణ ద్వీపానికి తీసుకుపోతున్నారని భావించారే తప్ప, మతోన్మాదం దీర్ఘకాలంలో తమ ప్రయోజనాలకు భంగకరమని వారు గుర్తించలేకపోయారు.
మోదీ హయాంలో దేశంలో నెలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడి ఇతర దేశాలకు తరలిపోతున్నది. కొందరు వ్యాపారవేత్తలు ఈ పరిస్థితిని గుర్తించారు. దేశం పెడదారిపడితే జాగ్రత్త పడటానికి విదేశాల్లో ఆస్తులు కొంటున్నారు. నూపుర్‌శర్మ ఉదంతాన్ని చూసినట్టయితే- మతవాదంపై పెట్టుబడిదారీ విధానం ఎలా గొంతెత్తుతుందో తెలుస్తుంది. బీజేపీ నాయకత్వం నూపుర్‌శర్మను సస్పెండ్ చేసింది భారతీయ ముస్లింల ఆందోళనకు భయపడి కాదు. భారత్‌లో మత సామరస్యం కొనసాగాలంటూ పశ్చిమ ప్రజాస్వామ్య దేశాలు చేసిన ప్రకటనల వల్ల కూడా కాదు. అది కేవలం వ్యాపారుల కోసం.
గల్ఫ్ దేశాల్లో వ్యాపారాలున్న భారతీయ సంపన్నులు, నూపుర్‌శర్మ వ్యాఖ్యలపై ఆయా దేశాల ప్రభుత్వాలు గట్టిగా స్పందించటంతో భయపడిపోయారు. అంతేగాక ఆయా దేశాలతో ప్రభుత్వపరంగానూ భారత్‌కు ఆర్థిక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే, బీజేపీ ఆమెపై కాస్తయినా చర్యలు తీసుకుంది. దేశ సంపదను పణంగా పెట్టి మోదీ తమకు లబ్ధి చేకూరుస్తున్నప్పటికీ, మతోన్మాద భూతం తమ ప్రయోజనాలకు భంగకరమని కార్పొరేట్ సంస్థలు అర్థం చేసుకుంటున్నాయి. మొదట్లో హిందూదేశ నినాదాన్ని ఈ కార్పొరేట్ శక్తులే ప్రచారం చేసిపెట్టాయి. ఆ మతవాదాన్ని ఆలంబనగా చేసుకొని, మైనారిటీలను బూచిగా చూపి మెజారిటీ ప్రజలను భయంలోకి నెట్టి, అధికారంలో కొనసాగుతున్న నాయకుడిని తాము దింపివేయలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, కార్పొరేట్లు తల్చుకుంటే ఇప్పటికైనా మార్పు ఓ మేరకైనా తీసుకురావచ్చు.
బీజేపీ ఎన్నికల యంత్రాంగానికి గల మూలస్తంభాల్లో ధనబలం ఒకటి. దీనిని బలహీనపరచాలంటే, ఇతర రాజకీయపార్టీలకు వ్యాపారవేత్తలు తలా కొంత విరాళాలు ఇవ్వాలి. అప్పుడు పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది. బీజేపీకి భారీ విరాళాలు రానట్టయితే, మత రాజకీయాలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే శక్తి ఆ పార్టీకి ఉండదు. మతోన్మాద రాజకీయాల ప్రమాదాన్ని గుర్తించిన తర్వాతనైనా భారతీయ కార్పొరేట్ వర్గం ఎలా వ్యవహరించనుంది? అనేది ఆసక్తికరమైన ప్రశ్న. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దీనికి జవాబు లభిస్తుంది.
– ఎల్.కె. శర్మ(‘ది వైర్’ సౌజన్యంతో..)