పాలకులు వస్తుంటారు, పోతుంటారు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి, సంక్షేమం అనేవి జోడెడ్లలా ముందుకుసాగాలి. అధికార మార్పిడి జరిగినప్పుడు కొత్తగా కొలువైన ప్రభుత్వం గత సర్కారు చేసిన మంచి పనులను కొనసాగిస్తూనే మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషిచేయాలి. అంతేకానీ, ఓటమి పాలైన పార్టీపై అభాండాలు వేస్తూ కాలయాపన చేయడం సమంజసం కాదు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ దురదృష్టవశాత్తూ కుంగిన మేడిగడ్డ పిల్లర్లనే ప్రచారాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించగా.. లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల దాకా మోత మోగించారు. నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా చుట్టివచ్చిన చందంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎన్నికలు ముగిశా యి, కొత్త ప్రభుత్వం కొలువైంది. బాధ్యతతో వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కేసీఆర్ సర్కార్‌పై ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉన్నది. వరద వస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందని మొన్నటివరకు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. కానీ, గోదావరి వరదలను, కాంగ్రెస్ కుట్రలతో కలెబడి మేడిగడ్డ నిలబడ్డది.
ఉమ్మడి ఏపీలో కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ రైతాంగాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలనే సంకల్పంతో ఉద్యమనేత కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీరందించి మెదక్‌తో పాటు పది జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చారు. కేసీఆర్ హయాంలో 18 టీఎంసీల నీళ్ల తో మల్లన్నసాగర్ కళకళలాడుతుండేది. మేడిగడ్డ ను సాకుగా చూపుతూ కాంగ్రెస్ సర్కార్ నీటి పం పింగ్‌ను నిలిపివేయడంతో మల్లన్నసాగర్ సహా అనేక రిజర్వాయర్లు వట్టిపోయాయి. చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోవడంతో చెరువులు, కుంట లు, వాగులు, వంకలు వెలవెలబోతున్నాయి. నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు వట్టిపోతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పాలకులు నీళ్లివ్వలేకపోతున్నారు. దీంతో ఒకటి అనుకుంటే.. ఇంకొకటి జరిగిందని రచ్చబండలు కోడై కూస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం జరిగిందే గురించి. ‘తలాపున పారుతుంది గోదారి.. నీ చేలు, నీ చెలకా ఎడారి’ అని పాడుకున్నాం. కరువు, కాటకాలతో తెలంగాణ తల్లడిల్లుతున్నా, గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నా.. ఏ పాలకుడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వస్తేనే నీళ్ల గోస తీరుతుందని కేసీఆర్ పదేపదే చెప్పేవారు. చెప్పినట్టుగానే తన మాటను చేతల్లో చేసి చూపించారు. అపర భగీరథుడి దీక్షా, దక్షతలతో 557 మీటర్ల లోతు లో ఉన్న గోదావరి జలాలు పంట పొలాలకు చేరా యి. తెలంగాణ సస్యశ్యామలమైంది.
గత నాలుగేండ్లుగా యాసంగిలోనూ కూడవెల్లి వాగు, హల్దీవాగుతో పాటు రామాయంపేట, ఉప్పరపల్లి, దుబ్బాక ప్రధాన కాలువల ద్వారా చెరువులు, కుంటలు నిండిపోయేవి. నీళ్లు విడిచిన మూడు రోజుల్లోనే మండుటెండల్లో సైతం కూడవె ల్లి వాగు ద్వారా నర్మాల చెరువుకు గోదారి జలా లు చేరుకునేవి. కానీ, కాంగ్రెస్ సర్కార్ నిర్వా కంతో ప్రస్తుతం చెరువులు, కుంటలు, వాగులు, వంకలు వెలవెలబోతున్నాయి.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు గోదారి జలాలను తరలిస్తే ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పరిసర జిల్లాలు కూడా సస్యశ్యామలమవుతాయి. కానీ, కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం మనుగడ సాగించలేవు. ఇప్పటికైనా భేషజాలకు పోకుం డా ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి, పంట పొలాలకు అందించాలె. ‘మాకు రాజకీయ కక్షలే కావాలి.. మేమింతే..’ అంటే మాత్రం కర్రు కాల్చి ఎప్పుడు వాత పెట్టాలో రైతులకు బాగా తెలుసు. తస్మాత్ జాగ్రత్త..!
-జీడిపల్లి రాంరెడ్డి
96666 80051