గడిచిన ఐదు దశాబ్దాల్లో ప్రపంచం మూడు చమురు సంక్షోభాలను చవిచూసింది. 1973లో ఒకటి, 1979లో మరోటి, 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధంతో ఇంకోటి. వీటి కంటే ప్రమాదకర సంక్షోభాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అదే పశ్చిమాసియా ఉద్రిక్తతలు. ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ముఖ్యంగా ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్రంగా పడనున్నది.
ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అయితే, అప్పటికే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) వద్ద అదనంగా చమురు నిల్వలు ఉన్నాయి. దీంతో హొర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ, ఈ అదనపు నిల్వలను విడుదల చేస్తూ చమురు ధరలు అమాంతం పెరుగకుండా కళ్లెం వేస్తూ వచ్చాం. అయితే, యుద్ధం ప్రారంభమయ్యి మూడు నెలలు దాటింది. అయినప్పటికీ, పరిస్థితి ఏ మాత్రం చక్కబడలేదు. అదనపు చమురు నిల్వలే కాదు.. అత్యవసరంగా ఉంచిన 400 మిలియన్ బ్యారెళ్ల చమురును కూడా ఎమర్జెన్సీ రిలీజ్ పేరిట విడుదల చేశాం. ఐఈఏ నుంచి చమురు తరిగిపోతున్నదే గానీ, కొత్తగా రావట్లేదు. ఇప్పుడు ఐఈఏ వద్ద కూడా నిల్వలు అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే, పరిస్థితులు మరింతగా దిగజారవచ్చు.
జూన్-ఆగస్టు మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ సీజన్ ఊపందుకొంటుంది. కార్లు, బస్సులు, విమానాలూ.. ఇలా అన్ని విధాలుగా ప్రయాణాలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధనానికి మరింతగా డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధిని తెరువాల్సిన అవసరం ఎంతో ఉన్నది. లేకపోతే గ్లోబల్ ఎకానమీ రెడ్‌జోన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. ఆసియా దేశాలపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉన్నది.
ఇంధన సంక్షోభం ఇలాగే కొనసాగితే, వివిధ దేశాల్లో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగొచ్చు. డాలర్‌తో పోలిస్తే బలహీనమైన కరెన్సీ కలిగిన దేశాలపై ఈ ప్రభావం మరింతగా ఉంటుంది. కొన్ని వారాలు, నెలలుగా పరిణామాలను విశ్లేషిస్తే, పశ్చిమాసియా ఉదంతం అంతా నాకు ఓ పరివర్తన కాలంగా కనిపిస్తున్నది. 20 శాతం మేర ప్రపంచ ఇంధన అవసరాలను పశ్చిమాసియా దేశాలే తీరుస్తున్నాయి. ఇప్పటికిప్పుడు అక్కడ ఉద్రిక్తతలు చల్లారినా, చమురు రవాణాను మునుపటి స్థితికి తీసుకురావడం అంత సులభమేమీ కాదు. ఇది ప్రతీఒక్కరూ గుర్తించాలి.
ఉద్రిక్తతల కారణంగా హొర్ముజ్‌ను మూసేశారు. భవిష్యత్తులో ఇదే కారణంతో మరొకరు హొర్ముజ్‌ను లేదా సముద్ర రవాణాకు కీలకమైన మిగతా జలసంధులను మూసేయబోరని గ్యారెంటీ ఏమిటీ? ఇదే ప్రతీఒక్కరి మెదళ్లను ఇప్పుడు తొలుస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం ఒక్కటే.. ఏ దేశానికి ఆ దేశం.. తమ చమురు అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. విపత్తు రాకముందే వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవాలి. హొర్ముజ్ ఉదంతం ద్వారా ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం ఇది.
అంతర్జాతీయ మారిటైమ్ చట్టాల ప్రకారం.. సముద్ర రవాణా ఉచితం. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడి దేశాలు హొర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి ఫీజు వసూలు చేస్తామని అంటున్నాయి. దీనిపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఆ విషయం పక్కనబెడితే, హొర్ముజ్ గుండా సురక్షితమైన, భద్రతతో కూడిన మునుపటి నౌకా ప్రయాణం ఇప్పుడు సాధ్యమా? దానికి గ్యారెంటీ ఇవ్వగలరా? అని ఇప్పుడు ప్రపంచ దేశాలు, చమురు కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పడం అంత సులువైన విషయం కాదు. ఐఈఏలో సభ్యులుగా ఉన్న 32 దేశాలు అంగీకరించడంతోనే 400 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్‌ను గత మార్చిలో అత్యవసర ప్రాతిపదికన విడుదల చేశాం. ఇంత పెద్ద మొత్తంలో ఇంధనాన్ని గతంలో ఎన్నడూ విడుదల చేయలేదు. మేం ఈ నిర్ణయం తీసుకోవడం వల్లే చమురు ధరలు అమాంతం పెరుగకుండా అడ్డుకోగలిగాం. అయితే, ప్రస్తుత పరిస్థితులను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. అవసరమైతే, ఇంధన నిల్వలను మరోసారి విడుదల చేయడానికి ఐఈఏ సిద్ధమే. అయితే, ఆ పరిస్థితి వచ్చిందని ఇప్పుడే అనుకోవడంలేదు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశిద్దాం!
(వ్యాసకర్త: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ)
(‘సీఎన్‌బీసీ టీవీ18’ సౌజన్యంతో)
-ఫతీహ్ బిరోల్