న్యూయార్క్ : మీడియా దిగ్గజం, బిలియనీర్ రూపర్ట్ ముర్దోక్ 91 ఏండ్ల వయసులో నటి జెర్రీ హాల్‌తో విడాకులకు సిద్ధమయ్యారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. రూపర్ట్ ముర్దోక్ ఇప్పటికే ముగ్గురు భార్యలతో విడిపోయారు. 2016 మార్చిలో సెంట్రల్ లండన్‌లో జరిగిన పెండ్లి వేడుకలో ముర్దోక్, జెర్రీ హాల్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ విడాకులకు సన్నాహాలు చేస్తున్నారని వచ్చిన కథనాలపై స్పందించేందుకు ముర్దోక్ ప్రతినిధి బ్రైస్ టామ్ నిరాకరించారు.
ముర్దోక్ ఫాక్స్ న్యూస్ ప్రమోటింగ్ కంపెనీ ఫాక్స్ కార్ప్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పబ్లిషింగ్ సంస్ధ న్యూస్ కార్ప్ అధిపతి. మరోవైపు విడాకుల వ్యవహారంపై నటి హాల్ (65) ప్రతినిధి కూడా ఇంకా స్పందించలేదు. వైవాహిక బంధానికి ముర్దోక్, హాల్ స్వస్తి పలుకుతున్నారనే వార్తలపై మీడియా దిగ్గజం సన్నిహితులు విస్మయానికి గురయ్యారు. వీరి పెండ్లికి ముందు అమెరికాలో ముర్దోక్ ఆస్తులు, ఫాక్స్ న్యూస్, వాల్‌స్ట్రీట్ జర్నల్ వ్యవహారాలను మీడియా దిగ్గజం పెద్ద కుమారుడు లచ్లాన్ ముర్దోక్ పర్యవేక్షిస్తున్నారు.
ముర్దోక్ గతంలో ఎంట్రప్రెన్యూర్ వెండి డెంగ్‌ను పెండ్లి చేసుకుని 14 ఏండ్ల తర్వాత 2014లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వారిద్దరికీ ఇద్దరు కుమార్తెలున్నారు. ఇక రెండవ భార్య స్కాట్లాండ్ జర్నలిస్ట్ అన్నా ముర్దోక్ మాన్ నుంచి 1999లో విడిపోయారు. వీరిద్దరికీ ముగ్గరు సంతానం కాగా, తొలి భార్య మాజీ ఫ్లైట్ అటెండెంట్ పట్రికా బుకర్‌తో 1966లో ముర్దోక్ తెగతెంపులు చేసుకున్నారు. బుకర్‌తో ఆయన ఓ బిడ్డకు జన్మనిచ్చారు. 17.7 బిలియన్ డాలర్ల నికర ఆస్తులు కలిగిన ముర్దోక్ ప్రపంచవ్యాప్తంగా తన మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించారు. ముర్దోక్ 2019 మార్చిలో ఫాక్స్ ఫిల్మ్, టెలివిజన్ స్టూడియోలు, ఇతర వినోద రంగ ఆస్తులను వాల్ట్ డిస్నీ కంపెనీకి విక్రయించారు.