చర్చలలో, రచనలలో కొన్ని కొన్ని పదాలు ఎన్నిసార్లు దొర్లుతాయన్న దానిపై కొందరు లెక్కలు వేస్తుంటారు. అందువల్ల ఆ విషయం ఎంతగా ఆయా వర్గాల మనస్సులలో ఉందనేది అంచనాకు వస్తుంది. అటువంటి ఒక పదం ‘రాజ్యాధికారం’. బహుశా దీనిని మొదటిసారి ప్రయోగంలోకి తెచ్చింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అయి ఉంటారు. అదెట్లున్నా ఆయన ఆ విషయమై చాలానే రాశారు. ఆ లక్ష్యసాధనకు ఒక పార్టీ కూడా ప్రారంభించారు. తన జీవితం 1956లోనే ముగియకుండా తగినంత కాలం కొనసాగి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేదోగాని, తర్వాత ఈ 70 ఏండ్లలో పలు ప్రశ్నలు ముందుకువచ్చాయి.
‘రాజ్యాధికారం’ అనే మాట ఇప్పుడు తరచుగా వినరావటమే గాక విస్తృతం కూడా అయింది. దళితులకు రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారం, బడుగులకు రాజ్యాధికారం, బహుజనులకు రాజ్యాధికారం అన్న విధాలుగా. ఈ వర్గాల జనసంఖ్య తెలంగాణలో అధికం గనుక ఇక్కడ కొంత ఎక్కువగా వినవస్తుంది. ఈ వర్గాల పరిస్థితులు, లక్ష్యాల గురించి స్వాతంత్య్రానికన్న ముందునుంచి, నిజాం రాజ్యకాలం నుంచి మొదలుకొని సుమారు 80 సంవత్సరాలుగా పలువురు రాశారు, కృషిచేశారు, వేర్వేరు విధాలుగా కొన్ని ముందడుగులు కూడా వేశారు. అధికార సాధన లక్ష్యంతో పాటు ఆ వర్గాల సామాజిక సంస్కరణలు, పురోగతి కూడా వారి దృష్టిలో ఉండటం గమనించదగినది.
అయితే, కాలక్రమంలో పరిస్థితులు ఏ విధంగా మారాయన్నది అర్థం చేసుకోవలసిన విషయం. అట్లా మారుతున్న పరిస్థితులలో ఈ వర్గాలకు ‘రాజ్యాధికారం’ అనేది సాధ్యమా? అయితే ఏ విధంగా? దశాబ్దాలు అయితే గడుస్తుండగా ఆ లక్ష్యం వైపు వారి పురోగతి ఏ విధంగా ఉంది? అనేవి ప్రశ్నలు. ఈ చర్చలోకి వెళ్లేముందు ఒక విషయం చెప్పాలి. దానిని బట్టి విషయం గురించి, ఈ ప్రశ్నల గురించి కూడా పరిస్థితి కొంత అర్థం కావచ్చు.
కొంతకాలం క్రితం నేను, మరొక జర్నలిస్టు మిత్రుడు కలిసి ఇందుగురించి ఇంటర్వ్యూల సర్వే ఒకటి చేయాలనుకున్నాం. అందుకోసం ఎస్సీ (మాల, మాదిగ కూడా), బీసీ వర్గాలకు చెందిన ప్రముఖులు కొందరిని ఎంపిక చేశాం. ఆ ప్రముఖులలో అప్పటి మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, రచయితలు, యాక్టివిస్టులు, మహిళలు ఉన్నారు. వారందరిని ఒక్కొక్కరుగా మాత్రమే కలవాలని, తగినంతసేపు (కొద్ది గంటలైనా) మాట్లాడాలని, అందరికీ ఒకేవిధమైన ప్రశ్నలు వేయాలని, వాటికి సమాధానాలను వినటం తప్ప ఎదురు ప్రశ్నలు, వాదనలు చేయరాదని నిర్ణయించుకున్నాం. మా సర్వే సుమారు మూడు నెలల పాటు సాగింది.
మా ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. 1.రాజ్యాధికారం అంటే ఏమిటి?, 2.రాజకీయాధికారం అంటే ఏమిటి?, 3.రెండూ ఒకటేనా, వేర్వేరా?, 4.ఒకటైతే ఏ విధంగా, వేర్వేరు అయితే ఏ విధంగా? 5.ఈ వర్గాలకు ప్రస్తుత పార్టీ వ్యవస్థలలో, ప్రభుత్వాలలో పదవులు లభిస్తే అది రాజకీయాధికారం అవుతుందా, రాజ్యాధికారం కూడానా? 6.రాజ్యాధికారమన్నది వేరైతే దాని సాధనకు ప్రణాళిక, కార్యాచరణ ఏమిటి?, 7.ఆ లక్ష్యాన్ని మాలలు, మాదిగలు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు విడివిడిగా సాధించుకోగలరా? పరస్పర ఐక్యత అవసరమా?, విడివిడిగా అయితే ఏ విధంగా?, ఐక్యతతో అయితే అందుకు ప్రణాళిక ఏమిటి?, ఇంతవరకు కార్యాచరణ ఏమిటి?, 8. రాజకీయాధికారం లేదా రాజ్యాధికారం సాధిస్తే అప్పుడు ఈ వర్గాలకు, తక్కిన సమాజానికి భవిష్యత్తు నిర్మాణం కోసం రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రణాళికలు ఏమిటి? ఏ ప్రాతిపదికపై ఈ వర్గాలను సమీకరిస్తారు?
మా ప్రశ్నలకు సమాధానంగా ఆయా ప్రముఖుల నుంచి లభించిన సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి. వాటిని వివరించేందుకు ఎక్కువ వాక్యాలు రాయనవసరం లేదు కూడా. వారిలో ఇద్దరు ముగ్గురికి తప్ప అసలు రాజకీయాధికారం, రాజ్యాధికారం అనేవి వేర్వేరు అన్నది తెలియదు. ఈ వర్గాల వారికి కొన్ని పదవులు లభిస్తే అంతమాత్రాన అది రాజ్యాధికారం కాకున్నా కనీసం రాజకీయాధికారం అయిపోతుందా అనే ప్రశ్నపై కూడా స్పష్టత లేదు. ఇక తక్కిన ప్రశ్నలు వారి మనసులలోకే ఎప్పుడూ వచ్చినట్టు లేవు. ఇద్దరు ముగ్గురి మాటలను బట్టి మాత్రం అర్థమైంది ఏమంటే, తక్కినవన్నీ జరగటం, లక్ష్యసాధనలు వాంఛనీయమే అయినా అవన్నీ ఆచరణ సాధ్యమని వారు భావించటం లేదు. అందువల్ల, నినాదం ఎంత గొప్పగా ఇచ్చినా, ఉన్నత వర్గాలను ఆశ్రయించగా లభించే పదవులతో సంతృప్తి చెందటం వరకే వారి లక్ష్యం. కోరికలకు, లక్ష్యాలకు, నినాదాలకు, అవగాహనలకు, కార్యాచరణకు మధ్యగల వ్యత్యాసాలను దీన్నిబట్టి సూక్ష్మరూపంలో అర్థం చేసుకోవచ్చు.
ఈ వర్గాలు అన్నింటికీ సమష్టిగా కాదు గాని, కొన్నింటికి, రాజ్యాధికారం కాకున్నా రాజకీయాధికారం లభించిన సందర్భాలు మన దేశంలో కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు యూపీ, బీహార్, తమిళనాడు వంటివి. అక్కడ కూడా రాజకీయాధికారం ఈ వర్గాలలోని కొన్ని కులాలకు, ఆ కులాలలోనూ బలీయమైన శ్రేణులకు లభించింది. అంతే తప్ప, వనరులు, ఉత్పాదనలు, వాటి నియంత్రణలు, రాజకీయ పాలనతో కూడిన సర్వం సహాధిపత్య రాజ్యాధికారం కాదు. ఆ వర్గాలకు చెందిన అన్ని శ్రేణులకు అంతకన్న కాదు. ఆ నాయకత్వాలకు అటువంటి మౌలిక దృష్టి లేనే లేదు. సమష్టి దృష్టి, సంకల్పం, ఐక్యతలూ లేవు. ఆ విధంగా వారిది తమకు మాత్రమే పరిమితమైన పాక్షికమైన రాజకీయాధికారం అయింది తప్ప రాజ్యాధికారం ఎప్పుడూ కాలేదు. ఈ స్థితి బీసీ పార్టీలకు, బీఎస్పీ వంటి దళిత పార్టీకి కూడా వర్తించింది. ఆ విధమైన పునాదులు, సమగ్రతలు లేనందువల్లనే బలహీనతలు చోటుచేసుకొని ఎవరి రాజకీయాధికారం కూడా సుస్థిరం కాకుండా పోయింది.
ఇక రాజ్యాధికారం మాట ఊహలోకే రాలేదు. ఆ వైఫల్యాల శూన్యంలోకి ఈ లక్ష్యాలన్నింటికి బద్ధ విరోధి అయిన పార్టీలు వచ్చి చేరుతున్నాయి. అందుకు రుజువులను అవే యూపీ, బీహార్లలో చూడవచ్చు. ఆ పరిణామాలలోని వ్యంగ్య వైభవం ఏమంటే, తమ వైఫల్యాల కారణంగా పతనమైన రాజకీయాధికార పార్టీలు, అవే బద్ధ విరోధి పార్టీలకు దాసోహమనే దుస్థితి వచ్చింది. అది, ఆ కనీసపు రాజకీయాధికారాన్ని అయినా స్వయంగా సాధించుకోలేక, తమ విరోధులపై ఆధారపడి అన్న మాట. పెక్కు భంగుల్ వివేక భ్రష్ఠ సంపాతముల్ అన్నవిధంగా.
ఇప్పుడు, గతంలోని ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత రెండు రాష్ర్టాల విషయానికి వద్దాం. మొదట చెప్పుకొన్నట్టు దళితులు, బడుగులు అనే ఆలోచనలు, చర్యలు స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్నవే. కానీ, ఆ తర్వాత పదవీ అవకాశాలు, ఆర్థికావకాశాలు కనిపిస్తుండటంతో అవన్నీ అటువంటి అవకాశాలను పొందటం వైపు మాత్రమే మళ్లసాగాయి. రిజర్వేషన్లు అందుకు తోడయ్యాయి. రాజకీయంగా మరిన్ని పార్టీల రాకతో అవకాశాలు అన్నివైపుల నుంచి కనిపించాయి. ఎటువైపు అవకాశం లభిస్తే అటు మారటమూ జరగసాగింది. ఆ క్రమంలో రాజకీయంగా, ఆర్థికంగా సొంతానికి లాభపడటమంటూనైతే బాగానే కనిపించింది గాని, బడుగులకు రాజ్యాధికారం లేదా రాజకీయాధికారమన్నది ఒక ప్రహసనప్రాయపు గతించిన కలగా, నినాదంగా మిగిలిపోయింది.
అప్పటికీ నినాదాలు వినరావటం ఆగలేదు. కానీ, అవి రెండు విధాలుగా కనిపించసాగాయి. ఒకటి, ఆ నినాదాలతో తమ తమ బడుగు వర్గాలకు భ్రమలు కల్పించి, కొన్ని కొసరు లాభాలేవో చేసి, ఓటు బ్యాంకులుగా మార్చుకొని, తమ కోసం ఉపయోగించుకోవటంతో పాటు ఇతర పార్టీలతో బేరసారాల కోసం పాచికలుగా విసరటానికి. రెండు, రాజకీయాలకు బయట కొందరు నిజంగానే తపన చెందుతున్నా, పైన అనుకున్న విధంగా స్పష్టతలు లేక, కార్యాచరణకు కావలసిన వనరులు, వ్యవస్థలు లేక, ఐక్యతలు లేక తపన పడుతూనే మిగిలిపోవటం. ఫలితంగా ఈ రెండు విధాలైన వారు కూడా అంతిమ విశ్లేషణలో రాజ్యాధికార, లేదా రాజకీయాధికార నినాదపు కొయ్యగుర్రపు స్వారీ చేస్తుండటం మినహా, నిజమైన అర్థంలో, మౌలికమైన రీతిలో పురోగతి ఏమీ లేదు.
నినాదాల సంగతి వదిలివేస్తే, స్వాతంత్య్రానికి ముందటితో పోల్చినప్పుడు ఈ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తగినంత ముందుకు వెళ్లాయి. వారి నినాదాలు, పరిమిత ఆచరణలు పై వర్గాల వారి రాజకీయాలపై, ప్రభుత్వాలపై ఒత్తిడులను సృష్టించి ఎంతో కొంత తెచ్చి పెడుతున్నాయి. తమ నినాదాలు ఆ మేరకు ‘అధికారం’ సాధిస్తున్నట్టే. తమ జన సంఖ్య అనే కోణం నుంచి చూసినప్పుడు అది అందుకు తగిన ‘రాజకీయాధికార’మైనా కాదన్నది నిజమే. కానీ, అంతకుమించి సాధించుకోవటంలో వారికి మరొక రెండు బలహీనతలు కూడా ఉన్నాయి. ఒకటి, ఉన్నత తరగతులకు వలె ఆర్థిక ప్రాబల్యం, సామాజిక ప్రాబల్యం లేకపోవటం. రెండు, బడుగు వర్గాలలోని అర్బన్ వైట్ కాలర్స్కు, లేదా భద్రలోక్కు తమ సొంత అజెండాలు తప్ప గ్రామాలలో గల అసంఖ్యాకులైన బడుగుల సమస్యలు పట్టకపోవటం.
-టంకశాల అశోక్