తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బందూక్లను వదిలేసి విప్లవకారులు జనజీవనంలోకి వస్తుంటే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కొంతమంది నాయకులు, వాళ్ల అనుచరగణం మాత్రం బందూక్ సంస్కృతిని, రౌడీ సంస్కృతిని, వసూళ్ల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. మళ్లీ ఈ విషసంస్కృతి ఏకంగా సీఎం కార్యాలయం నుంచే తెలంగాణలోకి ప్రవేశించిందని ఆయన మంత్రివర్గంలోని సీనియర్ మహిళా మంత్రి కూతురే చెప్పిన మాటలు విస్తుగొలుపుతున్నాయి.
రేవ్ పార్టీ సంస్కృతి, గాంజా సంస్కృతి, యూరియా ఉండదు కానీ, నకిలీ యూరియా సంస్కృతి, మహిళలను నీచంగా చూసే సంస్కృతి, విచ్చలవిడి సంస్కృతి, మాట తప్పే సంస్కృతి.. ఇలా కాంగ్రెస్ పాలనలో అష్టవక్రత తెలంగాణను మసకబారుస్తున్నది. కొండా ఎపిసోడ్లో పంపకాల దగ్గర వచ్చిన తగవు అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నదో ప్రపంచానికి తెలియజేసింది. ఇది బయటపడిన ఒక్క ఘటన మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉండొచ్చు. ఓవైపు అన్నదాత, నేతన్న, బడుగు, బలహీనవర్గాలవారు ఇబ్బందులను తట్టుకోలేక, ప్రభుత్వ తోడ్పాటు దొరకక రోజుకొకరు చొప్పున బలవన్మరణాలకు పాల్పడుతుంటే… మరోవైపు వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, మంత్రివర్గం, ఉన్నతాధికారులు తమ వాటాల పంచాయితీల్లో మునిగితేలుతున్నారు.
రాష్ట్రంలో గత ఏడాది కాలంగా జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమని మేధావి వర్గాలు అంటున్నాయి. మొన్న మంత్రికి తెలియకుండా ఓఎస్డీని తీసేయడం, నిన్నటికి నిన్న ఏకంగా ఆ మంత్రి ఇంటిపైకి టాస్క్‌ఫోర్స్ పోలీసులను పంపడం, నేడు క్యాబినెట్ మీటింగ్‌లోనూ మంత్రి కనిపించకపోవడం, తన నివాసాల వద్ద సెక్యూరిటీని తీసేయడం దాకా ఈ పంచాయితీ వెళ్లింది. వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మధ్య రూ.71 కోట్ల విలువైన మేడారం పనుల టెండర్ల విషయంలో తలెత్తిన వివాదంలా బయటికి కనిపిస్తున్నా… ఇది అంతకుమించినదని కొండా సుస్మిత వ్యాఖ్యలతో తేటతెల్లమైంది.
ఎక్కడి హుజూర్నగర్, ఎక్కడి డెక్కన్ సిమెంట్ కంపెనీ. ముఖ్య నేత, ఆయన అనుయాయుల కండ్లు ఆ కంపెనీపై పడ్డాయని, దాన్ని దోచుకోవడానికి ప్లాన్ వేశారని, కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవాలని రోహిన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డే పురమాయించారని, ఆ క్రమంలో పొడసూపిన వివాదాలే సుమంత్‌ను కుట్రలో ఇరికించడానికి కారణమయ్యాయని సుస్మిత పూసగుచ్చినట్టుగా వివరించారు. సీఎం, ఆయన తమ్ముళ్లు చేస్తున్న కుట్రలు ఆమె వెర్షన్‌తో స్పష్టమయ్యాయి. మంచిరేవులలో రోడ్డు కోసం దేవాదాయ శాఖ భూమి కబ్జా ప్లాన్‌కు సహకారమందించడం మొదలు సీఎంకు, ఆయన తమ్ముళ్లకు రోహిన్‌రెడ్డి షాడో ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి సీనియర్ మంత్రుల శాఖల్లోనూ ఆయన చెప్తేనే పనులు జరుగుతున్నాయని పేపర్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అంబర్పేట్ నుంచి పోటీ చేసి ఓడినా ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారని ఏకంగా మంత్రి కూతురే సెలవిచ్చారు.
ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని సుస్మిత తెలివిగా తమకు అనుకూల వెర్షనే చెప్పినా… బీసీ కార్డు వాడుతూ సానుభూతిని పొందాలని చూసినా… మొత్తానికే తనకేం తెలియదని కొండా మురళి అన్నా… నిజానిజాలు నిగ్గుతేల్చడం కోసం వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు సుమంత్‌ను అప్పగించకుండా, కేవలం బంధువని సాకులు చెప్తూ ఆయనను కాపాడటానికి ఏకంగా మంత్రే రంగంలోకి దిగడం అసలు బాగోతాన్ని బట్టబయలు చేసింది.
బంధువని చేస్తే అసలు సంగతి ఏమిటో, ఎంత పెద్దదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరన్నది వారి ఎత్తుగడ కావచ్చు. అయితే ఈ ఎపిసోడ్లో మరో మంత్రి ఉత్తమ్, డెక్కన్ కంపెనీ ప్రతినిధులు ఐజీకి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఏమైంది? తనకేమీ సంబంధం లేదని కొండా సురేఖతో ఉత్తమ్ ఎందుకన్నారు? అసలు సుస్మిత చెప్పిన వెర్షన్లో నిజానిజాలేంటి? అనేవి ప్రజలకు తెలియాల్సిందే.
రాష్ట్రంలో ఇప్పటికే మూసీ ప్రక్షాళన పేరుతో సామాన్యులను, మధ్యతరగతిని, పేదలను సర్కార్ భయకంపితులు చేస్తున్నది. ఎంజీబీఎస్‌ను ముంచడానికి చేసిన కుట్రలు కండ్లముందే ఉన్నాయి. మరోవైపు బడా బాబులు, ఎమ్మెల్యేలు దర్జాగా కబ్జాలు చేస్తుంటే కిక్కురుమనని హైడ్రా.. పేదలను, మధ్యతరగతిని మాత్రం ఎలా బెదిరిస్తున్నదో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే వీటన్నింటి వెనకాల ఉన్న తతంగమేంటో నిన్నటి కొండా వివాదంతో ప్రజలకు తెలిసిపోయింది. ఏదేమైనా… నయానో, భయానో బెదిరించాలని, ఆస్తులను దోచుకోవాలని, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టేయాలనే వారి తపన స్పష్టంగా సమాజం ముందుకువచ్చింది. అయితే ఏకంగా కెమెరాల సాక్షిగా ఓటుకు నోటిస్తూ దొరికిపోయాక కూడా తనను ముఖ్యమంత్రిని చేసిన సమాజం మీద సీఎంకు జాలి లాంటిది ఏదీ లేదని ఇప్పటికైనా నేటి సమాజానికి అర్థం కావాల్సి ఉంది.
‘ఇలా వసూళ్ల కోసం అవకాశాలు సృష్టించుకోవడం ఏయే శాఖల్లో, రంగాల్లో జరుగుతున్నది? అది కేవలం సీఎం స్థాయిలోనే ఆగిందా… లేక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు మొదలు అధికారం చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఇదే పని చేస్తున్నారా?’ అని ప్రజలు, ముఖ్యంగా యువత ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ అవినీతి భూతమనేది ఓ అంటువ్యాధి లాంటిది. రోజూ పేపర్ చదువుతున్న ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. మచ్చుకు కొన్ని చెప్పాలంటే మొన్న నిబంధనలను తుంగలో తొక్కి కార్మిక సంక్షేమ నిధి నుంచి రూ.349 కోట్లను గ్రూప్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీ ఖాతాలోకి మళ్లించారు.
నిన్న బాలానగర్‌లో వందల కోట్ల విలువ చేసే భూమిని ప్రైవేటుపరం చేశారు. వైద్యారోగ్య శాఖలోనూ విచ్చలవిడిగా అక్రమ కొనుగోళ్లు నడుస్తున్నాయి. సంక్షేమ శాఖల్లో గుడ్ల టెండర్లు మొదలు ట్రాన్స్ఫర్ల దాకా ఏం జరుగుతున్నదో నిత్యం చూస్తున్నాం. ఇక ఏసీబీ దాడుల పేరుతో జరుగుతున్న తతంగమూ వసూళ్ల పర్వానికేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వ పనితీరు ఇలా ఉంటే, మరోవైపు అధికారులూ తగ్గడం లేదు. నిన్నటికి నిన్న నీటిపారుదల శాఖలో చెరువు జాగాలకు ఎన్వోసీల వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని, ఉన్నత స్థాయి వ్యక్తులకు రావాల్సిన వాటాల్లో తేడాల వల్ల ఏకంగా 160 మందికి పైగా ఇంజినీర్ల బదిలీలు జరిగాయని, దీనికి తోడు తమ అనుయాయులను అందలమెక్కించడానికి పాతవారిని తప్పించారనే ఆరోపణలూ గుప్పుమంటున్నాయి.
ఇక భూముల సెటిల్మెంట్లు, ట్రాన్స్ఫర్ల పేరిట వసూళ్లు చేయడానికి జిల్లాలు మొదలు సచివాలయం వరకూ ఉన్నతాధికారులు ఏకంగా ప్రైవేట్ ఆఫీసులు తెరిచి తమ బంధువులతో ఫైల్స్ క్లియర్ చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే రెండేండ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నడిచిన ఈ తతంగం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఇన్నాళ్లు తమను కంట్రోల్లో ఉంచిన సూపర్ పవర్‌కు సైతం అవినీతి మూటలు చేరడం, తద్వారా వచ్చిన భరోసా మరింత దోపిడీకి ఎగదోసి ఉండొచ్చు. వెరసి అది మంత్రుల మధ్య వివాదాలను సైతం బహిర్గతం చేస్తున్నది. మొన్నటివరకు పొన్నం వర్సెస్ అడ్లూరి వయా శ్రీధర్‌బాబు అండ్ వివేక్ ఎపిసోడ్ నడవగా… నేడు పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ వయా సీతక్క వివాదం, నల్గొండ, ఖమ్మం మంత్రుల మధ్య నడుస్తున్న అంతర్గత పోరు, మంత్రుల పర్సంటేజీ వ్యవహారాలు ఇలా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అధిష్ఠానం అభిప్రాయం మారితే ఎవరుంటారో, ఎవరి పదవులు ఊడిపోతాయోనన్న భయంతోనే విచ్చలవిడి అవినీతికి తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ పర్సంటేజీల లొల్లి కారణంగానే మేడారం సమీక్షకు మంత్రి కొండా డుమ్మా కొట్టడమే కాకుండా, సొంత జిల్లాలో సీఎం కార్యక్రమాలకు దూరమయ్యారు. మంత్రి దామోదర, అనిరుధ్ రెడ్డి, ఇతరులు కలిసి సీఎంపై ఖర్గేకు ఫిర్యాదు చేశారనే వార్తలొస్తున్నాయి. ఇలా ఎక్కడ చూసినా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు యమునా తీరు అనే పాత కాంగ్రెస్‌ను గుర్తుకుతెస్తుంటే… సందట్లో సడేమియాలాగా ఐఏఎస్ అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారనే వార్తలు గు ప్పుమంటున్నాయి. మొత్తానికి మొన్నటి వరకూ తెలంగాణ అంటే పర్ఫెక్ట్ విజన్ అన్న నానుడి కాస్తా… పర్ఫెక్ట్ రివర్షన్ అన్నట్టుగా మారింది.
బీసీలం అయినందుకే సీఎం రేవంత్‌రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర రెడ్డివర్గంతో పాటు కడియం శ్రీహరి, వరంగల్ కాంగ్రెస్ నేతలు బస్వరాజు సారయ్య తదితరులు తమను టార్గెట్ చేశారని, బీసీలు ఎదిగితే వారు సహించలేరని, రాహుల్‌గాంధీ బీసీ నినాదంతో పనిచేస్తుంటే రాష్ట్రంలో అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొండా సుస్మిత ఆరోపించడం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో సమాజంలో అత్యధిక శాతం ఉన్న బీసీల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సుస్మిత ఆరోపణల నేపథ్యంలో బీసీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రజలు మరోసారి దృష్టిపెట్టాలి.
ఎందుకంటే… డెడికేటెడ్ కమిషన్ లేకుండా సర్వే చేయకూడదని తెలిసి కూడా మొదట ప్లానింగ్ కమిషన్‌తో సర్వే చేయిస్తామని చెప్పడం, తర్వాత బీసీ కమిషన్ అనడం, చివరకు కోర్టు ప్రమేయంతో డెడికేటెడ్ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించడం.. ఇలా నిలకడ లేని విధానాల ద్వా రా బీసీ రిజర్వేషన్లు చట్టాల ముందు నిలవకుండా చేసింది కాంగ్రెస్ సర్కారే. అది చాలదన్నట్టు మొదట బిల్లు, తర్వాత ఆర్డినెన్స్, చివరకు జీవో అనే రివర్స్ ట్రాప్ కూడా ఆ కుట్రలో భాగమేనన్నది స్పష్టమవుతున్నది. అందుకే హైకోర్టు మొదలు సుప్రీం వరకు అన్ని కోర్టులు ప్రభుత్వ చర్యలను కొట్టేశాయి. ఓ తెలంగాణ సమాజమా… ఈ కాంగ్రెస్‌తో తస్మాత్ జాగ్రత్త. ఈ కుట్రలను, దోపిడీలను అరికట్టాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. తద్వారా ఏం చేసినా చెల్లుతుందనే కాంగ్రెస్ అహంకారానికి, దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.
– (వ్యాసకర్త: ‘బందూక్’ చిత్ర దర్శకులు, సామాజికవేత్త)లక్ష్మణ్ మురారిశెట్టి