సుమధుర గేయవల్లి వడ్డేపల్లి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో 1949 జూలై 30న సాధారణ చేనేత కుటుంబంలో లక్ష్మమ్మ, లింగయ్య దంపతులకు జన్మించిన వడ్డేపల్లి కృష్ణ చిన్ననాటి నుంచే సృజనాత్మకతాశక్తిని అలవరుచుకున్నారు. దాశరథి, డా.సీ నారాయణరెడ్డి వంటి మహాకవుల స్ఫూర్తితో సాహిత్యం పట్ల ఆయనకు అభిరుచి కలిగింది.
తెలంగాణ సాహితీమూర్తులు
హృద్యమైన పద్యాలు, శ్రవణ పేయమైన గేయాలు, మాధుర్యభరితమైన లలితగీతాలు, తేట తెలుగుదనం పల్లవించే పాటలు, కమనీయ భావుకత గల సినిమా పాటలతో ఆధునిక తెలుగు సాహితీ ప్రపంచంలో తన ముద్రను పదిలంగా ప్రతిష్టించుకున్న కవి డా.వడ్డేపల్లి కృష్ణ.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో 1949 జూలై 30న సాధారణ చేనేత కుటుంబంలో లక్ష్మమ్మ, లింగయ్య దంపతులకు జన్మించిన వడ్డేపల్లి కృష్ణ చిన్ననాటి నుంచే సృజనాత్మకతాశక్తిని అలవరుచుకున్నారు. దాశరథి, డా.సీ నారాయణరెడ్డి వంటి మహాకవుల స్ఫూర్తితో సాహిత్యం పట్ల ఆయనకు అభిరుచి కలిగింది. తపాలా శాఖలో ఉద్యోగిగా కొనసాగుతూనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ‘తెలుగులో లలితగీతాలు’ అనే అంశంపై ఆయన పీహెచ్డీ చేశారు. లలితగీతాలపై ఆయన చేసిన పరిశోధన ప్రామాణికమైనదిగా విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. లలితగీతాల మూలాలు, వాటి విశిష్టత, అద్భుత విశ్లేషణా చణతతో, పరిశోధనా ప్రతిభతో సహేతుకంగా రూపొందించడం ఆయనలోని ప్రతిభాపాటవాలకు మచ్చుతునక. ‘రాగరథం’, ‘అంతర్మథనం’, ‘పాటవెలదులు’, ‘చిరుగజ్జెలు’, ‘వెలుగుమేడ’, ‘వడ్డేపల్లి గేయవల్లి’, ‘కనరా నీ దేశం’, ‘వసంతోదయం’ తదితర 33 కవితా సంపుటాలను ఆయన రాశారు. ప్రగతి, ప్రబోధం, ప్రణయం, ప్రకృతి, భక్తి మొదలైన అంశాలతో కూడిన 1,000కి పైగా లలితగీతాలను ఆయన రాశారు.
‘శిథిల శిల్పాల దాగిన కథల గూర్చి ఎవడెరుగును చితికిన బ్రతుకుల లోపలి వెతల గూర్చి ఎవడెరుగును? అంటూ రచనకు శ్రీకారం చుట్టగా 1968 జూన్లో స్రవంతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఆ ప్రోత్సాహంతో అనేక రచనలకు ఆయన శ్రీకారం చుట్టారు. 1969లో ఆయన రాసిన- ‘కనరా నీ దేశం వినరా సందేశం కనులు తెరిచి ఒక్కసారికనరా నీ దేశం మనసులోని మంచినెంచి వినరా సందేశం’ అనే లలితగీతం తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసారమైంది.
‘జగతిరథం జైకొడుతూ, ప్రగతిపథంపై పోనీ ప్రగతిపథం పైన జగతి, పండువెన్నెలై రానీ స్వార్థానికి కట్టనిమ్ము శాశ్వతముగ సమాధి అదియే దేశాభ్యుదయపు అందమైన పునాది’ అనే పాట ఆకాశవాణిలో ‘ఈ మాసపు పాట’గా 1972 సెప్టెంబర్లో ప్రసారమై అందరి మన్ననలు అందుకున్నది.
‘మనమంతా బంధువులం మానవతా సింధువులం భారత పద్మములో ఉదయించిన తీయని తేనియ బిందువులం’ అనే పాట వడ్డేపల్లికి దేశభక్తి గీత రచయితగా 1996లో మాజీ ప్రధాని వాజ్పేయి చేత సత్కార యోగ్యతను కలిగించింది. 1979లో ప్రముఖ నటి భానుమతి ప్రోత్సాహంతో ‘రచయిత్రి’ సినిమాలో తొలిపాట రాశారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సహకారంతో 1980లో ‘పిల్ల జమీందార్’ సినిమాలో రాసిన ‘నీ చూపులోన విరజాజి వాన’ అనే పాట ముందుగా విడుదలైంది. అలా గీత రచయితగా ప్రవేశించిన వడ్డేపల్లి దాదాపు 200కు పైగా పాటలను వెండితెరపై వెలిగించారు.
భైరవద్వీపం (1994) సినిమాలోని.. ‘అంబాశాంభవి భద్రరాజ గమనా కాళీ హైమవతీ త్రినయనా’ అనే పాట.., ‘పిలిస్తే పలుకుతా’ (2003) సినిమాలోని ‘సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం’ అనే పాట.. భక్తిపారవశ్యంలో తేలియాడిస్తాయి.
‘ఎక్కడికెళ్తుందో మనసు’, ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’ అనే రెండు సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహిం చి తన ప్రతిభను చాటారు. 33 కావ్యాలు, 60 ఆడియో అల్బమ్లు, 67 సంగీత నృత్య రూపకాలు, 10 డాక్యుమెంటరీలను వెలువరించడమే కాకుం డా అనేక టీవీ సీరియళ్లకు రచన, దర్శకత్వం వహించారు. గేయకిరీటి, లలితశ్రీ, కవనప్రజ్ఞ, లలితగీత మహాకవి వంటి బిరుదులు కూడా ఆయన పొందారు. నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్గా, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీమెంబర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. బహుముఖ ప్రజ్ఞాశాలియైన డా.వడ్డేపల్లి కృష్ణ 2024 సెప్టెంబర్ 6న మరణించారు.
తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

