ప్రకృతి ధిక్కార స్వరాన
పరస్పర ఆలోచనలోచనా గమనమేది?
సూత్రాల శాస్ర్తాల ప్రామాణికతను మించిన
పర్యావరణ ప్రభావాల అంచనాల వంచన
ధరిత్రి ధర్మాధర్మాల మీద కత్తుల వంతెన
ఇజాల ముసుగున నిజాల సమాధిలో
మనమన్నది మనమన్నది
ఎండమావి నిజాన
నిషావిలాపమెంతసేపు?
అంతరాల జ్ఞాపకాల దొంతరలో
అనుజన్ములు అనృతమే
పరీవాహ తీరాల దూరాలను చెరిపే
రాజ్యాల నేటి నీటి శాసనాలు
రాతియుగ నీడలో మరణ శాసనాలు
ఆశల శ్వాసల శాసనాల నిషా నిదురలోన
పర్యావరణ పొత్తిళ్ళ ఒక్కళ్ళ ఒత్తిళ్లు
దాహానికి దాహార్తికి అంతరార్థ చిక్కుళ్ళు
దారిలేని పయనం నీతిలేని చలనం
ఓరిమిని ఓటమిని భ్రమను విడిచి
కొండకోనల్లో కోయిల గానం
బనకచర్ల బందూకు నీడన
మూగబోయిన నీటి కథకు
నెత్తుటి చారలు నింపిన చరిత్ర మరిచి
ద్వేషాగ్నితో చతుర్భుజ
భవ భుజంగాల భరతం పట్టే
మరో ఉద్యమ చైతన్యం
జడలు విప్పుతది…