తొలి తెలుగు స్వతంత్ర కవి, వీరశైవ విప్లవ కవి – పాల్కురికి సోమనాథుడు. ఆయన రాసిన బసవ పురాణం తెలుగులో మొదటి స్వతంత్ర కావ్యం. సంఘ సంస్కర్త, విశ్వ గురువు బసవన్న ఇతర శివ శరణుల వాస్తవ గాథ అది. సోమనాథుని మరొక గొప్ప రచన- పండితారాధ్య చరిత్ర. అది మల్లికార్జున పండితారాధ్యుని జీవిత చరిత్రే కాదు, నాటి సమాజాన్ని చిత్రించిన విజ్ఞాన సర్వస్వం. సోమనాథుడు తెలుగువారి విజ్ఞాన ఖని. ఆయన జన్మ స్థలం తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామం. పాలకుర్తిలో ఈ నెల 4న పాల్కురికి సోమనాథుని భారీ విగ్రహావిష్కరణ ఒక చారిత్రక ఘటన.
పాల్కురికి సోమనాథుడి విగ్రహాన్ని పాలకుర్తిలో ప్రతిష్ఠించాలని 1992లో ఏర్పడిన సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రయత్నాలు ప్రారంభించింది. బసవ కల్యాణ పట్టణంలోని బసవన్న గుడిలోనున్న పాల్కురికి సోమనాథుని కుడ్య చిత్రాన్ని సేకరించింది. ఈ ప్రయత్నాలను తెలుసుకొన్న తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పేర్వారం జగన్నాథం సంతోషపడ్డరు. సోమనాథ కళాపీఠం నుంచి 1994లో దరఖాస్తు తీసుకొని నాలుగు అడుగుల ఎత్తయిన సోమనాథుడి విగ్రహాన్ని చెక్కించి పాలకుర్తికి పంపించిండ్రు. రాపోలు ఆనంద భాస్కర్, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, మార్గం లక్ష్మీనారాయణ ఎప్పటికప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకొని విగ్రహ ప్రతిష్ఠాపనకు సహకరిచిండ్రు. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు గంగు కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి పందిళ్ల శేఖర్ బాబు చక్కని కోష్టాన్ని నిర్మించి విగ్రహాన్ని సందర్శకులకు అందుబాటులో ఉంచిండ్రు. 2003 మార్చి 3 నాడు లాంఛనంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఇక్కడ సోమనాథ కళాపీఠం పురస్కార ప్రదానోత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో సోమనాథునికి మొదటి మొక్కు చెల్లింపుతో పాటు, ప్రతి ఫాల్గుణ పౌర్ణమికి దీపారాధన ఇక్కడ నిర్వహిస్తున్నారు. 2017 డిసెంబర్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదిక వద్దకు ఇక్కడి నుంచి సాహితీ జ్యోతిని పంపించారు. పాలకుర్తిలో బసవేశ్వర విగ్రహం కూడా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన శివశరణ కొండ బసవరాజు సొంత డబ్బులతో శిలా విగ్రహాన్ని చేయించిండ్రు. సోమనాథుని విగ్రహం పక్కనే ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు 2018, ఏప్రిల్ 18న ఆవిష్కరించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సోమనాథుని జన్మస్థలం విషయంలో కొందరు ఆంధ్రా పండితులు రచ్చ చేసిండ్రు. సామిడి జగన్‌రెడ్డి, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వంటి పరిశోధకులు ఆ గాలి వాదనలను గట్టిగా తిప్పి కొట్టిండ్రు. రచయితలు, ఉద్యమకారులు పాలకుర్తి మట్టి ముట్టుకొని ప్రేరణ పొందిండ్రు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాల్కురికి సోమనాథుని తెలంగాణ ఆది కవిగా ప్రకటించిండ్రు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక 2017లో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పాలకుర్తికి వచ్చి సోమనాథుని స్మృతి వనం, సోమనాథుని భారీ విగ్రహ ప్రతిష్ఠాపనకు నిధులు విడుదల చేసిండ్రు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి (వాల్మీకిపురం) కలుపుకొని పర్యాటక వలయం రూపొందించాలని అధికారులను ఆదేశించిండ్రు. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ఆ తర్వాత జనగామ జిల్లా కలెక్టర్లు దేవసేన, నిఖిల, శివలింగయ్య పర్యాటక వలయం నిర్మాణం కోసం ఎంతో సహకరించిండ్రు. పాలకుర్తి ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి పర్యాటక వలయాన్ని తన జీవితాశయంగా మలచుకొన్నరు.
సోమనాథుని స్మృతి వనం కోసం స్వయంభూ శ్రీ సోమేశ్వరస్వామి వెలిసిన క్షీరగిరి దాపున ఉన్న కోనమ్మ బోడును ఎంచుకొన్నరు. 12 అడుగుల ఎత్తు, 10.5 టన్నుల బరువున్న సోమనాథుని భారీ శిలా విగ్రహాన్ని చెక్కించిండ్రు. కింద 83 అడుగులు, పైన 9 అడుగుల వెడల్పు, 46 అడుగుల ఎత్తు, 8 ఏటవాలు స్తంభాలతో నిర్మించిన స్తూపాకార వేదికపై 2022, సెప్టెంబర్ 6న విగ్రహాన్ని పొందించిండ్రు. సమావేశ మందిరం, కార్యాలయం, ఆహారశాల భవనాలు నిర్మించి ఆ ప్రాంగణమంతా సుందరీకరణ చేయించిండ్రు. ఇలా సర్వాంగ సుందరంగా సిద్ధమైన పాల్కురికి సోమనాథుని స్మృతి వనాన్ని మంత్రులు దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోత్ కవిత సమక్షంలో ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరిచిండ్రు. ఆలయ ఆధునికీకరణలో భాగంగా దేవుని గుట్ట మెట్టు దారి పక్కన ఉన్న సోమనాథుడు, బసవేశ్వరుడు విగ్రహాలను స్మృతి వనంలోనికి చేర్చిండ్రు. సోమనాథుని ఈ చిన్న విగ్రహాన్ని వేదిక నీడన పెద్ద విగ్రహం కింద ప్రతిష్ఠ చేయాల్సి ఉన్నది. బసవేశ్వర విగ్రహాన్ని కూడా సముచితమైన చోట ఏర్పాటు చేయాల్సి ఉన్నది. పండితారాధ్యుడి విగ్రహాన్ని చేయించాల్సి ఉన్నది. పాలకుర్తి చెరువులో మడివేలు మాచయ్య గుడి కట్టించాల్సి ఉన్నది. ఇంకా శివ శరణుల విగ్రహాలు చేయించి రహదారి మధ్య, అనువైన మరికొన్ని చోట్ల ప్రతిష్ఠించాల్సి ఉన్నది. త్వరలో మిగతా పనులు పూర్తి కాగలవని సోమనాథుని అభిమానులు ఆశాభావంతో ఉన్నరు. ఇప్పటికే పాలకుర్తికి పర్యాటకుల రాక పెరిగింది.
(వ్యాసకర్త: అధ్యక్షుడు, సోమనాథ కళా పీఠం, పాలకుర్తి)
– డాక్టర్ రాపోలు సత్యనారాయణ 94401 63211