రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడానికి అడ్మిషన్ అవుట్‌రీచ్, మొబిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇటీవల ఆదేశించారు. దీని ప్రకారం అధ్యాపకులు తాము పనిచేస్తున్న కళాశాల నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోని జూనియర్ కళాశాలలను మ్యాప్ చేయాలి. మెరిట్ గల విద్యార్థులను గుర్తించాలి. ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. బ్రోచర్లు తయారుచేయాలి. ప్రతి వారం నివేదికలు సమర్పించాలి.
ఇది కళాశాలలను బలోపేతం చేసే చర్యలో భాగంగా, ఒక సాధారణ అడ్మిషన్ ప్రక్రియలా పైకి కనిపిస్తున్నది. ఈ చర్య విద్యావ్యవస్థలో స్పష్టమైన అవాంఛనీయ మార్పునకు సంకేతం. విమర్శనాత్మక దృష్టిని, స్వతంత్ర ఆలోచనాపరులను, సామాజిక సమస్యలకు పరిష్కారాలను అన్వేషించేవారిగా విద్యార్థులను తయారుచేయాల్సిన కళాశాల విద్య లక్ష్యం మార్కెట్ అవసరాల కోసమే అనే ధోరణి బలపడుతున్నది. ఈ మార్పును ‘ఎండోజెనస్ ప్రైవేటైజేషన్’ అని చెప్పవచ్చు. అంటే ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రైవేట్ విధానాలను అనుసరించడం.
ప్రభుత్వ విద్యావ్యవస్థ సమానత్వం, సామాజిక బాధ్యత అనే విలువల మీద ఆధారపడి ఉంటుంది. కళాశాలలు అందరికీ సమాన, నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటయ్యాయి. కానీ ఒకదానితో ఒకటి పోటీ పడటానికి కాదు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలు ఈ భావనను పూర్తిగా మార్చుతున్నాయి. మెరిట్ విద్యార్థులను ఆకర్షించాలని చెప్పడం ద్వారా కళాశాలలను మార్కెట్లో పోటీదారులుగా మార్చుతున్నారు. 100 కిలోమీటర్ల పరిధి ఇప్పుడు విద్యాపరిధి కాదు.. అది ఒక మార్కెట్ ప్రాంతం. ఒకే ప్రాంతంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉన్నప్పుడు, అందరూ ఒకేవిధంగా మెరుగైన విద్యార్థులను ఆకర్షించడానికి పోటీ పడితే, మిగతా విద్యార్థులు ఎక్కడికి వెళ్తారు?
ఈ పోటీ ప్రభావం క్రమంగా పాఠ్యాంశాలపై పడుతుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు లాజిస్టిక్స్, రిటైల్ మేనేజ్మెంట్, డాటా సైన్స్ వంటి వాటికి ప్రాధాన్యం పెరుగుతున్నది. ఇవి అవసరమే అయినా, మార్కెట్ అవసరాలే ప్రధాన ప్రమాణంగా మారితే, హ్యుమానిటీస్, బేసిక్ సైన్సెస్ వంటివి పక్కకు తొలగిపోతాయి. ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే కొత్త నైపుణ్యాలతో ప్రయోజనం ఉండదు. అదేవిధంగా బోధన తీరు కూడా మారుతుంది. ల్యాబ్ డిమోనిస్ట్రేషన్లు, క్యాంపస్ ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు ముఖ్యమవుతాయి. బోధన కంటే ప్రదర్శనకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇప్పటికే ఈ రకమైన పనితీరుతో కళాశాలలు ప్రదర్శనా వేదికలుగా మారాయి.
ఇప్పుడు అధ్యాపకులు జూనియర్ కళాశాలలకు వెళ్లాలి. ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. బ్రోచర్లు తయారుచేయాలి. విద్యార్థులను ఆకర్షించాలి. దీనికోసం వాస్తవాతీత ప్రమాణాలు కూడా చేయాల్సి వస్తున్నది. ఉపాధ్యాయుల పని బోధించడం, మార్గనిర్దేశం చేయడం, జ్ఞానం సృష్టించడం. కానీ మార్కెటింగ్ చేయడం కాదు. ఈ ప్రక్రియలో వారానికోసారి నివేదికలు, సమీక్షలు తప్పనిసరి చేశారు. ఇది ఆడిట్ కల్చర్ పెరుగుదలకు ఉదాహరణ. ఇందులో పనిని సంఖ్యల్లో కొలుస్తారు. అధ్యాపకులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. సృజనాత్మకత తగ్గి, కేవలం ఆదేశాల అమలు మాత్రమే మిగులుతాయి. కళాశాలలకు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్టు చెప్పినా, వాస్తవానికి నియంత్రణ పెరుగుతుంది.
ప్రభుత్వం ఆదేశించిన తాజా మార్పులను సరిదిద్దడానికి కృషి చేయాల్సిన సంఘాలు పోస్టర్లు విడుదల చేస్తున్నాయి. వీటిని గొప్ప కార్యక్రమాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఇది అవగాహన లోపం కావచ్చు లేదా అధికారులతో చేతులు కలిపిన వైఖరి కావచ్చు. అధ్యాపక సంఘాల బాధ్యత ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడడం. విద్యావాతావరణాన్ని రక్షించడం. కానీ అవే సంఘాలు సరికొత్త మార్పులకు మద్దతిస్తే, అది ప్రజావిద్యకు ప్రమాదకరం. కళాశాలలు పరస్పరం పోటీ పడతాయి. దీనివల్ల అసమానతలు పెరుగుతాయి. విద్య మార్కెట్ ఆధారంగా మారుతుంది. అధ్యాపకుల స్వాతంత్య్రం తగ్గుతుంది. ఇది కేవలం విద్య సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్య సమస్య. ప్రజావిద్య లక్ష్యం విమర్శనాత్మక ఆలోచన కలిగిన పౌరులను తయారుచేయడం. అది మార్కెట్‌గా మారితే, ఈ లక్ష్యం దెబ్బతింటుంది.
ఈ పరిస్థితికి పరిష్కారం పోటీ పెంచడం కాదు. ప్రజావిద్య అసలు విలువలను మళ్లీ స్థాపించాలి. అన్ని ప్రభుత్వ కళాశాలలు పరస్పరం సహకరించాలి. విద్యార్థుల సమాన పంపిణీ ఉండాలి. అధ్యాపకుల గౌరవం కాపాడాలి. అధ్యాపక సంఘాలు తమ బాధ్యతను గుర్తించాలి. అధికారాల అనుబంధాలుగా కాకుండా, విద్యావిలువల రక్షకులుగా పనిచేయాలి. లేకపోతే, ఈ ఎండోజెనస్ ప్రైవేటైజేషన్ నిశ్శబ్దంగా కొనసాగుతూ, ప్రజావిద్య లక్ష్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
(రచయిత: అధ్యాపకుడు)
-ఎడమ శ్రీనివాసరెడ్డి
99499 05069