వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ చేసే వాళ్లు అడవుల్లో తిరుగుతూ ఉండటం సహజమే. తమకు కనిపించిన జంతువులు అన్నింటినీ వాళ్లు ఫొటోలు తీస్తుంటారు. అలాగే ఒక ఎలుగు బంటిని ఫొటోలు తీస్తుంటే.. అది ఆ ఫొటోగ్రాఫర్‌ను గమనించి వెంటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కర్టిస్ మాట్విషిన్ అనే వ్యక్తి.. కెనడాలోని వాస్కేసియూ సరస్సు దగ్గర ఫొటోలు తీస్తుండగా ఈ ఘటన జరిగింది.
అక్కడ అతనికి ఒక బ్రౌన్ బేర్ కనిపించింది. దాన్ని దూరం నుంచి ఫొటోలు తీస్తుండగా.. ఆ ఎలుగుకు అతని వాసన తెలిసింది. అతన్ని చూసి అటువైపు రావడం మొదలు పెట్టింది. ‘‘దూరంగా ఉండి ఎలుగు బంటిని ఫొటోలు తీస్తుండగా.. అది నన్ను చూసి నా వైపు రావడం మొదలు పెట్టింది. ఇంతకుముందు కూడా ఇలాగే ఎలుగు బంట్లు నన్ను చూడటం జరిగింది.
కానీ ఆ నల్ల ఎలుగులన్నీ మనిషిని చూడగానే పారిపోతాయి. కానీ ఈసారి మాత్రం ఎలుగు బంటి నావైపు రావడం మొదలు పెట్టింది. దాంతో నెమ్మదిగా వెనక్కు వెళ్లడం మొదలుపెట్టాను. అప్పటికీ అది నన్ను వెంబడించడంతో వీడియో తీశాను. అది నాకు మరింత దగ్గరకు వచ్చినప్పుడు.. నా వెనుక నుంచి బలమైన గాలి వచ్చింది.
అప్పుడే నా దగ్గర ఉన్న బేర్ స్ప్రే తీసి దానిపై కొట్టాను. దాంతో ఆ ఎలుగు పారిపోయింది’’ అని కర్టిస్ వివరించాడు. ఆ ఎలుగును భయపెట్టేందుకు కేకలు వేసి, చేతులు ఊపుతూ అరిచినా అది బెదరలేదని, అందుకే బేర్ స్ప్రే ఉపయోగించానని అతను వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.