Sankranti | తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంబురాల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి లోగిలి ధాన్యరాశులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ ‘భోగి’తో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ని చేపట్టిన రోజు కూడా ఇదే. భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది. ఈ సంప్రదాయం వెనుక ఆరోగ్యకరమైన కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగు పండ్లకు బదరీఫలాలని పేరు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు.