ఎవరి జీవితంలో అయినా సరే ప్రియురాలిని ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడగడం ఒక మధురానుభూతి. ఆమె సమాధానం కోసం ఎదురు చూడటం.. ఆమె అవునంటే కలిగే ఆనందం అన్నీ కూడా జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అనుభూతులే. అలాంటి అనుభూతిని అర్థంతరంగా అడ్డుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన ప్యారిస్‌లోని డిస్నీల్యాండ్‌లో జరిగింది.
ఇక్కడకు ఒక జంట వచ్చింది. డిస్నీల్యాండ్‌లో చాలా ప్రముఖమైన స్లీపింగ్ బ్యూటీ కోట ముందు నిలబడి తన ప్రియురాలికి ప్రపోజ్ చేయాలనేది ఆ ప్రియుడి ప్లాన్. దానికోసం అక్కడ పనిచేసే ఒక వ్యక్తి పర్మిషన్ కూడా తీసుకొని మరీ.. ఆ కోట ముందు ఉన్న వేదికపైకి ఎక్కాడు.
సరిగ్గా అతను తన ప్రియురాలికి ప్రపోజ్ చేసే సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చాడో మరో ఉద్యోగి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అతని చేతిలోని ఉంగరం బాక్సు లాగేసుకున్నాడు. ఆ వేదిక మీద ఎవరూ ఉండకూడదని, కింద ప్రపోజ్ చేసినా బాగానే ఉంటుందని చెప్తూ.. ఇద్దరినీ కిందకు దింపేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. సదరు ఉద్యోగిపై మండిపడుతున్నారు.
‘‘నీ చెత్త రూల్స్ కోసం అలాంటి మధురక్షణాలను చెడగొడతావా?’’ అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై డిస్నీల్యాండ్ యాజమాన్యం కూడా స్పందించింది. సదరు జంటకు క్షమాపణలు చెప్పామని, ఇలా జరిగినందుకు తాము చాలా బాధపడుతున్నామని తెలిపింది. ఆ జంటకు సంతృప్తి కలిగేలా చూస్తామని పేర్కొంది.