రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వంటి విపత్తులను సైతం దీటుగా ఎదుర్కోగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్-19 వైరస్ను కట్టడి చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఏ మహమ్మారి వచ్చినా ఆదిలోనే అంతం చేసేందుకు వైద్యరంగాన్ని పటిష్ఠం చేస్తున్నది.
సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రాథమికంగా పౌరులకు కావలసినవి విద్య, వైద్యం. పౌరులు శారీరకం గా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలను చేపట్టింది. దేశంలో ఎక్కడాలేని విధంగా పలు వైద్య ఆరోగ్య పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వ దవాఖానలలో ప్రసవాలు పెరగడం కూడా దీనికి తాజా ఉదాహరణ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పౌష్ఠికాహారం అందిం చే దిశగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ‘బాలామృతం’, ‘ఆరోగ్యలక్ష్మి’ పథకాలను అమలుచేస్తున్నది. ‘అమ్మఒడి’ పథకం ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన మహిళలను ప్రభుత్వ వాహనంలో ఇంటికి తరలిస్తున్నది. దీం తో పాటు ప్రభుత్వం ‘కేసీఆర్ కిట్’ను అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.
నీతి ఆయోగ్ వెలువరించిన ‘ఆరోగ్య రాష్ర్టాలు- ప్రగతిశీల భారతదేశం’ నివేదికలో భారతదేశ వ్యాప్త ఆరోగ్య సూచిలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పనితీరు కనబరిచింది. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానాల్లో జరిగిన ప్రసవాల్లో 96.3 శాతంతో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పిల్లలకు టీకాలు వేయించే విషయంలోనూ మనది అగ్రభాగమే. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో వంద శాతం జననాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నయని ‘నీతి ఆయోగ్’ స్పష్టం చేసింది.
జిల్లా దవాఖానాల్లోని బాలింతల వార్డుల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వీటన్నిటితోపాటు పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో ఏఎన్ఎంలు, వైద్యాధికారులు ఉండటంతో ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం తదితర అంశాల కారణంగా ‘నీతి ఆయోగ్’ వార్షిక నివేదికలో మన ప్రగతి అద్భుతంగా ఉండటం ప్రధాన కార ణం. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘హెల్దీ అండ్ మిషన్ ఫిట్ నేషన్’ ప్రచారంలో భాగంగా మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణకు రెండు దక్కడంతో పాటు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రూపొందించిన ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు’ దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నది. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే అమలుచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు తన తాజా బడ్జెట్లో రూ.11,237.33 కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాది కన్నా మూడింత లు అధికంగా నిధులు కేటాయించడం విశేషం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదనడంలో సందేహం లేదు.