Parents | ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ అలాంటి అమ్మానాన్నలే అతన్ని కాదన్నారు. చిన్నప్పుడే వేరేవాళ్లకు అమ్మేశారు. పదమూడేళ్ల తర్వాత తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లినా కూడా వారి మనసులు కరగలేదు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడతను.
ఈ ఘటన చైనాలో వెలుగు చూసింది. లూ షూజో అనే అబ్బాయిని పసివయసులోనే అతని తల్లిదండ్రులు వేరే వాళ్లకు అమ్మేశారు. ఆ తర్వాత పెంపుడు తల్లిదండ్రుల వద్ద పెరుగుతుండగా.. బాబుకు నాలుగేళ్ల వయసులో జరిగిన బాణాసంచా ప్రమాదంలో పెంపుడు తల్లిదండ్రులిద్దరూ మరణించారు.
వారు చనిపోయిన తర్వాత ఒంటరి వాడయ్యాడు. ఈ ఘటన జరిగిన పదమూడేళ్ల తర్వాత ఇంటర్నెట్ సాయంతో తన అసలు తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నాడు. గత డిసెంబరు 6న తన తల్లిదండ్రుల ఆచూకి తెలుసుకునేందుకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశాడు.
నెటిజన్ల సాయంతో తల్లిదండ్రుల గురించి తెలుసుకొని, వాళ్ల దగ్గరకు వెళ్లాడు. కానీ వాళ్లు అతన్ని తమ కుమారుడిగా అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన అతను ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.