న్యూయార్క్ : చిన్నాపెద్దా ఇష్టంగా ఆరగించే వంటకాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ముందువరుసలో ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ను తయారుచేసి న్యూయార్క్‌లో ఓ రెస్టారెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. న్యూయార్క్‌లోని సెరెన్డిపిటీ 3 అనే రెస్టారెంట్ ఈ ఘనతను సాధించింది. రెస్టారెంట్ క్రియేటివ్ చెఫ్ జో కాల్డెరోన్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఫ్రెడెరిక్ కివర్ట్లు తమ బృందంతో ఈ వినూత్న అద్భుత రుచితో కూడిన వంటకాన్ని తమ కస్టమర్ల ముందుకు తెచ్చారు.
అత్యంత ఖరీదైన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ధరను 200 డాలర్లుగా నిర్ణయించారు. దీంతో పాటు దామ్ పెరిగన్ షాంపేన్, ఫ్రెంచ్ షాంపేన్ అర్దెన్ వెనిగర్‌ను ప్యాకేజ్ కింద ఆఫర్ చేశారు. ఇక ఈ డిష్ కోసం చిప్పర్‌బెక్ బంగాళాదుంపలు, ఫ్రాన్స్ నుండి స్వచ్ఛమైన బాతు కొవ్వు, ట్రఫుల్ ఆయిల్, క్రీట్ సెనేసి పెకోరినో టార్టుఫెల్లో జున్ను, ఇటలీ నుండి సేకరించిన ట్రఫుల్స్, డోమ్ పెరిగ్నాన్ షాంపైన్, ట్రఫుల్ బటర్, జె లెబ్లాంక్ ఫ్రెంచ్ షాంపైన్ ఆర్డెన్నే వినెగార్‌ను వాడారు. చివరిగా ఈ డిష్‌పై తినదగిన 23 క్యారెట్ల బంగారపు ధూళిని గార్నిష్ చేశారు. ఈ డిష్‌కు సంబంధించిన ఫోటోను సెరెన్డిపిటీ 3 రెస్టారెంట్ తమ ఇన్స్టాగ్రాం పేజ్‌లో షేర్ చేసింది.