భారతదేశంలో మొత్తం జనాభాలో సగానికి పైగా బీసీలున్నారు. వారు తమ అస్తిత్వాన్ని గుర్తు చేసినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసహనానికి గురవుతున్నట్టు కనబడుతాయి. బీసీ అన్న పదం వినపడితే చాలు, ప్రభుత్వాలు ఒకింత ఉలికిపాటుకు గురవుతాయి. ఈ ఉలికిపాటు ఇప్పటిది కాదు, భారత రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో ‘వెనుకబడిన వర్గాలు’ అనే మాట వచ్చినప్పటి నుంచి అదే తీరు. నాడు దేశం మొత్తం ఉలిక్కి పడింది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ‘ఇతర వెనుకబడిన వర్గాల’కు హక్కులను ప్రతిపాదించినప్పుడు మెజారిటీ రాజ్యాంగసభ సభ్యులు వ్యతిరేకించారు. వెనుకబడిన వర్గాలు అంటే అంటరాని వర్గాలుగానే రాజ్యాంగసభ గుర్తించింది. ఇతర వెనుకబడిన వర్గాలుగా భారతీయ సమాజాన్ని చీల్చవద్దని అంబేద్కర్ను నిలువరించింది. సామాజిక విద్యాపరంగా వెనుకబాటును అంటరాని కులాల్లో గుర్తించినట్టుగా రాజ్యాంగ సభ బీసీలలో గుర్తించలేదు. బీసీల అస్తిత్వాన్ని గుర్తించాలని రాజ్యాంగ సభలో అంబేద్కర్ తీవ్ర ప్రయత్నం చేశారు. ఆర్టికల్ 340 ద్వారా ఇతర వెనుకబడిన తరగతుల సామాజిక విద్యాపరంగా వెనుకబాటును లెక్కించడానికి కమిషన్ ఏర్పాటుచేయడానికి రాష్ట్రపతికి అధికారం ఇచ్చారు. ఆ కమిషన్ ఇతర వెనుకబడిన తరగతుల వెనుకబాటును అరికట్టడానికి తగు చర్యలు సూచించవచ్చు. కానీ, కేంద్రం ఇతర వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటును పట్టించుకోలేదు. ఇతర వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కమిషన్ నియమించనందుకు నిరసనగా డాక్టర్ అంబేద్కర్ తన న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత అప్పటి రాష్ట్రపతి 1953, జనవరి 20న కాకా కాలేల్కర్ అధ్యక్షతన మొదటి వెనుకబడిన వర్గాల కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇతర వెనుకబడిన వర్గాల వెనుకబాటుకు కులమే ప్రధాన కారణమని తేల్చిచెప్పింది. కుల ఆధారిత జనగణన 1961 లోపే పూర్తి చేయాలనీ కేంద్రాన్ని కోరింది. దేశమంతా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అమలుచేయాలని నొక్కిచెప్పింది. ఈ పూర్తి నివేదికను 1955, మార్చి 30న రాష్ట్రపతికి సమర్పించింది. కానీ, విచిత్రమైన విషయమేమంటే ఈ నివేదికను మెజారిటీ కమిషన్ సభ్యులు అంగీకరించినప్పటికీ సాక్షాత్తు కమిషన్ చైర్మన్ అయిన కాకా కాలేల్కర్ తానుగా సమర్పించిన నివేదికను తానే తిరస్కరిస్తూ 31 పేజీల అసమ్మతి నోట్ రాశారు. ఆ తర్వాత1978 డిసెంబర్ 20న బీపీ మండల్ అధ్యక్షతన 2వ జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటైంది.
ఆ కమిషన్ 40 సిఫారసులతో కూడిన నివేదికను 1980లో రాష్ట్రపతికి అందజేశారు. కానీ, అప్పుడున్న కేంద్రం ఆ సిఫారసులను పక్కనబెట్టింది. ఆ తర్వాత 1990 ఆగస్టు 7న నాటి ప్రధాని వీపీసింగ్ మండల్ కమిషన్ సూచించినట్టు ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. వెంటనే తేరుకున్న ఆధిపత్య కులాలు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మెరిట్ దెబ్బ తింటుందని గగ్గోలు పెడుతూ ఉద్యమాలు మొదలుపెట్టాయి. దేశం మొత్తం రిజర్వేషన్ అనుకూల వర్గం, రిజర్వేషన్ అననుకూల వర్గంగా చీలిపోయింది. సీపీఐ, సీపీఎం, బీజేపీ అండతో నడుస్తున్న ప్రభుత్వం సరిగ్గా వీపీ సింగ్ ప్రకటన తర్వాత మూడు నెలలకు, అంటే 1990 నవంబర్ 7న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అప్పటి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభు త్వం కుప్పకూలింది.
మండల్ కమిషన్ నివేదికను అమలు పరచకూడదంటూ దేశబంధు కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గోస్వామి అనే విద్యార్థి నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొన్ని నెలలకు చనిపోయాడు. మీడియాతో సహా దాదాపు అన్ని పార్టీలు ఓబీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. పదవి పోయినా కానీ, ఈ రిజర్వేషన్లను ఇతర వెనుకబడిన వర్గాలకు ఇవ్వాల్సిన ఆవశ్యకతను వీపీ సింగ్ నొక్కిచెప్పారు. మండల్ కమిషన్ నివేదికలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ఆధిపత్య కులాలు పార్టీలకతీతంగా ఒకటయ్యాయి. చివరికి మండల్ కమిషన్ రిపోర్టు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కానియా నేతృత్వంలోని 9 మంది జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కుల ఆధారిత రిజర్వేషన్లు సబబే అంటూ 1992లో ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి విధిస్తూ, 27 శాతం రిజర్వేషన్లను కొనసాగించాలంటూ తీర్పునిచ్చింది. ఇది చరిత్రలో మండల్ కేసుగా నమోదైంది.
మండల్ నివేదిక ప్రకారం.. 52 శాతం ఉన్న ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. 10 శాతమే ఉన్న ఆధిపత్య కులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లను మోదీ సర్కార్ కల్పించింది. ఓబీసీల రిజర్వేషన్లకు అడ్డువచ్చిన 50 శాతం పరిమితి, ఆధిపత్య కులాల రిజర్వేషన్లకు రాకపోవడం గమనార్హం. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగానికి ఒక లక్ష్యం ఉంటుంది. భారతదేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ మూడింటిని సంపూర్ణంగా చేరుకున్న నాడు మనం నిజమైన గణతంత్రాన్ని సాధించుకున్నవాళ్లమవుతాం. ఈ దేశంలో కులం వల్లనే వెనుకబడిన వర్గాలుగా మార్చబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు అగ్రకులాలతో సమానమైన, సామాజిక స్థాయి చేరుకున్న నాడే భారత రాజ్యాంగ లక్ష్యం నెరవేరినట్టవుతుంది.
(వ్యాసకర్త: హైకోర్టు న్యాయవాది,బీసీ స్టేట్ మహిళ నాయకురాలు)
-పేరం అలేఖ్య
63045 71117