రానున్న కాలంలో విద్యుత్ యూనిట్‌కు రూ.50కి అమ్ముకునే స్వతంత్రం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఇచ్చింది. దిగుమతి చేసుకున్న బొగ్గు, సహజవాయువు లేదా నాఫ్తా ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు యూనిట్‌కు 50 రూపాయల వరకు విద్యుత్‌ను విక్రయించడానికి అనుమతించబడ్డాయి.
దిగుమతి చేసుకున్న 15 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో గుజరాత్‌లోని ముంద్రాలో టాటా పవర్, అదా నీ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. సలయలో ఎస్సార్ పవర్ ప్లాంట్, జెఎస్ డబ్ల్యూ రత్నగిరి, టాటా ట్రాంబే, ఉడిపి పవర్, మీనాక్షి ఎనర్జీ, జెఎస్డబ్ల్యూ, తోరంగల్లుల్ ప్లాంట్ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 17,600 మెగావాట్లు. సహజ వాయువు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 25,000 మెగావాట్లు.
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో కరెంటు కష్టాలు తప్పడం లేదు. పంజాబ్‌లోని రైతులు తమ పొలాలకు నీరందించడానికి తమకు కావలసినప్పుడు కరెంటు ఇవ్వటం లేదని ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నారు. 2023 ఏప్రిల్ నాటికి విద్యుత్ అవసరాలు దాదాపు 200,000 మెగావాట్ల నుంచి 230,000 మెగావాట్లకు అంటే 15% పెరుగుతాయని ప్రభుత్వ సొంత అంచనాలు చూపిస్తున్నాయి. వేసవిలో విద్యుత్ సరఫరాలో లోటును నివారించేందుకు మార్చి 16 నుంచి జూన్ 15 వరకు పూర్తి సామర్థ్యంతో నడపాలని విద్యుత్ మంత్రి త్వ శాఖ ఇప్పటికే 15 దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్లాంట్ల ను కోరింది. ఈ ప్లాంట్లు చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు అధిక ధర కారణంగా ఉత్పత్తికి అధిక వ్యయం అవుతున్నది. దీంతో ప్రభుత్వ యాజమాన్యంలోని పంపిణీ సంస్థలతో దీర్ఘకాలిక స్థిర ధరల సరఫరా ఒప్పందాలను కుదుర్చుకున్నందున వారు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడానికి నిరాకరించారు.
గతేడాది కరెంటు కొరత ఏర్పడినప్పుడు విద్యుత్‌కు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్)లో యూనిట్‌కు రూ. 20. ఐఈఎక్స్ అనేది ప్రతిరోజూ శక్తిని విక్రయించే, కొనుగోలు చేసే వేదిక. సరఫరా, డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయించబడతాయి.
విద్యుత్ సంస్థల లాభదాయకతకు వ్యతిరేకంగా నిరసనలు రావడంతో ప్రభుత్వం ఐఈఎక్స్‌లో విక్రయించే గరిష్ట ధర విద్యుత్‌ను రూ.12గా నిర్ణయించవలసి వచ్చింది.ఇప్పుడు ధరల పరిమితిని రూ.50కు పెంచడం ద్వారా , విద్యుత్ కొరతను పూర్తిగా ఉపయోగించుకోవడానికి, వినియోగదారుని, లాభదాయకుడిని దోపి డీ చేయడానికి ప్రభుత్వం ఈ విద్యుత్ కంపెనీలకు స్వేచ్ఛనిచ్చింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కూడా (2023 జనవరి 9న) ప్రభుత్వ యాజమాన్యంలోని అలాగే ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు కొరతను తీర్చడానికి దేశీయ బొగ్గుతో ఆరు శాతం చొప్పున కలపడానికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఆదేశించింది.
ఇది ఇతర దేశాలలో బొగ్గు గనులను కలిగి ఉన్న అదానీ, టాటా వంటి పెద్ద భారతీయ కార్పొరేట్ గ్రూపులకు మళ్లీ ప్రయోజనం చేకూరుస్తుంది.అదానీ గ్రూప్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, భారతదేశం అంతటా 50 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన బొగ్గు గనులను కలిగి ఉన్నది, గ్లోబల్ మార్కెట్లలో విక్రయించడానికి ,అదానీ స్వంత పవర్ స్టేషన్లలో ఉపయోగించేందుకు ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. గత సంవత్సరం కూడా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు అవసరాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్లను బొగ్గు దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దిగుమతి చేసుకున్న బొగ్గు వినియోగం వల్ల లేదా ఐఈఎక్స్ వద్ద అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని అదనపు ఖర్చులు వినియోగదారుల నుంచి వసూలు చేయబడతాయి.
ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద బొగ్గు నిల్వలు భారత్‌లో ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తికి ఏటా బొగ్గు కొరత ఎందుకు ఏర్పడాలి? దేశంలో అత్యధికంగా బొగ్గును రెండు ప్రభుత్వ రంగ సంస్థలు – కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ ఉత్పత్తి చేస్తున్నాయి. కొత్త బొగ్గు గనులను అభివృద్ధి చేయడం, బొగ్గు ఉత్పత్తి చేయడంలో ఈ రెండు కంపెనీలకు గొప్ప అనుభవం ఉన్నది. వారిని ప్రోత్సహించి, వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి వనరులను అందించడానికి బదులుగా, ప్రభుత్వాల తర్వాత ప్రభుత్వాలు ప్రైవేట్ బొగ్గు గనుల అభివృద్ధి, ఉత్పత్తిపై దృష్టి సారించాయి. కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ రెండూ తమ బొగ్గు బ్లాకులను ప్రైవేట్ మైనింగ్‌కు అప్పగించాలని కేంద్రం కోరింది. కొత్త బొగ్గు గనులను అభివృద్ధి చేయడం, దాని బొగ్గు ఉత్పత్తిని వేగంగా పెంపొందించడంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా ఎరువుల ఉత్పత్తి , పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో పెట్టుబడి పెట్టాలని కోల్ ఇండియాను కోరింది. గనుల నుంచి విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేసే సామర్థ్యాన్ని కూడా రైల్వేలు పెంచుకోవాలి. రైల్వేల విషయంలో కూడా, సరుకు రవాణాతో సహా వివిధ కార్యకలాపాలను ప్రైవేటీకరించే మార్గాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నది. పెరిగిన విద్యుత్ రేట్ల ద్వారా ప్రైవేటీకరణ విధానం వల్ల దేశ ప్రజలు ఇప్పటికే మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని ప్రజలు వ్యతిరేకించకపోతే రాబోయే సంవత్సరాల్లో ఈ భారం మరింత పెరుగుతుంది.
-ఆళవందార్ వేణు మాధవ్
86860 51752