మన దేశంలో అత్యధిక ధర ఉన్న స్టాక్ ఏదో తెలుసా… ఎంఆర్ఎఫ్ లిమిటెడ్. మార్కెట్ ఇంత ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు కూడా ఒక్క స్టాక్ ధర సుమారు లక్షా 40 వేల రూపాయలు పలుకుతున్నది. అలాంటి ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి ఏ సంపన్న కుటుంబానికో, వ్యాపార వర్గానికో చెందిన వారనుకుంటే మనం పొరబడ్డట్టే. దీన్ని ప్రారంభించిన కందాత్తిల్ మమ్మెన్ మాప్పిైళ్లె బతుకుదెరువు కోసం ఒకప్పుడు వీధుల్లో గాలి బుడగలు అమ్మారు. చిన్న షెడ్డులో వ్యాపారాన్ని ప్రారంభించి అమెరికా సహా 80 ప్రపంచ దేశాల్లో టైర్లను ఎగుమతి చేసే సంస్థగా ఎంఆర్‌ఎఫ్‌ను అభివృద్ధి చేశారు. నమ్మశక్యంగా లేని ఈ ప్రయాణంలోని నిజాలివి…
నిబద్ధత శ్రమలే పెట్టుబడిగా ఓర్పుగా అడుగులేస్తే నేల మీద నుంచి ఆకాశాన్ని అందుకోవడం సాధ్యమేననిపించే ప్రయాణాలు కొన్ని కనిపిస్తాయి ప్రపంచ చరిత్రలో. అచ్చంగా అలాంటి కథే ప్రఖ్యాత టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ (మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ) వ్యవస్థాపకుడు కందాత్తిల్ మమ్మెన్ మాప్పిైళ్లెది కూడా. కేరళలోని ఒక సిరియన్ క్రెస్తవ కుటుంబంలో 1922లో జన్మించారాయన. దిగువ మధ్య తరగతి కుటుంబం వారిది. తండ్రి స్వతంత్ర సమర యోధుడిగా రెండేండ్ల పాటు జైలు జీవితం గడిపారు. స్వాతంత్య్రానికి ముందు వీరి కుటుంబం ఆర్థికంగా బాగా ఇబ్బంది పడింది. తొమ్మిది మంది తోబుట్టువుల్లో మాప్పిైళ్లె చివరి వాడు.
కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. మాప్పిైళ్లెది చిన్న వయసు కాబట్టి అతను పెద్ద పనులు చేయలేడు. అందుకే వారు నివాసం ఉండే మద్రాస్ వీధుల్లో బెలూన్లు అమ్మే పని ప్రారంభించాడు. అప్పటి అనుభవాలు తరువాత జీవితంలో అతని వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. బెలూన్ల అమ్మకం కొన్నాళ్లు సాగాక, 1946 లో మద్రాస్‌లోని తిరుహోతియూర్లో ఒక చిన్న షెడ్లో బెలూన్లు తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేశారు. వ్యాపారంలో అదే అతని తొలి అడుగు. క్రమంగా బెలూన్లతో పాటు రబ్బర్ బొమ్మలు, కార్మికులు ఉపయోగించే చేతి తొడుగుల వంటి ఉత్పత్తులు తయారు చేయడం ప్రారంభించారు.
టైర్ల రంగంలోకి…టైర్ల రీ ట్రేడింగ్ కోసం 1952లో మాప్పిైళ్లె ట్రేడ్ రబ్బర్ తయారీ రంగంలోకి అడుగు పెట్టారు. ఎంఆర్ఎఫ్ టైర్ల తయారీకి ఇది ఆరంభం. అందులో స్థిరమైన వృద్ధి సాధించడంతో కేవలం అయిదేండ్లలోనే అంటే, 1956 నాటికే ఎంఆర్ఎఫ్ దేశంలో ట్రేడ్ రబ్బర్ మార్కెట్లో 50 శాతం వాటా సాధించింది. అప్పటి వరకు దేశంలో అంతర్జాతీయ కంపెనీలదే అగ్రస్థానం. ఎంఆర్ఎఫ్ వాటన్నింటినీ పక్కకు నెట్టి టైర్ల తయారీలో స్వదేశీ సత్తా చాటింది. అమెరికాకు చెందిన మాన్స్ ఫీల్డ్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీతో సాంకేతిక సహాయానికి ఒప్పందం కుదుర్చుకొని 1960లో ఆటో మొబైల్ వాహనాలు, సైకిల్ ట్యూబ్‌లు, టైర్లు తయారు చేయడం కూడా ప్రారంభించింది. అలా సైకిల్ మొదలుకొని విమానం వరకు కావలసిన టైర్లు తయారు చేయడం మొదలు పెట్టారు. ప్రపంచంలో మొట్టమొదట టైర్లు పుట్టింది అమెరికాలో. కానీ అదే దేశానికి 1967లోనే తన టైర్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది ఎంఆర్ఎఫ్. అలా భారత్ నుంచి అమెరికాకు తొలి టైర్ల ఎగుమతిదారు అయ్యింది. సంస్థ వ్యవస్థాపకులైన మాప్పిైళ్లె పరిశ్రమల రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 1992 లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
80 దేశాలకు…ఎంఆర్ఎఫ్ సంస్థ ప్రస్తుత ఆదాయం 28 వేల 561 కోట్ల రూపాయలు. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మూలధనం) 43,400 కోట్ల రూపాయలు. ఈ సంస్థ టైర్లు ప్రస్తుతం 80 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక, ఇప్పుడు ఈ కంపెనీ టైర్లతో పాటు కన్వేయర్ బెల్టులు, పెయింట్లు, బొమ్మల తయారీ రంగంలోనూ దూసుకుపోతున్నది. వీరి కుటుంబం రియల్ ఎస్టేట్, రబ్బర్ ప్లాంటేషన్ రంగాలలోనూ కాలు మోపింది. ప్రఖ్యాత పత్రిక మలయాళ మనోరమతో పాటు పలు చానల్స్‌లో అత్యధిక వాటా కలిగి ఉంది. చిన్నదిగా ప్రారంభించి అంతర్జాతీయ గుర్తింపు పొందేదాకా సంస్థను నడిపించిన కందాత్తిల్ మమ్మెన్ మాప్పిైళ్లె తన వారసులకు బాధ్యతలు అప్పగిస్తూ, 2003లో అంటే తన 80 ఏండ్ల వయసులో మరణించారు. ఆయన తరువాతి తరమూ విజయవంతంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఎదగాలి అని కోరుకునే వారికి కందాత్తిల్ మమ్మెన్ మాప్పిైళ్లె జీవితం ఓ స్ఫూర్తిపాఠం.
-బుద్దా మురళి
98499 98087