ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు మూడు సందర్భాల్లో కీలకమైన తీర్పులు వెలువరించింది. గవర్నర్, రాష్ట్రపతి, స్పీకర్ల విచక్షణాధికారాలకు ఏ మేరకు పరిమితులుంటాయన్న విషయమై ఈ తీర్పులు అత్యంత కీలకంగా మారాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2025, ఏప్రిల్ 8న తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు.. నాలుగు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 12న రాష్ట్రపతికి కూడా గవర్నర్ పంపించిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని తీర్పు చెప్పింది.
ఇప్పుడు తెలంగాణలో 10 మంది ఫిరాయింపుదారుల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ రకమైన రాజకీయాల్లో రెండు జాతీయపార్టీలూ ఒకే తాను ముక్కలేనని తేలిపోయింది. ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను నియంత్రించడానికి, ఇబ్బందుల పాలు చేయడానికి, ప్రాంతీయపార్టీల అస్తిత్వాన్ని కనుమరుగు చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడంలో రెండు జాతీయపార్టీలు ఒకదానిని మించినది మరొకటిగా చెప్పవచ్చు. ఫిరాయింపు చట్టం ఎందుకు తెచ్చారో కానీ… అది ఈ దేశ రాజకీయాల్లో ఎందుకూ పనికిరాకుండా పోయింది. దాన్ని చెత్తబుట్టలో వేస్తే సరిపోతుందేమో. స్పీకర్‌కు కాలపరిమితి లేని విచక్షణాధికారం ఉండటమనే ఒకే ఒక్క టెక్నికల్ అంశాన్ని అడ్డుపెట్టుకొని బ్లాటెంట్గా ఫిరాయింపులను ప్రోత్సహించే ఒక అనైతిక ప్రక్రియను స్పీకర్ చైర్ నిర్వహించడం అత్యంత దారుణమైన విషయం.
ఈ రకమైన ధోరణి ఇవాళే కొత్తగా జరిగిందేమీ కాదు. గతంలో 2004లో ఎన్నికైన టీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించింది నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం. దీనిపై టీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే.. అప్పటి స్పీకర్ వారిని ఏ పార్టీకీ చెందనివారిగా విడిగా కూర్చోబెట్టి.. సరిగ్గా అసెంబ్లీ చిట్టచివరి రోజున నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ జాడ్యం 2009లో కూడా కొనసాగింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకపోవడం, రాజీనామాలు చేస్తే… వాటినీ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం తెలంగాణ మలిదశ ఉద్యమంలో విపరీతంగా జరిగాయి. ఈ జాడ్యం చివరికి పార్లమెంట్‌కు కూడా తెలుగు రాజకీయాలతోనే అంటుకుంది.
2014లో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు పలు పార్టీల ఎమ్మెల్యేలు పార్టీ మారాలని, అధికార పార్టీలోకి చేరాలని ప్రయత్నించారు. ఇప్పటి కాంగ్రెస్ మాదిరిగా అప్పుడు టీఆర్ఎస్ విడివిడిగా ఎమ్మెల్యేల చేరికలను ప్రోత్సహించనే లేదు. నాడు టీడీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు చేరుతామంటేనే ఫిరాయింపు చట్టం పరిధిలో అనుమతించింది. ఇందులో నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి జాప్యం జరుగలేదు. ఆయా శాసనసభాపక్షాలు పూర్తిగా అధికార పార్టీలో విలీనమైపోయాయి. ఇది చట్టం పరిధిలో జరిగిందే తప్ప చట్టానికి తూట్లు పొడవలేదు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీ రావడంతోనే బీఆర్ఎస్ ఎల్పీని చీల్చాలని తెగ ప్రయత్నించింది. ఒక ఎమ్మెల్యేకు ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చింది.
మరో ఎమ్మెల్యే కూతురుకు టికెట్ ఇచ్చింది. ఇంకో ఎమ్మెల్యే కొడుక్కు భవిష్యత్తు చూపిస్తామంటూ కండువా కప్పింది. ఇట్లా ఓ పదిమందిని ఎరవేసి లాగింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపి మరీ కండువాలు కప్పివచ్చారు. కానీ, కొన్ని రోజులకే సీన్ రివర్స్ అయింది. సుప్రీంకోర్టులో కేసు పడింది. విచారణల సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ, స్పీకర్‌కు ఇచ్చిన డైరెక్షన్లు కానీ ఈ 10 మందిని డైలమాలో పడేసింది. తాము పలానా పార్టీ వాళ్లమని చెప్పుకొనే పరిస్థితి లేని దుస్థితిలో ఉండిపోయారు. చివరికి ప్రభు త్వం కూడా గట్టిగా మాట్లాడలేని దుస్థితి నెలకొన్నది. ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేకు పాత పార్టీ పేరుతోనే పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది.
సీఎల్పీ మీటింగ్‌కు ఒక ఫిరాయింపుదారు హాజరైతే.. ఆ విషయాన్ని కూడా గట్టిగా చెప్పుకోలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారంటూ డొంకతిరుగుడు జవాబులు ఇచ్చుకోలేక మంత్రులు నానా అవస్థలు పడ్డారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతనే స్పీకర్ ఈ ఫిరాయింపుదారులకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు బంతిని స్పీకర్ దిశగా బలంగా విసిరేసింది. దాన్ని తిరిగి కోర్టు వైపు కొట్టే అవకాశం ఇక స్పీకర్‌కు బహుశా ఉండదు. విచారణను ఏదో కారణం చెప్పి సాగదీసేందుకు ఫిరాయింపుదారులకూ అవకాశం లేదు.
ఈ కేసులో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్’ అన్న రీతిలో వ్యవహారం నడువరాదని స్పీకర్‌కు స్పష్టంగా సందేశం ఇచ్చింది. ఇంత జరిగాక కూడా స్పీకర్ కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని ప్రకటన వెలువడిందే తప్ప నిర్ణయాత్మకమైన కార్యాచరణ చేపడుతామని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే.. శాసనవ్యవస్థపై సుప్రీంకోర్టు ఎలాంటి నియంత్రణ చేయజాలదన్న ధీమా కావచ్చు. కాబట్టి ఏదో కొర్రీ పెట్టి సాగదీయాలనే స్పీకర్ చూస్తారు. కానీ, సుప్రీంకోర్టు కంటే ప్రజాకోర్టు ఉన్నతమైంది. దాన్ని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం?
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్) డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్