ఒకప్పుడు ఇండియా అంటే… కరువులు, వరదలు, నెహ్రూ. ఇదే నాటి అంతర్జాతీయ సమాజానికున్న అవగాహన. జాతీయోద్యమ అనంతర కాలంలో కూడా శిఖర సమానులు నెహ్రూ. అలాంటి నెహ్రూనే దక్షిణాది నేతలు ఎదిరించి నిలబడ్డారు. నాడు నెహ్రూను ఎదుర్కోవడమనేది ఆషామాషీ విషయం కాదు. అయినప్పటికీ, అది చేసి చూపి, హస్తిన మనకు ఎంతో దూరంలో లేదని నిరూపించారు.
ఒక నినాదంతో ముందుకెళ్లి లక్ష్య సాధనలో సాధించిన విజయం కేసీఆర్ ఖాతాలో ఉన్నది. రాష్ర్టాన్ని అన్నివిషయాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన విజన్ ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జాతీ య స్థాయిలో అనేక పార్టీలను తన వాదనవైపు తిప్పుకొన్న చరిత్ర ఉన్నది. మరి వాళ్లంతా కేసీఆర్ వెంట కలిసినడుస్తారా? ఇదే కీలక ప్రశ్న. వాళ్లు కలిసి రాకుంటే, కేసీఆర్ వద్ద ఉన్న ‘ప్లాన్-బీ’ ఏమిటి?
ఇది 1959 నాటి మాట. దానికి నాయకత్వం వహించింది రాజగోపాలాచారి, ఖాసా సుబ్బారావు, ఆచార్య రంగా తదితరులు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే… ఇన్నాళ్ల తర్వాత దక్షిణాదికి చెందిన మరో నేత ‘హస్తిన ఎంతో దూరం లేదు’ అంటున్నారు. ఆయనే సీఎం కేసీఆర్. దేశానికి అవసరమైన ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకొస్తానని ప్రకటించారు.
నెహ్రూ అంతటి బలమైన నేత కాకపోయినా, తిరుగులేని ప్రధానిగా ప్రస్తుతం మోదీ ఉన్నారు. ఆయనను విమర్శించడానికి పెద్ద పెద్ద నాయకులే వెనుకాడుతున్న పరిస్థితి. తీవ్రస్థాయిలో విమర్శలు చేసే మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటివారు కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం మోదీని, ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రత్యామ్నాయ అజెండా తయారు చేస్తానంటున్నారు.
నెహ్రూ సోషలిస్టు భావజాలం గల నాయకుడు. నాడు ఆయనకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ ఆలోచనతో తామో పార్టీ పెడ్తామని, కాం గ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామంటే ఎవరూ నమ్మలేదు. కానీ రాజాజీ, ఖాసా సుబ్బారావుల నేతృత్వంలో పురుడు పోసుకున్న ‘స్వతంత్ర పార్టీ’ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదాకు చేరుకున్నది. ఇండియాలో నెహ్రూను ఎదుర్కొనే శక్తి గల నాయకులున్నారనే విషయం రుజువైంది. అంతేకాదు, దాంతో భారత రాజకీయాలకున్న విశిష్టత ప్రపంచానికి తెలిసి వచ్చింది.
దాదాపు 50 ఏండ్ల తర్వాత దక్షిణ భారతానికి చెందిన ఓ నాయకుడు, కేంద్రంలో బలంగా పాతుకుపోయిన ప్రధానిని ఎదిరిస్తానంటున్నారు. అవసరమైన ప్రతి సందర్భంలోనూ భారతదేశం స్పందించింది అంటూ ఆశావహ దృక్పథాన్ని పెంచుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలరా? అసలు సాధ్యమయ్యే పనేనా? ఇలా సందేహాలు చాలానే ఉన్నాయి.
జాతీయ స్థాయిలో ఎంత బలమైన నాయకుడున్నా… ఆయన్ను ఆవరించుకొని ఉన్న సమాజం ఎప్పుడూ ఏకరీతిన ఆలోచన చేయదు. ‘ఇప్పుడు పార్టీలు కాదు ప్రజాసంక్షేమం ముఖ్యం’. ‘కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం’ అనేవి నినాదంగా మారాయి. ఈ మార్పు తెస్తానని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ ఢిల్లీ పీఠాన్ని అందుకోవటం అసాధ్యమేమీ కాదు. అలాగని, సుసాధ్యం కూడా కాదు. దేశ చారిత్రక, సాంస్కృతిక, భౌతిక పరిస్థితులపై సంపూర్ణమైన అధ్యయనం అవసరం. దాంతోపాటు కులాలు, రాజకీయాలు సమ్మిళితమై ఉన్నాయి. వాటి సమీకరణలను పట్టుకోవడం చాలా కీలకం. దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం నుంచి ఇప్పటివరకు మౌలిక సదుపాయాల కల్పన గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంకా నిరుద్యోగం వంటివి పెను సమస్యలుగానే ఉన్నాయి. వాటికి శాశ్వత పరిష్కారం చూపించే రూట్‌మ్యాప్ నిర్దిష్టంగా లేదని ఇన్నేండ్ల చరిత్ర చెప్తున్నది.
రాజాజీ, ఖాసా సుబ్బారావుల తిరుగుబాటుకు నాటి సంస్థానాధీశులు, భూస్వాములు మద్దతిచ్చారు. నేడు సోషల్ ఇంజినీరింగ్ ద్వారా కేసీఆర్ ప్రజాసమూహాల మద్దతు కూడగట్టే అవకాశం ఉన్నది. ఇంకా అధికార పరిధిలోకి రాని, చట్టసభల్లోకి అడుగుపెట్టని వందల కులాలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు దేశంలో 80 శాతం వరకు ఉన్నారు. అందులో ప్రధానంగా యువత ఉన్నది. వారికి సరైన దిశానిర్దేశం చేయగలగాలి. ఇవన్నీ చేయగలిగితే మెజారిటీ ప్రజల కలలను నిజం చేయవచ్చు.
‘గాయపర్చినవే బోధపరుస్తాయి’- అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాటను తెలంగాణ ఉద్యమానికి అప్లయ్ చేసిన కేసీఆర్ విజయం సాధించారు. ఈ ఆలోచనా ధారను అర్థం చేసుకొనే స్థాయి ప్రజలకు కల్పించాలి. ఆ మేరకు రాజకీయ, సామాజిక సమూహాలను కదిలించాలి. అప్పుడు ఢిల్లీ పెద్ద దూరమేం కాదని రుజువవుతుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-గోర్ల బుచ్చన్న
87909 99116