పుట్టిన దేశాన్ని వీడి అమెరికాలోనే శాశ్వత నివాసం ఏర్పర్చుకున్న వాళ్లు కోకొల్లలు. పౌరసత్వం కోసం శతవిధాలా ప్రయత్నించేవాళ్లు తండోపతండాలు. అది వాళ్ల హక్కు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అమెరికా పౌరసత్వం అనివార్యమని భావించే తల్లిదండ్రులున్నారు. ఆ మోజు ఎంతటి విపరీత ధోరణికి దారితీస్తున్నదంటే భావితరాల భవితవ్యాన్ని కూడా అంధకారంలో పడేసేందుకూ అమెరికాలోని భారతీయ పౌరులు వెనుకాడటం లేదు.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో పుట్టే పిల్లలకు ఆ దేశ పౌరసత్వం వస్తుంది. దీన్ని యూఎస్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటారు. అమెరికాకు వలసవెళ్లిన వారికి అక్కడ పిల్లలు పుడితే వారికి జన్మతః పౌరసత్వం వస్తుంది. 1868లో అమెరికా 14వ సవరణ ద్వారా ఈ హక్కును ఆ దేశ రాజ్యాంగంలో చేర్చారు. ఇప్పుడు ఆ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి స్థానికంగా పిల్లలు పుడితే తమ దేశం పౌరసత్వం ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ విధానం ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నది. అంటే ఫిబ్రవరి 19 వరకు పుట్టే పిల్లలకు మాత్రమే పుట్టుకతో అమెరికా పౌరసత్వం వస్తుంది.
అందుకే… ‘అమ్మ’ ఆత్మ ఆతృతపడుతున్నది. 7, 8 నెలల గర్భిణులుగా ఉన్న తల్లులు ముందస్తు ప్రసవాలకు సిద్ధమవుతున్నారు. అమెరికా, భారత జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అమెరికాలోని భారతీయ మహిళలు 2 రోజులుగా ప్రసూతి దవాఖానలకు పోటెత్తుతున్నారు. 7 నెలలు నిండని గర్భిణులు కూడా ప్రసవాలకు ప్లాన్ చేస్తున్నట్టు అమెరికాలోని భారతీయ వైద్యులు ఆ కథనాల్లో పేర్కొంటున్నారు.
అమెరికాలో హెచ్-1బీ, ఎల్-1 తాత్కాలిక వీసాలపై లక్షల మంది జీవిస్తున్నారు. వీళ్లంతా అమెరికాలో శాశ్వత పౌరసత్వం కోసం ఇచ్చే గ్రీన్‌కార్డు కోసం నిరీక్షిస్తున్నారు. ‘తాము ఆరేండ్లుగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నామని, ఇదొక్కటే తమకు స్థిరత్వాన్ని ఇవ్వగలదు’ అని ప్రియా అనే ఓ గర్భిణీ చెప్తున్నది. తమ బిడ్డ అమెరికాలో పుడితే జన్మతః పౌరసత్వం వస్తుందని ఎదురు చూశామని, ట్రంప్ నిర్ణయంతో భయాందోళనకు గురైనట్టు ఆమె తెలిపారు. ‘చాలా త్యాగాలు చేసి అమెరికా వచ్చామని, కానీ, ట్రంప్ నిర్ణయంతో దారులు మూసుకుపోయాయనే భావన కలుగుతున్నది’ అని ఓ తండ్రి చెప్తున్నారు. ‘తమకు పుట్టే బిడ్డ ద్వారా పౌరసత్వం వస్తుందని భావించామని, ఇప్పుడు తమకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది’ అని ఆయన ఆందోళన చెందుతున్నాడు.
పిల్లల ద్వారా పౌరసత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు చాలా రిస్క్ చేస్తున్నారు. నెలలు నిండకున్నా ముందస్తు ప్రసవాల కోసం సిద్ధమవుతున్నారు. దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరికీ ప్రాణాపాయమని వైద్యులు చెప్తున్నా, పౌరసత్వమే జీవిత పరమావధిగా వారు భావిస్తున్నారని అక్కడి వైద్యుల మాటల్లో స్పష్టమవుతున్నది. అంటే, ఇప్పుడు పౌరసత్వం కోసమే ముందస్తు ప్రసవాలకు మొగ్గు చూపడం వల్ల.. ప్రసవం సమయంలో సమస్యలు గట్టెక్కినా.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? నెలలు నిండని బిడ్డ జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఊపిరితిత్తులు ఎదగకపోవడం, నాడీ వ్యవస్థకు సంబంధించిన సవాళ్లతో బాధపడాల్సి ఉంటుంది.
ఉన్న ఊరు కన్నతల్లి వంటిదని మన పెద్దలు ఏనాడో చెప్పారు. బతుకుదెరువు కోసం ఎవరు ఎక్కడికి వెళ్లి జీవించినా తిరిగి రావాల్సింది సొంత గ్రామానికే. అయినా ప్రపంచం కుగ్రామమైన నేపథ్యంలో ఎవరు ఎక్కడ నివసిస్తే ఏమున్నది. అమెరికా పౌరసత్వ మోజులో పడి నిండు గర్భిణుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యమేనా? భావితరాల బతుకు ను ప్రశ్నార్థకం చేయడం సమంజసమేనా? ముమ్మాటికీ కాదు. అందుకే… మాతృ దేశానికి దూరంగా జీవిస్తున్న భారతీయులు కనీసం మాతృత్వపు మాధుర్యాన్నైనా ఆస్వాదించాలి. ఎవరో దయతలచి ఇచ్చే పౌరసత్వం కోసం కన్న పేగును దూరం చేసుకోవద్దు. కడుపు కోతను మిగుల్చుకోవద్దు. అమ్మతనాన్ని అవహేళన చేయవద్దు.