జరభద్రం
తెలంగాణలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో సమ్మెకు సిద్ధపడని ఉద్యోగ వర్గాలు లేవనే చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం వివిధ సమూహాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. ఈ సమ్మెలు, బంద్‌ల విరమణ కోసం ప్రభుత్వం అన్ని డిమాండ్లను ఒప్పుకొన్నట్లుగా నటించి చివరికి మాట నిలుపుకోని మోసాలే ఎక్కువ. ‘సమ్మెలు ముందుకు సాగవు, సమస్యలు నెరవేరవు’ అన్నట్లుగా ప్రభుత్వం ప్రజల ఆందోళనలను తెలివిగా దారితప్పిస్తున్నది.
గ్రామ పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కోసం సర్పంచులు వెచ్చించిన రూ.153 కోట్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. రాష్ట్రంలో 1,200 మంది సర్పంచులు అప్పులు తెచ్చి ఆ పనులు చేపట్టారు. ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు చేయని ప్రయత్నం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలువడానికి ఆయన నివాసానికి ఆరుసార్లు, సచివాలయానికి ఐదుసార్లు వారు వెళ్లినా అనుమతి లభించలేదు. సర్పంచుల్లో చాలామంది బీఆర్ఎస్కు చెందినవారు కావడం వల్లనే ఇలా ఇబ్బందులు పెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అప్పు భారాన్ని మోయలేక సిద్దిపేట జిల్లాలో ఒక మాజీ సర్పంచ్ జూన్ 24న ఆత్మహత్య చేసుకోవడం వారి దుస్థితిని తెలియజేస్తున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము కోసం రాష్ట్రంలోని రెండు వేల ప్రైవేట్ కాలేజీలు గత ఏడాది సెప్టెంబర్‌లో నిరవధిక సమ్మెను మొదలుపెట్టాయి. వారికి ప్రభుత్వం నుంచి రూ.12 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. కాలేజీలకు ఇచ్చిన టోకెన్ల ప్రకారం రూ.1,800 కోట్లు ఈ నెల 21లోగా మంజూరు చేయకపోతే సమ్మె తప్పదని ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో కాలేజీల తనిఖీల పేరిట ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. అయితే, ఆ అస్త్రం పనిచేయక పోవడంతో సర్కారే చర్చలకు దిగి వచ్చింది. తక్షణమే రూ.600 కోట్లు, దీపావళికి మరో రూ.600 కోట్లు చెల్లిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. తొలి విడుతలో భాగంగా కేవలం రూ.200 కోట్లే చెల్లించారు. ఆ తర్వాత దానికి ఫుల్స్టాప్ పడింది. కాలేజీల వద్ద ఉండిపోయిన సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కుటుంబాలు అప్పోసప్పో చేయవలసి వస్తున్నది. ఫీజులు, ఉపకార వేతనాల బకాయిల కోసం రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఈ ఏడాది ఏప్రిల్‌లో మూడు రోజులు సాగింది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం, ఆర్టీసీ కార్మిక సంఘానికి ఎన్నికలు జరిపించడం కాంగ్రెస్ ఎన్నికల హామీలోనే ఉన్నది. అయితే, ఆ రెండు డిమాండ్లు తప్ప మిగతా వాటిపై మాత్రమే చర్చలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. సర్కార్ మొండివైఖరిని తట్టుకోలేక ఒక డ్రైవర్ ఆత్మాహుతి చేసుకున్నాడు. పరిస్థితులు చేయిజారిపోతున్నాయని గ్రహించిన పాలక పక్షం ఎట్టకేలకు చర్చలకు దిగివచ్చింది. డీఏ బకాయిలు విడుదల చేస్తూ రెండు ప్రధాన డిమాండ్లపై కమిటీ వేస్తామని ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం ప్రకటిస్తారని 37 వేల మంది ఉద్యోగులు ఎంతో ఆశపడ్డారు. వారికి జీతాలు చెల్లిస్తే ఏడాదికి రూ.వెయ్యి కోట్ల భారం సర్కార్ ఖజానాపై పడుతుంది.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది. ఆగస్టు 4న భారీ సంఖ్యలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు బస్‌భవన్ ముందు ధర్నా చేపట్టారు.17 వేల మంది విశ్రాంత జీవులకు ప్రభుత్వం రూ.9 వందల కోట్లు చెల్లించాల్సి ఉన్నది. బకాయిల చెల్లింపులో ఆలస్యం చేస్తే బస్సుల్లో బిచ్చమెత్తుకుంటామని వారు హెచ్చరించారు.
రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీల్లోని జూనియర్ డాక్టర్లు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ స్టయిఫండ్ విడుదల్లో జాప్యానికి నిరసనగా జూన్‌లో తమ సేవలను ఆపివేశారు. 2025 జనవరిలో పెంచిన మొత్తాన్ని ఇంతవరకు అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన సొమ్ముతో పాటు ఎరియర్స్ కూడా చెల్లించాలని వారు కోరుతున్నారు. సమ్మెకు దిగగానే ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు, హామీలు లభించినా ఫలితం మాత్రం శూన్యం. ఆశావర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం కదం తొక్కుతున్నారు.
రాష్ట్రంలో ఉన్న 28 వేల ఆరోగ్య సహాయ సిబ్బంది నెలకు రూ.18 వేల వేతనం, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సదుపాయం కావాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో గిగ్ వర్కర్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేసి వారి కష్టాలు తీరుస్తామని కాంగ్రెస్ నమ్మకం కలిగించింది. ఆయా యాజమాన్యాల నుంచి వారికి వేతన, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పింది. అనేక విన్నపాల అనంతరం ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ తెచ్చినా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వానికి తమ బాధలు తెలియాలని వారు ఆగస్టు 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు సిద్ధపడ్డారు. వారితో చర్చించిన కార్మిక మంత్రి వివేక్ చట్టం ప్రకారం వారి హక్కులను రక్షిస్తామని హామీ ఇచ్చారు. చట్టం తేవడమే కాదు, ప్రైవేట్ శక్తులను ఒప్పించే దమ్ము కూడా ప్రభుత్వానికి ఉండాలి.
గత నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని ఆటోలు, క్యాబ్‌ల సమ్మెకు డ్రైవర్లు సిద్ధపడ్డారు. ఈ సమ్మెకు ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల అసోసియేషన్ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే వెంటనే జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలతో సమ్మె విరమించుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆటోలు, టాక్సీల గిరాకీ దెబ్బతిన్నది. వారు ఆందోళన చెందగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ దానిని ఇంతవరకు ఆచరణలో పెట్టలేదు. ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలను అందించాలన్న వారి కోరికను సర్కార్ ఒప్పుకొన్నది. అది నిజంగా కార్యరూపం అయితేనే వారి సమస్యలు తీరుతాయి.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనాకాలంలో మాజీ సర్పంచులతో మొదలైన ఆందోళన కార్యక్రమాలను వివిధ బాధిత వర్గాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎవరి సమస్యలు, డిమాండ్లు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వం మాత్రం తప్పించుకొనే మార్గాలు వెతుకుతున్నది. కాలయాపన చేస్తూ ఆశలపల్లకిపై అందర్నీ ఊరేగిస్తున్నది. అంతిమంగా అందరికీ మిగిలేది నిరాశే అనే సూచనలు పొడసూపుతున్నాయి.
బద్రి నర్సన్