లక్నో: వరుడు పూల దండ విసిరినందుకు ఆగ్రహించిన వధువు ఏకంగా పెండ్లిని రద్దు చేసింది. విస్తూపోయే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఔరైయ్య జిల్లాలో జరిగింది. బిదునా పోలీస్ సర్కిల్ పరిధిలోని నవీన్ బస్తీలో ఇటీవల ఒక పెండ్లి వేడుక జరిగింది. సంప్రదాయంగా జరిగే వరమాల కార్యక్రమంలో భాగంగా వరుడు పూల దండను వధువు మెడలో వేయాలి. అయితే వరుడు ఆ దండను వధువుపైకి విసిరాడు. దీంతో పెండ్లి కుమారుడి పద్ధతిపై పెండ్లి కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడ్ని పెండ్లి చేసుకోబోనని వరుడి ముఖం మీదనే చెప్పేసింది.
అయితే వధువుకు నచ్చజెప్పేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించాయి. పూల దండను తాను విసరలేదని వరుడు బుకాయించబోయాడు. దీంతో వధువు, వరుడి బంధువుల మధ్య మాటామాటా పెరిగింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దీంతో ఇచ్చిపుచ్చుకున్న కట్న కానుకలను ఎవరికి వారు వెనక్కి తీసుకున్నారు. పెండ్లి రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఇటీవల తమిళనాడులో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. పెండ్లి వేడుకలో వధువు తన బావతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇది నచ్చని వరుడు ఆమె చెంపపై కొట్టాడు. దీంతో ఆగ్రహించిన వధువు అతడితో పెండ్లిని నిరాకరించింది. అదే ముహుర్తానికి తన బావను వివాహం చేసుకున్నది.