తెలంగాణ అనే కోటి రతనాల వీణ ఇక్కడి పర్యాటకం ఘనం, సంస్కృతిఘనం, చరిత్ర ఘనం, సంప్రదాయాలు ఘనం అంటూ కమ్మని పాట పాడుతున్నది. తెలంగాణ 3 వేల ఏండ్లకు పైగా ఘన చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, కళల, వైభవ, ప్రాభవాలకు ప్రతీక. ఎన్నో పర్యాటక ప్రాంతాలు తెలంగాణ సాధించిన ప్రగతికి కీర్తి పతాకాలు. రాష్ట్రంలోని 200లకు పైగా ఉన్న పర్యాటక ప్రాంతాలు 33 జిల్లాల ఖ్యాతిని ప్రపంచానికి ఘనంగా చాటుతున్నాయి. టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, రూరల్ టూరిజం, పర్యావరణ టూరిజం ఇలా వివిధ రకాల పర్యాటకాలతో వర్ధిల్లుతున్న తెలంగాణ దేశ, విదేశీ పర్యాటలకును విశేషంగా ఆకర్షిస్తున్నది.
శ్రీరాముడు, గౌతమబుద్ధుడు, నడయాడిన పవిత్రభూమి తెలంగాణ. కాకతీయ చక్రవర్తులు రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన మహనీయులు పుట్టిన వీరగడ్డ ఇది. వనదేవతలు మేడారం సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, జంపన్నలు ప్రభవించిన శౌర్య నేల. తుగ్లక్‌లు, కుతుబ్‌షాహీలు, మొగలాయిల అరాచక పాలనల నుంచి విముక్తి కోసం ఉద్యమించిన సర్దార్ సర్వాయి పాపన్న వంటి ఎందరో శూరులూ ఆవిర్భవించిన పౌరుష, పరాక్రమాల ధీర ధరణి. మహాశిల్పి రామప్ప ఉలి విన్యాసంతో సృజించబడిన నర్తకుల నాట్యాలతో మైమరపింపజేస్తున్న రమణీయ, కమనీయ శిల్పకళా వైభవశాల రామప్ప దేవాలయం. ఇంకా అనేక కళాఖండాల పరంపరల అపూర్వ శిల్పకళల వెలుగుల విరాజిత అవని తెలంగాణ.
శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, తూర్పుచాళుక్యులు, పశ్చిమచాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, నిజాంరాజులు తదితరుల పాలనలకు ప్రతీకలుగా, మహా రాచరిక వైభవ, ప్రాభవాలకు నిలువుటద్దాలుగా, నిలువెత్తు సాక్ష్యాలుగా, ప్రాచీన చిహ్నాలుగా, వందల, వేల ఏండ్ల కాల పరీక్షలకు తట్టుకుంటూ, ఎదుర్కుంటూ, నాటి మహెూన్నత చరిత్రను ఘనంగా చాటుతున్న అద్భుత కట్టడాలు, విశేషంగా ఆకర్షించే కోటలు, గిరిదుర్గాలు, జలదుర్గాలు, స్థలదుర్గాలు, వనదుర్గాలు…. భగవంతుడిని సాక్షాత్కరింపజేసి గుండెల నిండా భక్తి పారవశ్యాన్నీ, ఆధ్యాత్మిక పరిమళాల్ని నింపే దేవాలయాలు, మదినిదోచే శిల్పకళా సౌందర్యాలు, ఆహ్లాదపరిచే అభయారణ్యాలు, పులకరింపజేసే ప్రకృతి సోయగాలు, ముగ్ధమనోహరంగా కట్టిపడేసే జలాశయాలు, జలపాతాలూ, వేల ఏండ్లనాటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, వారసత్వ, వైభవ, ప్రాభవాన్ని, మహోన్నతంగా, మహెూజ్జలంగా ప్రకాశింపజేస్తున్న పర్యాటక ప్రదేశాలు. పర్యాటకులకు జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతున్నాయి. వాటిని మనోహరంగా, ఉల్లాసంగా, ఉద్వేగంగా, ఉత్సాహంగా కన్నుల పండువగా ఆస్వాదిస్తున్నారు.
టెంపుల్ టూరిజం : అద్భుతమైన శిల్ప కళకు తెలంగాణలోని గుళ్ళూ, గోపురాలూ, పురాతన కట్టడాలు నిలయాలు. ములుగు జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, మేడారం సమ్మక్క-సారక్క క్షేత్రం, మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం, వరంగల్ జిల్లాలోని ఖిలావరంగల్ (కోట), కాకతీయ కళాతోరణాలు చూసి తీరాల్సిన ప్రదేవాలు. భద్రకాళీ దేవాలయం, హనుమకొండ (జిల్లా)లోని వేయిస్తంభాల గుడి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి శ్రీరామ క్షేత్రం, పర్ణశాల, యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరి (యాదాద్రి) గుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం, నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీజ్ఞానసరస్వతీ క్షేత్రం, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రాలు పురాణ, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పుణ్య క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. మెదక్ జిల్లాలోని మెదక్ చర్చి, ఏడుపాయల దుర్గామాత ఆలయం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్ శ్రీ మహంకాళి దేవాలయం తదితర ఆలయాలు యాత్రికులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
గిరిజన పర్యాటకంగా : ములుగు జిల్లాలో ములుగు గట్టమ్మ ఆలయం, లక్నవరం చెరువు, మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర, తాడ్వాయి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం, దామెరవాయి, మల్లూరు, బొగత జలపాతాలు ఎంతో అభివృద్ధి జరుగగా పర్యాటకులతో కళకళలాడుతున్నాయి.
గుట్టలపై చిత్రాలు (రాక్ఆర్ట్స్) : మెదక్ జిల్లాలోని శివారు వెంకటాపురం-వర్గల్-ఎదితానూర్, హతల్పూర్- ధర్మారంలు ఇటీవల అభివృద్ధి చెందాయి.
వారసత్వ ఆధ్యాత్మిక వలయం : నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, భువనగిరికోట, కొలనుపాక ఆలయాలు, బౌద్ధక్షేత్రం-ఫణిగిరి, త్రికూటాలయాలు, పాకాల సోమేశ్వరాలయం, నాగులపాడు, దేవరకొండ, రాచకొండ కోటలను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక వలయాలుగా తీర్చిదిద్దింది. ఇలా వివిధ రకాల పర్యాటకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పర్యాటకులకు ఎన్నో మధురానుభూతులు మిగులుస్తున్నది.
ఎకో టూరిజం: ఇటీవల కాలంలో తెలంగాణలోని అటవీ ప్రాంతాలు పర్యాటలకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్టలు, మైలారం నల్లగుట్టల సున్నం గుహలు, ములుగు జిల్లాలోని తాడ్వాయి దామెరవాయి అటవీ రాక్షసగూళ్లు, ఆదిమానవుని సమాధులు, నాగర్ కర్నూల్ జిల్లాలోని మల్లెలతీర్థం, అక్క మహాదేవి గుహలు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న మెగాలితిక్ బరియల్స్ విశేష ఆదరణ పొందుతున్నాయి. హైద్రాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ బుద్ధ ఐలాండ్, నాగార్జునసాగర్ ఐలాండ్, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నల్లమల అడవులు ఎకో టూరిజంగా పర్యాటకుల ఆదరణ పొందుతున్నాయి.
తాళ్ళపల్లి యాదగిరి గౌడ్
99497 89939