బీజింగ్: పెంపుడు కుక్క బర్త్ డే కోసం ఒక మహిళ ఏకంగా రూ.11 లక్షలు ఖర్చు చేసింది. రాత్రి వేళ ఆకాశంలో 520 డ్రోన్లతో వివిధ ఆకారాల్లో విద్యుత్ కాంతులను విరబూయించింది. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. చాంగ్షాకు చెందిన ఒక మహిళ తన పెంపుడు కుక్క డౌడౌ పదో పుట్టిన రోజును ఇటీవల గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. దీని కోసం సుమారు 520 డ్రోన్లను అద్దెకు తీసుకున్నది. ఆ డ్రోన్లు జియాంగ్జియాంగ్ నదిపై రాత్రి వేళ ఆకాశంలో వివిధ ఆకృతుల్లో కనువిందు చేశాయి. ‘డౌడౌకు 10వ పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని చైనా భాషలో పేర్కొన్నాయి.
అలాగే బర్త్ డే కేక్, జాక్ ఇన్ ది బాక్స్, మాండరిన్లో ‘ఐ లవ్ యు’ అనే పదాన్ని పోలిన 520 నంబర్ వంటి విద్యుత్ కాంతుల ఆకారాలను ఆ డ్రోన్లు రూపొందించాయి. ఇలా తన పెంపుడు కుక్క బర్త్ డే సెలబ్రేషన్ కోసం ఆ మహిళ దాదాపు 1,00,000 యువాన్లు (సుమారు రూ.11 లక్షలు) ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.
అయితే నో ఫ్లై జోన్ ప్రాంతాలతోపాటు, ఎత్తున భవనాల సమీపంలో ఆ డ్రోన్లు సంచరించడంతో కొందరు ఆందోళన చెందారు. మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ల షో కోసం ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. దీని గురించి ముందుగా తెలిసి ఉండే ఆ డ్రోన్లను కూల్చివేసేవారిమంటూ ఆ మహిళ చర్యపై మండిపడ్డారు.
ఇటీవల చైనాలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన షోలో, మొరాయించిన డ్రోన్లు ఆకాశం నుంచి కిందకు పడ్డాయి. అది చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ దేశ అధికారులు డ్రోన్ షో కోసం అనుమతిని తప్పనిసరి చేశారు.