Ozone Layer | ఈ విశ్వం అనంతమైనదని మనకు తెలుసు. కోటానుకోట్ల గ్రహాలు అందులో తేలుతూ ఉంటాయనీ తెలుసు. కానీ ఇప్పటివరకూ వాటిలో… ఎక్కడా బుద్ధిజీవులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. ఇంత ప్రత్యేకత పుడమికే ఎందుకు ఉంది? అన్న ప్రశ్నకు ‘రేర్ ఎర్త్ హైపోథిసిస్’ అనే సిద్ధాంతం జవాబు చెబుతుంది. జీవం ఏర్పడటానికీ, తెలివితేటలు సంతరించుకోవడానికీ, మనుగడ కొనసాగించడానికీ… చాలా సంక్లిష్టమైన వాతావరణం కావాలి. ఏదో ఒక్క పరిస్థితి అనుకూలించినంత మాత్రాన ఇది జరగదు.
సూర్యుడి నుంచి భూమి ఉండే దూరం, ఆ భూమి వాలుగా తిరగడం, గురుత్వాకర్షణ శక్తి, ఇక్కడి నేల తీరు, నీటి లభ్యత, వాయువుల శాతం… అన్నీ కలిసి అరుదైన జీవులు బతికేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఓ ముఖ్యమైన వ్యవస్థ- ఓజోన్ పొర. ఈ రక్ష ఛత్రం లేకపోతే… సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు మనను తాకుతాయి. నిలువునా దహించేస్తాయి. భూమి నిలువెల్లా మండిపోతుంది. సున్నితమైన మనుషుల చర్మాల మీద ఆ ప్రభావం మరింత ప్రతికూలం. ఒక్కమాటలో చెప్పాలంటే వెల్డింగ్ మంట కింద నేరుగా నిలబడినట్టే! తల్లి గర్భంలోని మాయపొరలా మనల్ని సంరక్షిస్తున్న ఆ ఓజోన్ పొరకు మన చేజేతులారా చిల్లులు పెట్టేస్తున్నాం. ఇది కచ్చితంగా మానవాళి స్వయంకృతాపరాధమే!
ఓజోన్ అనే మాట మనకు కొత్త కాదు. ఓ నలభై ఏళ్ల నుంచి రకరకాల కథనాలు వింటూనే ఉన్నాం. ఓజోన్ పొర చిల్లుపడిందనీ, దానికి మానవ తప్పిదాలే కారణాలనీ చదువుతున్నాం. కొన్ని పరిశ్రమలు, కొద్ది దేశాలు కారణంగానే ఇలా జరిగిందన్న బలమైన అభిప్రాయం ఏర్పడింది. కానీ, ఇంట్లో మన మానాన మనం టీవీ చూస్తూ, పని సాగిస్తూ, వంట చేస్తూ, పడుకుంటూ… బుద్ధిగా, భద్రంగా ఉండే మన చర్యలు నేరుగా ఆ ఓజోన్ పొరకు చిల్లు పెడుతున్నాయంటే నమ్మలేం, ఒప్పుకోం! కానీ ఇది నిజం. సమష్టిగానూ, ప్రత్యక్షంగానూ మనం చేసే చాలా పనులు ఓజోన్ పొరకు విఘాతం కలిగిస్తున్నాయి. ఈ విషయం గురించి మరింత ప్రచారం చేసేందుకే ఏటా సెప్టెంబరు 16న ‘ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు.
సంతృప్తికరమైన గతం!
1970లలో కొంతమంది శాస్త్రవేత్తల పరిశోధనతో ఈ ప్రయాణం మొదలైంది. అప్పటికే నిత్యజీవితంలో భాగమైపోయిన ‘సీఎఫ్‌సీ’ అనే వాయువులు నేరుగా వాతావరణంలోకి కలిసిపోయి, ఓజోన్ పొర వరకూ వెళ్తున్నాయనీ… అక్కడి ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేస్తున్నాయని వారు కనుగొన్నారు. ఈ విషయాన్ని పరిశోధించిన కొందరికి నోబెల్ బహుమతి దక్కింది. ఈ విషయాన్ని అటు ప్రభుత్వాలు ఇటు పర్యావరణవేత్తలు తీవ్రంగా పరిగణించడంతో… ఓజోన్ పొరకు విఘాతం కలిగించే రసాయనాలను నియంత్రించాలనే ఆచరణ మొదలైంది.
1987లో కెనడాలోని మాంట్రియల్ నగరంలో జరిగిన ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం’ సమావేశంలో కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, చాలామందికి ఐక్యరాజ్యసమితి పరిధుల మీదా, ప్రభావం మీదా తీవ్రమైన అపనమ్మకాలు ఉంటాయి. ఈ మాంట్రియల్ ప్రొటోకాల్‌ను అందుకు జవాబుగా భావిస్తుంటారు. కానీ, ఈ విషయంలో అందుకు భిన్నంగా జరగడం విశేషం. ఐరాస సభ్యదేశాలన్నీ ఒక్కతాటి మీదకు రావడమే కాకుండా… నాటి ఒప్పందాన్ని చాలా నిబద్ధతతో అమలు చేశాయి. 1980లలో కనిపించిన ఓజోన్ పొర చిల్లు చాలావరకు పూడుకుపోవడమే ఇందుకు నిదర్శనం. 1987 సెప్టెంబర్ 16 నాడు ఈ మాంట్రియల్ ఒప్పందానికి నాంది పలికారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని… ఏటా అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
వెంటాడే శత్రువు సీఎఫ్‌సీ
రిఫ్రిజిరేటర్లను కనిపెట్టిన కొత్తలో వాటిలో పదార్థాలను చల్లబరిచేందుకు అమోనియా, మీథేన్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి వాయువులను ఉపయోగించేవారు. వీటివల్ల అగ్ని ప్రమాదాలు జరగడం, ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలు వాసన రావడం లాంటి సమస్యలు ఉండేవి. ఇందుకు విరుగుడుగా క్లోరిన్, ఫ్లోరిన్, కార్బన్ అణువులను కలిపిన సీఎఫ్సీలను రూపొందించారు. వీటి తయారీ తేలిక, ప్రమాదాలు తక్కువ. కాబట్టి 1930ల నుంచి విచ్చలవిడిగా వీటి వాడకం మొదలైంది. ఈ సీఎఫ్‌సీకి హైడ్రోజన్ కలిపితే వచ్చే హెచ్‌సీఎఫ్‌సీలు కూడా వినియోగంలోకి వచ్చాయి. ఓ రకంగా వీటి ఆవిష్కరణ సంచలనమే. ఎయిర్ కండిషనర్ లాంటి పరికరాల పనితీరును అవి మార్చేశాయి. సీఎఫ్‌సీ అంటే కేవలం ఒకే పదార్థం కాదు. ఇందులో చాలా రకాలుంటాయి.
వీటి అణువుల కలయికలో మార్పులు, చేర్పులు చేస్తూ క్లోరోడైఫ్లోరోమీథేన్, క్లోరోఫ్లోరోమీథేన్, బ్రోమోక్లోరోడైఫ్లోరోమీథేన్… ఇలా రకరకాల రసాయనాలను సృష్టించారు. వీటి వాడకం కేవలం ఫ్రిజ్‌లు, ఏసీలకు మాత్రమే పరిమితం కాలేదు. మంటలను ఆర్పేందుకు, ప్యాకింగ్ చేసేందుకు, యంత్రాలను శుభ్రం చేసేందుకు… ఇలా చాలా సందర్భాలలో వినియోగించడం మొదలుపెట్టారు. ఫోమ్ తరహా నిర్మాణం ఏర్పడేందుకు (బ్లోయింగ్ ఏజెంట్), బాటిల్ లోపల ఉన్న ద్రవం వాయువు రూపంలో బయటికి వచ్చేందుకు (ఏరోసోల్) సీఎఫ్సీలను విచ్చలవిడిగా వాడేశారు. దీనర్థం మన పరుపుల్లో వాడే ఫోమ్, డియోడరెంట్లకి వాడే స్ప్రే, కుర్చీలకు వాడే ప్లాస్టిక్… అన్నిటిలోనూ సీఎఫ్‌సీ ఉండేదన్నమాట. ఇంత అమాయకంగా కనిపిస్తూ, విశ్వవ్యాప్తం అయిపోయిన సీఎఫ్సీలు ఓజోన్‌కు చిల్లుపెడతాయనే ఆవిష్కరణ ప్రపంచానికి ఓ షాక్!
అనూహ్యమైన నష్టం!
1980ల నాటికి సీఎఫ్సీలతో తయారయ్యే పదార్థాలు కొన్ని లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇవి ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయనే వాదన ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ… జరిగింది అదే. సీఎఫ్‌సీ అణువులు భూమి ఉపరితలాన్ని చేరుకోగానే, సూర్యరశ్మి వల్ల అందులోని క్లోరిన్ అణువు విడిపోతుంది. ఇక ఓజోన్ అనేది మూడు ఆక్సిజన్ అణువుల కలయిక (o3). సీఎఫ్‌సీ నుంచి విడిపోయిన క్లోరిన్ అణువు, O3 లోని ఒక ఆక్సిజన్ కణంతో కలుస్తుంది. దాంతో O3 కాస్తా 02 గా మారిపోయి వాతావరణంలో కలిసిపోతుంది. ఇది ఒకసారి జరిగితే పెద్ద సమస్య కాకపోవచ్చు. మళ్లీ మళ్లీ క్లోరిన్ అణువు విడిపోవడం, అక్కడ ఉన్న ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేయడం…
ఇలా దాదాపు లక్షసార్లు జరుగుతుందట. అంటే! ఒకే ఒక్క సీఎఫ్‌సీ అణువు వల్ల లక్ష ఓజోన్ అణువులు నాశనం అయిపోతాయి. సీఎఫ్‌సీల కోసం వాడే మరో రసాయనమైన బ్రోమిన్ మరింత ప్రమాదకరమని చెబుతారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఓజోన్ పొర అని పేరు ఉన్నంత మాత్రాన… అది వ్యాపించి ఉన్నంతమేరా దట్టంగా ఓజోన్ అణువులు ఉంటాయని కాదు. అవి ఆ పొరలో తేలుతూ ఉంటాయంతే! ఓ 15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆ పొరలోని ఓజోన్ అణువులను కనుక దగ్గరికి నొక్కితే కేవలం మూడు మిల్లీమీటర్ల మందాన మాత్రమే ఆ పొర ఉంటుంది. దీన్నిబట్టి… అవి ఎంత అపురూపమో అర్థమవుతుంది.
నిరంతరం యుద్ధం!
1970ల నాటికి కానీ సీఎఫ్‌సీల వల్ల జరిగే హాని గురించి లోకానికి తెలియలేదు. అప్పటికే ఆ సాంకేతికతతో వాడే కొన్ని లక్షల ఫ్రిజ్‌లు, ఏసీలు లోకాన్ని ముంచెత్తాయి. పైగా సీఎఫ్సీలతో రూపొందించిన పాత వస్తువులను రీసైకిల్ చేసినప్పుడు కూడా కొంత నష్టం జరుగుతుంది. అందుకే ఈ రసాయనాలను పూర్తిగా నిషేధించిన తర్వాత కూడా వాటి ప్రభావం మరో 50 ఏళ్ల వరకూ ఉంటుందని అంచనా. పైగా ఈ సీఎఫ్‌సీ సాంకేతికత మీద ఆధారపడే డ్యూపాంట్ లాంటి కొన్ని సంస్థలు మొదట్లో తమ ఉత్పత్తులు హానికరమనే విషయాన్ని ఒప్పుకోలేదు.
కానీ, ఓజోన్ పొర ఎన్నడూ లేనంత దారుణంగా పలచబడిందనే శాస్త్రవేత్తల హెచ్చరికతో ఐరాసలోని సభ్యదేశాలు మాంట్రియల్ ఒప్పందానికి సిద్ధపడక తప్పలేదు. ఆ తర్వాత క్యోటో ప్రోటొకాల్, కిగాలి అమెండ్మెంట్ లాంటి మరిన్ని ఒప్పందాలతో సీఎఫ్‌సీ, హెచ్‌సీఎఫ్‌సీ, (hydrochlorofluorocarbons)ల మీద ఉక్కుపాదం మోపాయి. ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదు. అలా సాధ్యమూ కాదు. కొన్ని దశాబ్దాల మేర పరుచుకున్న ప్రయాణమిది. ఇప్పటికీ అనధికారికంగా చైనాలో వీటి వినియోగం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యం లాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ వీటి వినియోగం ఉంది. కానీ, మునుపటితో పోలిస్తే వాటి ఉనికి దాదాపు 99 శాతం తగ్గిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Ozone Holes
ఓజోన్ పల్చబడితే..
సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే ఓజోన్ పొర కనుక పల్చబడితే… భూమ్మీద ఉన్న సకల జీవరాశుల మీదా కచ్చితమైన, స్పష్టమైన ప్రభావం ఉంటుంది.
అయినా మనిషి మారలేదు!
సీఎఫ్సీలను నిషేధించేసినంత మాత్రాన, ఓజోన్ పొర క్షేమంగా ఉన్నట్టు కాదు. తెలిసో, తెలియకో, పట్టించుకోకనో… మనం చేసే పనులు, వాడే ఉత్పత్తులు నేరుగా ఓజోన్ పొరకు ఎక్కుపెడుతున్నాయి. ఉదాహరణకు క్లోరిన్ వాడకం! నీళ్లలో బ్యాక్టీరియాను చంపడం దగ్గర నుంచీ, కాగితం తయారీ వరకూ చాలా చోట్ల క్లోరిన్ ఉపయోగిస్తారు. నిస్సందేహంగా ఇది పర్యావరణానికి ప్రమాదకరమే. ఇక బ్రోమిన్ పరిస్థితి కూడా ఇంతే! రంగులు, పురుగుమందులు, మందులు లాంటి ఉత్పత్తులలో బ్రోమిన్ వాడకం విచ్చలవిడిగా కనిపిస్తుంది.
ఇప్పటి ఏసీలలో, ఫ్రిజ్‌లలో సీఎఫ్సీలు లేవని సంబరపడిపోవడానికి వీల్లేదు. వాటిని విచ్చలవిడిగా వాడటం వల్ల చాలా కరెంటే ఖర్చవుతుంది. మరి ఆ విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తున్నాం? ఇప్పటికీ లోకంలో 80 శాతం విద్యుత్తు బొగ్గు, గ్యాస్ లాంటి పరిమిత వనరుల నుంచే తయారుచేస్తున్నారు. వీటిని విద్యుత్తు కిందకి మార్చే ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు అంతులేనంతగా వెలువడుతున్నాయి. ఓజోన్ పొరకు చిల్లు పెడుతున్నాయి.
డియోడరెంట్ల నుంచి పురుగుమందుల వరకూ‘ఏరోసోల్’ అనే సాంకేతికత మీదే ఆధారపడుతున్నాం. ఇలా బటన్ నొక్కగానే, అలా ద్రవం బయటకు చిమ్మాలని మన అంచనా. కానీ, ఈ ప్రక్రియ కోసం చాలా హానికారక రసాయనాలను వాడతారని గమనించం. అంతేకాదు. బాటిల్ నుంచి బయటకు వచ్చిన సూక్ష్మమైన ‘ఏరోసోల్స్’ గాలిలో తేలియాడుతూ ఉంటాయి. సూర్యకాంతిని అడ్డుకోవడం నుంచి దుమ్మును చేర్చుకోవడం వరకూ… ఇవి సవాలక్ష సమస్యలకు దారి తీస్తున్నాయి.
రోజురోజుకూ మాంసాహారం పట్ల ఆసక్తి పెరిగిపోతున్నది. అప్పుడప్పుడు తినే అలవాటును మించి మాంసాహారాన్ని భుజిస్తున్నారు. కార్బన్ డై ఆక్సైడ్ కంటే ప్రమాదకరమైన నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ పెరిగిపోవడానికి ఇది ముఖ్య కారణం. ఓ అంచనా ప్రకారం మనం ఉత్పత్తి చేస్తున్న మొత్తం నైట్రస్ ఆక్సైడ్‌లో 65 శాతం పశువుల పెంపకం నుంచే వెలువడుతున్నది.
చిన్నచిన్న చర్యలతో చెక్!
ధ్రువ ప్రాంతాల్లోనే ఎందుకు?
ఓజోన్ పొర అంటార్కిటిక్ దగ్గర మాత్రమే పల్చబడటం చూసి మొదట్లో ఇది సహజ పరిణామం అని వాదించేవారు. అక్కడ ఉండే ఉష్ణోగ్రతల వల్ల ఓజోన్ పొర కొంత పల్చబడే మాట వాస్తవమే. కానీ అక్కడ స్తబ్ధుగా, అతి శీతలంగా ఉండే వాతావరణంలో క్లోరిన్, బ్రోమిన్ల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తేలింది. అంతేకాదు… అక్కడి చీకటి వాతావరణంలో సీఎఫ్‌సీ అణువులు నెలల తరబడి పేరుకుని ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎప్పుడైతే ఒక్కసారిగా సూర్యరశ్మి వాటిని తాకుతుందో… ఓ విస్ఫోటనం లాంటి చర్యకు దారితీస్తుంది. ఫలితంగా ఓజోన్ చిల్లు అక్కడే కనిపిస్తున్నది.
భారత్ భేష్!
ఓజోన్ పొరను విచ్ఛన్నం చేసే పదార్థాలను ఓజోన్ డిప్లిటింగ్ సబ్స్టెన్సెస్ (ఓడీఎస్)గా పిలుస్తారు. వీటి విషయంలో మన దేశం చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నది. ఇందుకోసం అటవీ పర్యావరణ శాఖలో ‘ఓజోన్ సెల్’ పేరిట ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటుచేసింది. కఠినమైన నిబంధనలూ చేర్చింది. 2010 నుంచి సీఎఫ్సీలు, 2020 నుంచి హెచ్సీఎఫ్సీల ఉత్పత్తిని నిలిపివేయాలని హెచ్చరించింది.
గ్రీన్ హౌజ్ గ్యాసెస్
భూతాపం పెరగడానికి గ్రీన్ హౌజ్ వాయువులు ఓ ముఖ్య కారణమని మనకు తెలుసు. వీటితో భూతాపం పెరగడం వల్ల రుతువులు అస్తవ్యస్తం అయిపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, సముద్ర మట్టం పెరగడం లాంటి సమస్యలతోపాటు ఓజోన్ పొర కూడా దెబ్బతింటుంది. మనం చెప్పుకొంటున్న సీఎఫ్సీలతోపాటుగా కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి వాయువులు కూడా ఈ గ్రీన్ హౌజ్ వాయువులలో భాగమే. కాబట్టి ఓజోన్పొరతో పాటుగా భూమి కూడా సురక్షితంగా ఉండేందుకు ఈ వాయువుల్ని విడుదల చేసే పనులు కూడా మానుకోవాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు ఇంధనాలను మండించడం వల్ల కర్బన వాయువు విడుదల అవుతుంది, ఎరువుల విచ్చలవిడి వాడకం వల్ల నైట్రస్ వాయువు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వీటి మీద కూడా వీలైనన్ని పరిమితులు విధించాలన్న వాదన బలపడుతున్నది.
అనూహ్యమైన కారణాలు
సీఎఫ్సీలు, గ్రీన్ హౌజ్ వాయువులు లాంటి పరిస్థితులు మానవ తప్పిదాల వల్ల ఓజోన్ పల్చబడుతుందని తెలిసిందే. దీంతోపాటు కొన్ని అనూహ్యమైన కారణాలు కూడా ఈ పరిస్థితికి కారణం అవుతాయి…
1. రాకెట్లను ప్రయోగించినప్పుడు, వాటినుంచి భారీ మొత్తంలో విడుదల అయ్యే ప్రమాదకర వాయువులు నేరుగా ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తున్నాయని తేలింది. ప్రతి చిన్న సంస్థా, దేశమూ అపరిమితంగా చేస్తున్నఈ రాకెట్ ప్రయోగాల వల్ల 2050 నాటికి ఓజోన్ పొరకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
2. అగ్నిపర్వతాల నుంచి వెలువడే హైడ్రోజన్ క్లోరైడ్ లాంటి రసాయనాలు ఓజోన్ పొరకు హాని చేస్తున్నాయని దశాబ్దాల క్రితమే గ్రహించారు.
3. సముద్రపు అలల వల్ల అందులో సహజంగా ఉండే క్లోరిన్ వాతావరణంలోకి కలుస్తుంది. అది నిదానంగా ఓజోన్ వరకూ చేరే ప్రమాదం ఉంటుంది.
ఇవే కాకుండా సూర్యుడి నుంచి వచ్చే వేడిని ప్రభావితం చేసే సన్ స్పాట్స్, స్ట్రాటోస్పియర్ (ఓజోన్ పొర ఉండే భాగం)లో పీడనం కూడా ఓజోన్ పొర మీద ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
…? కె.సహస్ర