‘ధరణి’ పోర్టల్‌తో భూమి రిజిస్ట్రేషన్ పది నిమిషాల్లో పూర్తవుతున్నది. ఐదు నిమిషాల్లో పట్టా చేతికి వస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్లు, పట్టాలు దళారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండేవి. వాళ్లు రాసిందే రాత, గీసిందే గీత. ఆ దుర్మార్గాలన్నింటికి చెక్ పెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ధరణి. రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిన ‘ధరణి’పై కాంగ్రెస్ నేతలు అవాకులు, చెవాకులు పేలడం వారి వక్రబుద్ధిని తెలియజేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన సందర్భాల్లో ప్రతి సభలో ‘ధరణి ఉండాలా, వద్దా..?ఉండాలనుకునేవారు చేతులు పైకి లేపండి’ అని పిలుపునిస్తే ఆ సభకు హాజరైన ప్రజలు ‘ఉండాలి.. ఉండాలి’ అని చేతులు పైకెత్తి కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నది. వారినే బంగాళాఖాతంలో విసిరేయాల’ని కేసీఆర్ ప్రజలతో అన్నారు. ‘ధరణి రద్దయితే కథ మళ్లీ మొదటికొస్తుంద’ని కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. దళారులు మళ్లా ఊర్ల మీదపడి దోచుకుతింటారని ప్రజల మేలు కోరి చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా తీసుకువచ్చిన ‘ధరణి’ పోర్టల్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మొదలుకొని ఇతర కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారు. బీఆర్ఎస్ సర్కారు రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన బృహత్తర పథకాలను చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారు.
ధరణి ఎందుకు రద్దుచేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. రైతుబంధు సాయం అందిస్తున్నందుకా?, రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇస్తున్నందుకా?, ధాన్యం అమ్మిన వారంరోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నందుకా? సకాలంలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్నందుకా? లాభదాయక పంటల సాగును ప్రోత్సహిస్తున్నందుకా? రైతులకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నందుకా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ పాలనలో రైతు చనిపోతే ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు ఇచ్చేవారు. అది కూడా ఏ ఒక్క రైతుకూ పూర్తిగా చేతికివచ్చేది కాదు. ఏడాది మాసికానికి కూడా ఆ పైసలు అందకపోయేటియి. దరఖాస్తు చేసుకొని, దండాలు పెట్టి మూణ్ణెళ్లు, ఆర్నెళ్లు తిరిగితే పది వేలో, ఇరువై వేలో చేతిలో పెట్టి పంపించేవాళ్లు. కానీ, ఇప్పుడు దురదృష్టవశాత్తూ రైతు చనిపోతే దినవారం పూర్తికాకముందే ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా సొమ్మును బీఆర్ఎస్ సర్కారు అందజేస్తున్నది. ఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టాల్సిన పనిలేకుండా, పైరవీలకు తావు లేకుండా రైతు ఇంటికే చెక్కు వస్తున్నది.
రైతుబంధు కోసం సర్కారు ఏటా రూ.15-16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ‘హైదరాబాద్‌లో రైతుబంధు పైసలు వేస్తే.. డైరెక్ట్‌గా రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. రైతుల ఫోన్లకు టింగ్ టింగ్ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. గతంలో పండించిన ధాన్యాన్ని అమ్మాలంటే ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, లారీల్లో నింపుకొని బీట్లకు, అంగళ్లకు, మార్కెట్లకు పోయి మూడు, నాలుగు రోజులు కావలి ఉండి అమ్ముకొనేవాళ్లు. వడ్లు అమ్మినంక పైసలు, నెలకో, రెణ్నెళ్లకో వచ్చేవి. కానీ ఇయ్యాల వడ్లు అమ్మినంక వారం రోజుల్లోనే సక్కగా రైతు ఖాతాలో డబ్బులు జమవుతున్నయి. ఇదంతా ‘ధరణి’ పుణ్యమే. ఇంత మంచిగా ఉపయోగపడుతున్న ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటుండటం వారి అవివేకానికి నిదర్శనం.
పరాయి పాలనలో నీళ్లులేక, కరెంట్ రాక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రత్యేక చర్యలతో ప్రస్తుతం ఆ కష్టాలన్నీ తీరాయి. దేశం మొత్తంలో యాసంగి 94 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేయగా, ఒక్క తెలంగాణలోనే 56.40 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించిన తెలంగాణ ఇప్పుడు ముందంజలో ఉన్నది. నేడు తెలంగాణలో సుమారు 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. కేంద్ర ప్రభుత్వ దిక్కుమాలిన నిర్ణయాల వల్ల నేటికీ పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
ఆ బాధను తప్పించేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలనే లక్ష్యంతో సర్కారు ముందుకు వెళ్తున్నది. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ర్టాల్లో నంబర్ వన్ ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. విద్యుత్తు వినియోగంలో, మంచి గ్రామ పంచాయతీలు, మంచి మున్సిపాలిటీల్లో నంబర్ వన్ ఎవరంటే తెలంగాణ రాష్టం. తాగునీటి సదుపాయంలో, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచి నీరు సరఫరా చేయడంలోనూ తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
కొన్ని నెలల్లో ఎన్నికలు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ నాయకులు విషప్రచారం మొదలుపెట్టారు. వాళ్ల మాటలు నమ్మితే మోసపోవడం ఖాయం. కాబట్టి.. ప్రజల్లారా తస్మాత్ జాగ్రత్త. బంగారు తెలంగాణను విచ్ఛినం కాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. పేదల సంక్షేమం కోరే సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా అండగా నిలుద్దాం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
గొట్టిముక్కుల బ్రహ్మచారి 94418 84389