మహారాష్ట్రలో గత వారం కింద కొన్నిరోజుల పాటు పర్యటించినపుడు ఒక విషయం గుర్తించి ఆశ్చర్యం కలిగింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడినప్పటికీ అక్కడి ప్రజలు ఇప్పటికీ ఆ పార్టీని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ వేరే రాష్ట్రపు పార్టీ. అధికారంలో ఉండినపుడు మహారాష్ట్రలో ప్రచారం సాగించింది కొద్ది నెలలు మాత్రమే. అధికారం కోల్పోయి ఏడాది అవుతున్నది. తర్వాత కాలంలో అటు వైపు వెళ్లలేదు. ఈ మాటలన్నీ గమనించినప్పుడు మామూలుగానైతే అక్కడి ప్రజలు బీఆర్ఎస్ను మరిచిపోయి ఉండాలి. కానీ, పరిస్థితి ఆ విధంగా ఎంతమాత్రం లేదు. ఆశ్చర్యం కలగటం అందువల్లనే.
BRS | వెళ్లింది మరాఠ్వాడా, విధర్భ ప్రాంతాలకు. అక్కడ నాందేడ్ వంటి ఒక ముఖ్య నగరంతో పాటు కొన్ని పట్టణాలకు, గ్రామాలకు పోయి కలిసి మాట్లాడిన వారిలో పలు వర్గాల వారున్నారు. అందువల్ల, బీఆర్ఎస్ పట్ల అభిమానం, దానితో పాటు నమ్మకం అన్నవి మహారాష్ట్ర సమాజంలో విస్తృతంగా నేటికీ నిలిచి ఉన్నాయనే అభిప్రాయానికి రాక తప్పలేదు. అందుకు కారణాలు ఏమిటన్నది వారి మాటలలోనే వినేందుకు ప్రయత్నించాను. అవి విన్న మీదట, వారందరు చెప్పిన వాటి సారాంశం ఒకేవిధంగా ఉండటం గమనించాను. అప్పుడు అర్థమైంది బీఆర్ఎస్ మహారాష్ట్రలో నేటికీ ఒక భావనగా ఎందుకు సజీవంగా ఉన్నదో.
పైన పేర్కొన్న వేర్వేరు వర్గాల వారి మాటల సారాంశమేమిటో ముందుగా చూద్దాం. వారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమిటో పదేండ్ల పాటు గమనించారు. దానిని తమ పరిస్థితులతో పోల్చి చూసుకున్నారు. కేసీఆర్ తెలంగాణలో మాట్లాడుతున్నదేమిటో వార్తలు, సమాచారం అందుతూనే ఉన్నాయి. తర్వాత తమ వద్ద సభలలో చెప్పింది ప్రత్యక్షంగా విన్నారు.
మరొకవైపు తమ రాష్ర్టాలకు చెందిన వేర్వేరు పార్టీ ల నాయకులు చెప్పింది వింటూ ఈ రెండింటినీ పోల్చుకున్నారు. కేసీఆర్‌లో వారికి దేశ పరిస్థితులు, దేశాభివృద్ధి, దీర్ఘకాలిక దృష్టి విషయాలలో ఒక దార్శనికుడు కనిపించగా, ఇతర పార్టీల వారిలో కేవలం అధికారం కోసం ప్రజలకు మాయమాటలు చెప్తూ మోసగించే వారే ఉన్నారు. వీటన్నింటికి తోడు కేసీఆర్ తన ఆలోచనలేమిటో చెప్తూ పోయారు తప్ప ఇతరులను విమర్శిస్తూ గడపలేదు. అంతిమంగా, ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే అద్భుతమైన నినాదాన్నిచ్చి అందరి మనస్సులను తాకారు.
ప్రజల మాటల్లో రాజకీయపరమైనవి కూడా కొన్నున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిని వారు నిజమైన ఓటమిగా చూడటం లేదు. రాజకీయాలలో జయాపజయాలు జరుగుతూనే ఉంటాయన్నది ఒక అభిప్రాయం. కాంగ్రెస్ ఇచ్చిన మితిమీరిన హామీలు పనిచేశాయన్నది మరొక అభిప్రాయం. దానినట్లుంచితే, బీఆర్ఎస్ తెలంగాణలో ఓడినా మహారాష్ట్రలో తన పని కొనసాగించి ఉండవలసిందన్న మాట అంతటా వినిపించింది. అట్లా చేసి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే చెప్పుకోదగినన్ని స్థానాలు గెలిచి ఉండేదన్నారు వారు. కేసీఆర్ తెలంగాణలో మళ్లీ గెలిచి మరొక నాలుగేండ్ల తర్వాతనైనా సరే తిరిగి వచ్చినట్లయితే అంతే ప్రజాదరణ లభించగలదని చెప్పారు.
ఇవీ సారాంశాలు. వీటిని చుట్టుకొని ఉన్న వివరాలను, అందుకు సంబంధించి ప్రజల మాటలను, వాటిని ప్రతిఫలించే మహారాష్ట్ర స్థితిగతులను చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. వీటన్నింటిని కలిపి చూసినప్పుడు గాని, బీఆర్ఎస్ అక్కడ ఎందుకింకా సజీవంగా ఉన్నదో, కేసీఆర్ పేరు మరవలేనిదిగా మారిందో, భవిష్యత్తులో ఆయన తిరిగి తమ మధ్య కు రావాలనే కోరిక బలంగా ఉందో మనకు అర్థం కాదు. తాత్తికంగా చెప్పుకోవాలంటే, ఈ తత్తానికి మూలాలు, ఆధారాలు అక్కడి పరిస్థితులలో ఉన్నా యి. అక్కడి చారిత్రకమైన వెనుకబాటుతనంలో, రైతులూ పేదల ఘర్షణలలో, గురువులూ సంఘ సం స్కర్తలకు లభించిన ఎనలేని ఆదరణలో ఉన్నాయి. వర్తమానానికి వస్తే అన్ని పార్టీల వైఫల్యంలో, సామాన్యులలో తరతరాలుగా గూడు కట్టుకొని ఉన్న బాధ లో, నిరసనలో ఉన్నాయి. ఎక్కడైనా, ఎపుడైనా ఆర్థి క, సామాజిక స్థితిగతులు ఆ విధంగా ఉండి ఒక తాత్తికత ఏర్పడినప్పుడు ప్రజలు సహజంగానే దానినుంచి వెలికి వచ్చేందుకు ప్రయత్నిస్తారు. అం దుకు మార్గం ఒక దశలో కొందరికి ఒక సంఘ సం స్కర్త రూపంలో కనిపించవచ్చు. మరొక దశలో ఒక తిరుగుబాటు రూపంలో కావచ్చు. రాజకీయంగా చూస్తే ప్రస్తుతం కేసీఆరా, రేపు మరొకరా అన్నది కాదు ప్రశ్న. ఎవరైనా కావచ్చు.
ఆదిలాబాద్ జిల్లాను దాటి మరాఠ్వాడా ప్రాంతంలోకి అడుగుపెట్టడమే తడవు రెండు రాష్ర్టాలకు మధ్య గల తేడా ఏమిటో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆ రోడ్లు, గ్రామాలు, పట్టణాలు, ప్రజలు, దుకాణ సముదాయాలు, రవాణా బస్సులూ, సమస్తం ఆ తేడాను ప్రతిఫలిస్తాయి. వీటన్నింటి మధ్య గమనించదగినదేమంటే భూములన్నీ సారవంతమైన నల్లరేగడివి. అయినప్పటికీ సరిహద్దుకు ఇటు అభివృద్ధి, అటు వెనుకబాటుతనం అనే ఒకే ఒక్క తేడాలోనే పైన చెప్పుకున్న తాత్తికతకు గాని, కేసీఆర్ పట్ల పొంగుకొచ్చిన ఆశలకు గాని బీజాలున్నాయి. వాటిని ఆయన ఏ కారణం చేతనైనా సరే అదేవిధంగా వదిలివేసినట్లయితే, అది అక్కడి ప్రజలకు ఒక చారిత్రక విషాదం వంటిదవుతుంది. ఈ మాట అతిశయోక్తిగా తోచవచ్చు. అవునో, కాదో అర్థం కావాలనే స్వయంగా అక్కడికి వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడవలసి ఉంటుంది. పైన చెప్పినట్టు వీరు వారని గాక అన్ని వర్గాలలో, నగరాల నుంచి గ్రామాల వరకు, ఏడాది వ్యవధి తర్వాత కూడా మరొక రాష్ట్రంలో ఇటువంటి అభిప్రాయాలున్నప్పుడు, ఇది గాక మరొక మాట చెప్పగలమా?
టీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీని బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా ఒక మౌలికమైన, దీర్ఘకాలికమైన దార్శనికతతో మార్చిన కేసీఆర్, ఈ విధమైన కదలికలను అంతటితో అణగారిపోకుండా చూడవలసి ఉంటుంది. అట్లా జరగకపోతే అది ఒక విషాదమవుతుంది. ఈ సందర్భంలో చర్చించుకోవలసిన ముఖ్య విషయం ఒకటున్నది. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చినప్పుడు పలువురు పలు విధాలైన సందేహాలను, ప్రశ్నలను లేవనెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడినప్పుడు పలువురు పలు విధాలైన సందేహాలను, ప్రశ్నలను లేవనెత్తారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడినప్పుడు ఆ ప్రశ్నలు తీవ్రంగా మారాయి. అవి పార్టీ లోపలి నుంచి, బయటినుంచి కూడా వినిపించాయి. తిరిగి టీఆర్ఎస్గా మార్చాలనే ఒత్తిళ్లు పెరిగాయి. కానీ, అందుకు కేసీఆర్ నిరాకరించటం గమనించదగ్గది. ఎందుకు కాదంటున్నారో ఆయన వివరించిందీ లేనిది తెలియదు గాని, మనకుగా ఆలోచిస్తే తోచేవి కొన్నున్నాయి.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చటానికి ఏ కారణాలున్నాయో వాటికి ఇప్పటికీ అదే విలువ ఉందన్నది తమ అభిప్రాయం కావచ్చు. తెలంగాణలో ఒకసారి ఓడినంత మాత్రాన ఆ విలువ మాయమైపోదు. నిజానికి మన రాజ్యాంగం ప్రకారం చూసినా ప్రాంతీయతలకు, జాతీయతకు మధ్య వైరుధ్యమేమీ లేదు. బలమైన రాష్ర్టాలు, బలమైన కేంద్రం అనే మాట, సహకార ఫెడరలిజం అనే మరొక మాట ఉన్నాయి. కనుక వైరుధ్యమేమీ లేదని ఆ విధంగా కూడా స్పష్టమవుతున్నది. మరొక విధంగా చెప్పాలంటే, ఇంగ్లీషులో వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్ అన్నట్టు ఇది అందరి కోసం (రాష్ర్టాలు) ఒకరు (కేంద్రం), ఒకరి కోసం అందరూ వంటి స్థితి. ఈ అవగాహన గాని, రాజ్యాంగపరమైన ఏర్పాటుగాని సజావుగా సాగి ఉంటే పరిపాలనలు, పరిస్థితులు అందుకు తగినట్టే ఉండేవి.
కానీ, కాంగ్రెస్ నుంచి మొదలుకొని ఫ్రంట్ ప్రభుత్వాలు తప్ప, అందరూ అందుకు విరుద్ధంగా పాలిస్తూ వచ్చారు. సమతులనం లేని అభివృద్ధి, అంతర్గత వలసలు, అధికార కేంద్రీకరణలు, ధనిక వర్గాలకు అనుకూలమైన విధానాలు, రాష్ర్టాల హక్కులను హరించటం వల్ల ఈ రాజ్యాంగ లక్ష్యాలు దెబ్బతిని ఫెడరల్ శక్తులు మామూలుకు మించి బలపడుతూ వచ్చాయి. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా ఉంటాయి. కానీ, ఇటువంటి కారణాల వల్ల సహకార ఫెడరలిజానికి బదులు ఫెడరల్ శక్తులకూ, జాతీయత పేరిట చలామణి అయ్యే సెంట్రలిస్టు శక్తులకు మధ్య వైరుధ్యాలు ఏర్పడి క్రమంగా తీవ్రమవుతూ పోయాయి. ఆ విధంగా చూసినప్పుడు, దేశానికి ఒక జాతీయత, జాతీయ పార్టీలు ఎట్లాగైనా అవసరం గనుక అవి ఉంటూనే, ప్రాంతీయ పార్టీలు కూడా ఒక తప్పనిసరి అవసరంగా మారాయి.
ఇప్పుడు దీనినంతా పరిగణనలోకి తీసుకొని చూసినప్పుడు, కేసీఆర్‌కు తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆరెస్ అవసరమైనట్టే, తెలంగాణ ఒక భాగమైన దేశ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ కూడా అంతే అవసరమనిపించితే అందులో ఆశ్చర్యం గాని, వింత గాని ఏమీ ఉండనక్కరలేదు. ఆ రెండు సూత్రీకరణలు సహజ మిత్రుల వంటివి. ద్వైతాద్వైతాల సహ ప్రయాణమది. రెండింటి మౌలిక లక్ష్యాలు, దార్శనికతల మధ్య నిజమైన అర్థంలో ఎటువంటి వైరుధ్యం కనిపించదు. రూపాన్ని బట్టి అవి వేర్వేరు కావచ్చు. కానీ, సారాన్ని బట్టి ఒకటే. తాను తెలంగాణలో చేసిన కృషి తమ వద్ద కూడా జరగాలని మహారాష్ట్ర ప్రజలు ఒక పొడగింపును చెప్పుకొన్నట్టు, ఆ పొడగింపు దేశమంతటా జరగాలన్నది ఆయన ఉద్దేశమైతే, రెండు రూపాలకూ వాటి ఉమ్మడి సారానికీ వైరుధ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక, స్థూలంగా కాదు, సూక్ష్మంగా ఆలోచించటం అవసరం అని మహారాష్ట్ర ఉదాహరణ చెప్తున్నది. వాస్తవానికి, రెండింటి మధ్య వైరుధ్యాన్ని ఇటువంటి స్థూలమైన దృష్టితో తెలంగాణలోని ‘అర్బన్ క్రౌడ్’ అనబడేది చూసింది. వారు, ప్రతిపక్షాలు కలిసి ప్రచారాలు చేసి కొందరిని నమ్మించారు. కానీ, నేను తెలంగాణ గ్రామీణులతో, పట్టణాలలోని సామాన్యులతో మాట్లాడినంతవరకు, వారికి అటువంటి వైరుధ్యమేమీ తోచలేదు, పట్టించుకోలేదు. మహారాష్ట్రలో, ఆ కాలంలో కేసీఆర్‌ను సంప్రదించిన ఇతర రాష్ర్టాల వారిలోనూ సరిగా అంతే జరిగిందనుకోవాలి.
-టంకశాల అశోక్