ఖయ్యాం రసవద్గీత కవి కోకిల సుమధుర సేత
1895లో జన్మించిన దువ్వూరి రామిరెడ్డి యవ్వనారంభంలోనే ఎన్నో కావ్యాలు రాసినప్పటికీ ఉమర్ ఖయ్యాం రుబాయతులను అనువదించడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. 1925 సంవత్సరం రామిరెడ్డి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలుగు నాట వేనాడు రామచంద్రారెడ్డి తోటలో కూర్చుని పారశీక కవి శేఖరుడైన ఉమర్ ఖయ్యాం రచించిన రుబాయిలను తెలుగులోకి పద్యానువాదం చేసిన కవికోకిల, కృషీవలుడు దువ్వూరి రామిరెడ్డి. 20 మందికి పైగా కవులు ఖయ్యాంను అనుసరించినప్పటికీ రామిరెడ్డి అనువాదమే రసహృదయాలను అత్యధికంగా రంజింపజేసింది.
1895లో జన్మించిన దువ్వూరి రామిరెడ్డి యవ్వనారంభంలోనే ఎన్నో కావ్యాలు రాసినప్పటికీ ఉమర్ ఖయ్యాం రుబాయతులను అనువదించడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. 1925 సంవత్సరం రామిరెడ్డి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య శేషమ్మ వియోగం, మరుసటి ఏడాది కుమార్తె కుముదమ్మ మరణం తనను కుంగదీసినప్పుడు కాళిదాసు మేఘసందేశం, ఉమర్ ఖయ్యాం రుబాయీలే తనను పునరుజ్జీవింపజేశాయని స్వయంగా తానే చెప్పుకున్నారంటే ఖయ్యాం తనను ఎంతగా ప్రభావితం చేశాడో అర్థం చేసుకోవచ్చు.1924 నుంచే పారశీక కవితాధ్యయనం చేస్తున్న తనను ఈ విషాద సంఘటన ఉమర్ ఖయ్యాం రుబాయీలకు మరింత దగ్గర చేసింది. పారశీక కవితా ప్రాభవాన్ని తెలుగు వారికి అందించాలనే కాంక్షను రెట్టింపు చేసింది.
రామిరెడ్డి కేవలం ఉమర్ ఖయ్యాం రచించిన రుబాయిలను తెలుగులోకి అనువదించడానికే పారశీక భాషను నేర్చుకున్నారంటే కవిత్వం పట్ల ఆయనకున్న నిబద్ధత ఏమిటో అర్థమవుతుంది. అనువాద విధానంలో తిక్కన, శ్రీనాథుడు అనుసరించిన స్వాతంత్య్రాన్ని తాను అనుసరించినా అది మూలం కంటే భిన్నంగా ఉండదని చెప్పారు. పారశీక జాతీయాల్లో ప్రకటించిన భావం తెలుగులో కూడా స్ఫురించాలని అవసరమైనచోట మార్పు లు, రసపోషణకు కావలసిన కూర్పులను చేశారు. తన వద్దనున్న 692 రుబాయీలను 108 వృత్తాలు,17 తేటగీతులతో మొత్తం 125 పద్యాల్లో తెనిగించారు.
ఉమర్ ఖయ్యాం రుబాయత్లను అనువదించడంలో రామిరెడ్డి ఒక పద్ధతిని అవలంబించారు. ఒకేవిధమైన రుబాయీలను కొన్నింటిని వేరుచేసి వాటిలో మనోహరాలైన ఒకటి రెండింటిని మాత్రమే గ్రహించారు. మరికొన్ని వాటిలో ఒక పాదం మాత్రమే కొత్త భావాన్ని వెల్లడించి తక్కిన పాదాలు చర్వితచర్వణంగా ఉన్న సందర్భంలో రెండు మూడు రుబాయీలను కలిపి ఒక పద్యంగా రాశారు. అట్లా రాసినవి సుమారు ఐదారు పద్యాలు మాత్రమే ఉన్నాయి.
‘కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే’..అనే పోతన భాగవత పద్యాన్ని గుర్తుకుతెచ్చే పద్యమొకటి ఉమర్ ఖయ్యాం రుబాయికి రమణీయమైన పద్యానువాదమై రాజిల్లింది. పానశాలలో పురుడు పోసుకుని ప్రజల నాల్కలపై పరిఢవిల్లింది.
అంతములేని యీ భువనమంత
పురాతన పాంథశాల; వి
శ్రాంతిగృహంబు; నందు
నిరుసంజలు రంగుల వాకిళుల్; ధరా
క్రాంతులు పాదుషాలు బహరామ్
జమిషీడులు వేనవేలుగాఁ
గొంతసుఖించి పోయిరెటకో
పెరవారికిఁ జోటొసంగుచున్.
ఈ ప్రపంచం ఒక సత్రం. అందులో పూర్వ సంధ్య, అపర సంధ్య అనేవి రెండు వాకిళ్లు. వేలాది రాజులు ఈ సత్రంలో కొంతకాలం సుఖాలను పొంది, ఇతరులకు అవకాశం ఇస్తూ ఎక్కడికో వెళ్లిపోయారని ఇందులోని భావం. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండే వాళ్లు ఎవరూ లేరు. అందువలన ఉన్న కొద్దికాలం వివాదాలు లేకుండా స్నేహంగా జీవించాలి అనేది ఈ పద్యం మనకిచ్చే హితోపదేశం. ఎంత చక్కటి జీవిత సత్యం. హృద్యమైన ఈ పద్యంలో అస్థిరమైన మానవ జీవితం దాగి ఉన్నది. ఇందులోని ఉపమానం అనుపమానం. పద్యం నడక అత్యంత మనోహరం. సారాంశం వేదాంతం. ఇటువంటి పద్యం ఒక్కటి చాలు మనిషి కండ్లు తెరిపించడానికి. అహంకారమనే మత్తును దించడానికి.
‘నాకు భూమిపైకి రాకపోకల విషయంలో ఏమాత్రం స్వేచ్ఛ ఉన్నా వచ్చేవాడిని కాదు. వస్తే పోయేవాడివి కాదు. కుట్రలు, కుతంత్రాలు కలిగిన మనుషులుండే ఈ పాడునేల మీద నా ఉనికి ఉండడమే నాకిష్టం లేదు’ అని వాపోయిన పద్యమిది. ఖయ్యాం సమకాలీనులైన మత ఛాందసవాదులు ఆయనను ఎంత బాధ పెట్టి ఉంటారో ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు. తనను వ్యతిరేకించిన వారిని తానూ వ్యతిరేకిస్తే ఏం బాగుంటుంది. తాను కవి కదా! అందుకే నేలను నిరసించారు. అదే విషయాన్ని రామిరెడ్డి ఎంత రమణీయంగా అనువదించారో చూడండి.
ఇలకు రాకపోకల నాకు స్వేచ్ఛయున్న రాకయుందును; వచ్చినఁ బోకయుందు; వీలుపడునేని యీ పాడు నేలయందు ఉనికి పుట్టువు చావు లేకున్న మేలు.
ఉమర్ ఖయ్యాం వీధిలో సంచరిస్తున్నప్పడు చూసిన ఒక దృశ్యం రుబాయిగా రూ పాంతరం చెందిన సందర్భమి ది. కుమ్మరివాడు మట్టి ముద్ద ను తొక్కుతున్న దృశ్యాన్ని చూసి మట్టితో సున్నితంగా మందలించిన సన్నివేశాన్ని ఎంత సరళ సుందరంగా, పర మ రమణీయంగా రామిరెడ్డి అనువదించారో చూడండి. నిన్నటిరోజు కుమ్మరిని నేఁగనుఁగొంటి బజారువీధిలో మన్నొక ముద్దఁజేసి మడమం జెడఁద్రొక్కుచు నుండ, వానితోఁ దిన్నగ మందలించె నది దీనత మెల్లఁగ నల్లఁ’ ద్రొక్కు మోయన్న, యెఱుంగవే నను? నొకప్పుడు నీవలె నందగాఁడనే!
నిరాకారుడైన భగవంతుని మాదిరిగా నిరాకారమైన మట్టి కూడా అందమైనదనే భావనను స్ఫురింపజేసిన పద్యరాజమిది. ఆలోచించి చూస్తే నిజమే అనిపిస్తుంది. అంతే కదా! మరి. భగవంతుని సృష్టిలో ప్రతీది అందమైనదే. కాకపోతే అది చూసే కండ్లను బట్టి ఉంటుందంతే.
‘మరణం అంటే నాకు కించిత్తు కూడా భయం లేదు. నా భయం అంతా ప్రాణాలను మోయడంలోనే ఉన్నది’ అంటారాయన. ఎందుకంటే ‘ఆ ప్రాణాన్ని దేవుని దగ్గర వడ్డీకి బేరమాడి తెచ్చుకున్నాను. ఒకవేళ హఠాత్తుగా ఆ అప్పు తీర్చమని నా తలుపు తడితే అప్పటికప్పుడు బంగారు మాడల సంచులు ఆయన ముందు కుమ్మరిస్తాను’ అంటాడు ఉమర్ ఖయ్యాం. అప్పుడు ఆ భగవంతుడు అయినా ప్రాణాన్ని తీసుకుపోవడానికి ఆలోచించవలసిందే అనే మూలంలోని భావాన్ని రామిరెడ్డి ఎంత ముగ్ధమనోహరంగా అనువాదం చేశారో చూడండి.
మరణ భయంబు నాకు నణుమాత్రము లేదు; మదీయ జీవ సం
భరణ భయంబె మిక్కుటము; ప్రాణము దైవము నొద్ద వడ్డి బే
హరమున కప్పుగొంటి; ఋణమంతయు నిమ్మని తల్పు దట్టినన్
సరసర హేమనిష్కముల సంచులు ముందఱ విప్పిపోసెదన్
ఇలా రసవంతమైన ఉమర్ ఖయ్యాం రుబాయిలను సరళ సుందరంగా, సద్రసబంధురంగా, భావస్ఫోరకంగా అనువదించిన దువ్వూరి రామిరెడ్డి పానశాల ఒకవిధంగా పారశీక కవితా రసామృత పాన మహత్తేమిటో తెలుగు వారికి రుచి చూపించినట్లయింది. అది తెలుగువారి హృదయం మీద చెరగని ముద్ర వేసింది.
(వ్యాసకర్త: తెలుగు అధ్యాపకుడు)
కే మల్లేశం
9160396596
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

