Sindhu Civilization | భారతావనికి ఎందరో వచ్చారు..శతాబ్దాలపాటు ఇక్కడ హుకుం చేశారు!దోచుకున్నంత దోచుకున్నారు!మనకు బతకడం చేతకాదని గేలి చేశారు. ఇక్కడి వాళ్లకు కట్టూబొట్టూ, నాగరికత నేర్పిందే తామని చరిత్ర రాసుకున్నారు.కానీ, మన వైభవం ఏనాటిదో చాటి చెప్పింది సింధూ నాగరికత. వేల సంవత్సరాల కిందట వందల ఏండ్లు కొనసాగిన సింధూ వైభవం.. ప్రపంచానికే పాఠం. నేటి మన మేటి జీవన విధానానికి మూలం. పరిపాలనలో సూత్రాలు, గృహనిర్మాణంలో చిత్రాలు, వ్యవసాయంలో విధానాలు.. అత్యున్నత జీవనశైలికి ఆలవాలమై, భారతదేశ అస్తిత్వాన్ని చాటి చెప్పిన సింధూ నాగరికత వైభవం వెలుగు చూసి వందేండ్లు అయింది.
2024… ఇది ప్రాచీన భారతదేశ వైభవం సింధూ నాగరికత బయల్పడిన శతాబ్ది సంవత్సరం. అయితే, చాలామందికి మనదేశ చరిత్ర, సంస్కృతి మూలాల గురించి అంతగా తెలియవనే చెప్పుకోవాలి. అసలు భారతదేశ చరిత్ర సింధూ నాగరికతతో మొదలవుతుంది. ఇది దాదాపు ఐదువేల ఏండ్ల ప్రాచీనమైంది. అంటే అంతకుముందు మనుషులు లేరని కాదు.. అదంతా ఆదిమ దశ. వాడిన వస్తువుల ఆధారంగా జీవిత విధానం తెలుసుకోవాల్సిందే! అదే సింధూ నాగరికతలో ప్రజలకు తమదైన పట్టణ ప్రణాళిక, ఆరాధన, లిపి సంప్రదాయాలు ఉన్నాయి.
ఈ నాగరికత ప్రధానంగా సింధూ, దాని ఐదు ఉపనదులు, థార్ ఎడారిలో ఇంకిపోయిన సరస్వతీ నదుల కేంద్రంగా భారత్, పాకిస్తాన్ దేశాల్లో విస్తరించింది. ప్రసిద్ధ నగరాలైన హరప్పా, మొహెంజోదారో దేశ విభజనతో పాకిస్తాన్‌కు వెళ్లిపోయాయి. గుజరాత్‌లోని లోథాల్, రాజస్థాన్‌లోని కాలిబంగన్, హర్యానాలోని రాఖీగఢీ భారత్‌లో ప్రసిద్ధ స్థలాలు. పురావస్తు వివరాల జోలి అలా ఉంచితే… భారతీయుల ఆరాధనకు సంబంధించిన కోనేరు, పశుపతి రూపంలో శివుడు, అమ్మవారి ఆరాధనకు మూలాలు సింధూ నాగరికతలోనే ఉండటం విశేషం.
వందేళ్లకు ముందు… సరిగ్గా చెప్పాలంటే 1924 సెప్టెంబర్ 20 కంటే ముందు నైలు నది ప్రవహించే ఈజిప్ట్, యూఫ్రటిస్-టైగ్రిస్ నదుల పరీవాహక ప్రాంతమైన మెసపొటేమియా (ఇప్పటి ఇరాక్) వంటి దేశాల్లోని అతికొద్ది నదీ తీర మైదానాలలోనే అత్యంత పురాతనమైన నాగరికతలు మనుగడ సాగించాయని నమ్మేవారు. కానీ, ఆ రోజున అప్పటి భారత పురావస్తు శాఖ అధికారి సర్ జాన్ మార్షల్ ‘ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రికలో ‘ఫస్ట్ లైట్ ఆన్ లాంగ్ ఫర్గాటెన్ సివిలైజేషన్’ (దీర్ఘకాల విస్మృత నాగరికతపై తొలి వెలుగు) అనే వ్యాసం రాశాడు. దీంతో భారతదేశంలో కూడా ప్రపంచ నాగరికతలతో సమానంగా తులతూగిన నాగరికత ఒకటి వర్ధిల్లిందని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది.
ఆ వ్యాసంలో మార్షల్ ఆనాటికి భారత్‌లో బయల్పడిన రెండు నగరాలు… హరప్పా, మొహెంజోదారో గురించే ప్రస్తావించాడు. ఆ తరువాత గడిచిన వందేండ్లుగా జరుగుతున్న పురావస్తు తవ్వకాల్లో అలాంటివి సుమారు రెండువేల నగరాలు వెలుగు చూశాయి. ఆ నగరాలలో బయల్పడిన పురావస్తు విశేషాల విశ్లేషణ ఈ సింధూ మైదాన ప్రాంతంలో వర్ధిల్లిన నాగరికత ప్రపంచంలోని ఇతర నదీ తీర మైదాన ప్రాంతాలకు వ్యాపించిందని తెలియజేసింది.
అలెగ్జాండర్ కాలం నుంచే…
సుమారు 2350 ఏళ్ల కిందట గ్రీకువీరుడు అలెగ్జాండర్ ప్రపంచ దండయాత్రలో భాగంగా భారతదేశ వాయవ్య సరిహద్దుల వరకు వచ్చాడు. అప్పుడు ఆయన పరివారంలోని కొంతమంది హరప్పా-మొహెంజోదారో నగరాల శిథిలాలను చూశారు. అంత పెద్దదిబ్బల వెనుక చారిత్రక ఆంతర్యమేమిటో తెలియక విస్తుపోయారట. 1826లో కూడా ఐరోపా ఖండానికి చెందిన పరిశోధకుడు ఆ దిబ్బలను చూసి ఆశ్చర్యపోయాడట. ఆ దిబ్బలలో… ప్రత్యేకించి హరప్పా దిబ్బలలో 1850లలో రైల్వే లైన్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఇటుకలను తరలించారు.
దాన్ని అప్పటి భారత పురావస్తు శాఖ అధికారి అలెగ్జాండర్ కన్నింగ్హమ్ చూస్తూ ఊరకుండిపోయాడట. చివరికి 1920లో పురావస్తు శాఖ అధికారి రఖల్ దాస్ బెనర్జీ మొహెంజోదారో దిబ్బలపైనున్న 2వ శతాబ్దం నాటి కుషాను రాజుల కాలపు బౌద్ధస్తూపం, దానికి అనుబంధంగా ఉన్న బౌద్ధ ఆరామ, విహారాలను బయల్పరిచే తవ్వకాలు చేపట్టాడు. ఆ సమయంలోనే వాటి కింద అత్యంత ప్రాచీన మహానగరపు ఆనవాళ్లు ఉండటాన్ని గుర్తించాడు.
అనంతరం దశాబ్ద కాలంలో (1921-31) జరిపిన తవ్వకాలలో పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో ఉన్న మొహెంజోదారోలో అంతకుమునుపు రెండు మూడు సహస్రాబ్దుల ముందే అత్యంత ప్రాచీన పట్టణ నాగరికత వర్ధిల్లిందని తెలిసింది. అదేకాలంలో దయారామ్ సాహ్ని అనే మరో పురావస్తు శాఖ అధికారి పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని హరప్పా దగ్గర చేపట్టిన తవ్వకాలలో కూడా సమకాలికంగా మరో మహానగరం వర్ధిల్లిందని తెలిసింది. సుమారు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు నగరాలూ సింధూ నది లోయలో ఉండటం వల్ల ఈ నగర నాగరికతకు ‘సింధూ లోయ నాగరికత’ అనే పేరు వచ్చింది.
Archaeologist Skeleton
నాగరికత విస్తృతి
ఆ తరువాత ఈ వందేండ్ల కాలంలో ఈ నాగరికతకు చెందిన వందలాది నగరాలు వెలుగు చూశాయి. 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడం వల్ల రెండు దేశాల్లోనూ ఇప్పటివరకు సుమారు 1500 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. భారతదేశంలో సింధూలోయ నగరాలు సరస్వతి, తపతి, నర్మద, గోదావరి నదుల లోయల్లో కూడా విస్తరించాయని తెలిసింది. ఇంకా దక్షిణంగా కేరళలోని నీల నది, తమిళనాడులోని వైగై నది ప్రాంతాల వరకూ ఈ నాగరికత విస్తరించిందని కూడా వాదనలు ఉన్నాయి. ఉత్తర దిశలో టిబెట్‌లోని కైలాస పర్వతం వరకూ ఈ నాగరికత వ్యాప్తి చెందిందనీ పేర్కొంటారు. ఒక రకంగా చెప్పాలంటే సింధూ లోయ నాగరికత అని తొలుత పేర్కొన్న నాగరికత క్రమంగా భారతదేశం అంతటా విస్తరించిందని తెలియవస్తున్నది.
భారత్ నుంచే వలసలు
హరప్పా, మొహెంజోదారో నగర శిథిలాల్లో లభించిన చిత్రిత పాత్రలు (పెయింటెడ్ సెరామిక్ వేర్), లిఖిత ముద్రికలు మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా కొన్ని పోలికలతో లభించాయి. దీంతో సింధూ నాగరికతపై ఆ ప్రాంతాల ప్రభావం ఉందని తొలుత భావించారు. మొహెంజోదారో తవ్వకాలు చేపట్టిన రఖల్ దాస్ బెనర్జీ ‘ఈ సంస్కృతికి తూర్పు మధ్యధరా ప్రాంతంలోని ఐజియా సంస్కృతితో ప్రత్యక్ష పరిచయం ఉంది’ అన్నాడు. ‘ఇక్కడి పెయింటెడ్ సెరామిక్ వేర్, లిఖిత ముద్రికల పోలికలు క్రీట్ దేశంలోని మినోవా పురావస్తువుల్లో కనిపిస్తాయి’ అని కూడా ఆయన పేర్కొన్నాడు.
ఆయనే ఇంకా ‘ఇక్కడి లిఖిత ముద్రికలకు, మధ్యధరా ప్రాంతంలోని మైసేనియా యుగపు చిత్రలిపికి ఒక సామ్యత కనిపిస్తుంది’ అనీ అన్నాడు. ఆయన వ్యాఖ్యల ఆధారంగా సర్ జాన్ మార్షల్ సింధూ నాగరికత పశ్చిమ దేశాల నుంచి చొచ్చుకు వచ్చిన నాగరికత అని, ఆ తరువాత యుగాల్లోనూ చోటు చేసుకున్న మానవ వలసలే భారత ‘దేశీయ’ సంస్కృతి వృద్ధి చెందడానికి కారణం అని అభిప్రాయం వ్యక్తంచేశాడు. అయితే, అలా అని చెప్పడానికి స్పష్టమైన కారణాలూ కనిపించవనీ ఆయనే అన్నాడు. బలూచిస్తాన్‌లో లభ్యమైన చిత్రిత పాత్రలు, ఇతర వస్తువుల్లో సింధూ లోయలోని వస్తువులతో సామ్యత ఉంది. దీంతో భాషా పరమైన కారణాల నేపథ్యంలో మధ్యధరా ప్రాంతాలతో సంబంధాలు కలిగిన ద్రావిడ జాతులు అప్పటి భారత్‌లో ప్రవేశించాయనీ సర్ జాన్ మార్షల్ అన్నాడు.
ఆ తరువాత కాలంలో పలువురు పరిశోధకులు ఓ పక్క సింధూ నాగరికతకు ద్రావిడ భాషా ప్రజల మూలాలు ఉన్నాయని చెప్తూనే, బయటి దేశాల నుంచి వచ్చిన ఆర్యులు ఇక్కడి సింధూ నాగరికతను నాశనం చేసి తమ వైదిక నాగరికతను భారతదేశంలో విస్తరింపజేశారంటూ సిద్ధాంతీకరించారు. అలా భారతదేశానికి అనాది కాలం నుంచే దేశీయ స్వతంత్ర రాజకీయ, సామాజిక-సాంస్కృతిక వ్యవస్థలు లేవనే అర్థం స్ఫురించేలా వ్యాఖ్యానించారు. కానీ ఇటీవల ఢిల్లీకి వాయవ్యంగా 150 కి.మీ. దూరంలో హర్యానాలో ఉన్న రాఖీగఢ్లో లభించిన సింధూ నాగరికత పూర్వయుగానికి చెందిన మానవ కళేబరాల డీఎన్ఏ పరీక్షలు సింధూ ప్రజలు విదేశాల నుంచి వచ్చినవారు కాదని, ఈ దేశీయులేనని, వీరికి- అండమాన్ దీవుల్లో నివసిస్తున్న ప్రజలకూ జన్యు సంబంధాలు ఉన్నాయని నిర్ధారించాయి.
Indus River
బౌధాయన శ్రౌత సూత్రంలోనూ…
ఇక క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ‘బౌధాయన శ్రౌత సూత్ర‘ (18.44) లోని ‘ప్రత్యయన్ అమావసుః ప్రవవ్రాజ‘ అనే సూత్రం ‘పురూరవుడు- ఊర్వశి సంతానమైన అమావసువు వంశీకులైన గాంధార, పరశు, ఆరట్టలు పశ్చిమ ప్రాంతాలకు వలసపోయి తమ పేర్లతో గాంధార, పర్షియా, ఆరరత్ మొదలైన దేశాలను పాలించారు’ అని విశదం చేసింది. టర్కీలోని బోగజ్కోయిలో లభించిన క్రీ. పూ. 1380 నాటి వ్యాపార సంబంధ శాసనాలు ప్రస్తావించిన ఇందర, మిత్రస్, ఉరువనస్, నాసతియ అనే దేవతలు భారత వైదిక దేవతల పేర్లే కావడం గమనార్హం.
ఆ తరువాత రెండు శతాబ్దాలలో… అంటే క్రీ.పూ.12వ శతాబ్దం నాటికి భారత్ నుంచి వలస వెళ్లిన ప్రజలు గ్రీసు దేశంలోని మినోవా- మైసేనియా సంస్కృతిని నిర్మూలించి అక్కడ తమ సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఆరరత్లోనైతే క్రీ.పూ. 3వ సహస్రాబ్దం అంతమయ్యే నాటికే అక్కడ భారత సంస్కృతి పరిఢవిల్లింది.
బౌధాయన శ్రౌత సూత్రం లోని ‘ప్రాణాయః ప్రవవాజ తస్యతే కురు పాంచాలః కాశీ విదేహా ఇత్యేతద్ ఆయనం ప్రప్రాజం’ అనే సూత్రం ‘పురూరవ- ఊర్వశి సంతానమైన ఆయు తూర్పు వైపునకు వలసపోగా అతని సంతతివారే కురు పాంచాలులు, కాశీ విదేహులు అయ్యారు’ అని ప్రస్తావించింది. క్రీ.పూ.2వ సహస్రాబ్దంలో రాజస్థాన్‌లోని బనస్ లోయలో వర్ధిల్లిన కాంస్య యుగ సంస్కృతి అక్కడి (పశ్చిమం) నుంచి తూర్పు వైపున గంగా మైదానంలో ఉన్న కురు పాంచాల, కాశీ (ఉత్తరప్రదేశ్), విదేహ (వాయువ్య బీహార్) వైపు ప్రయాణించడం పురావస్తు తవ్వకాల ద్వారా కూడా రుజువైందని భారత పురావస్తు శాఖ సంచాలకులుగా పనిచేసిన బి.బి.లాల్ చెప్పారు.
Indus
భారతీయ సంస్కృతి మూలాలు
భారత్ పాకిస్తాన్ దేశాల్లో విస్తరించిన సింధూ-సరస్వతీ నదీ తీరాల్లో వెలసిన నగరాల తవ్వకాల ద్వారా భారత దేశ సంస్కృతికి మూల రూపాలైన ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. వాటిలో మత విశ్వాసాలు, లిపికి సంబంధించిన విషయాలు బాగా ఆసక్తిని రేకెత్తించాయి. మొహెంజోదారోలో వందేండ్ల కిందట విశాలమైన మందిరం, యజ్ఞవేదిక, ఉంగరం ఆకారపు శిల్పాలు (రింగ్ స్టోన్స్), సమాధులు వెలుగు చూశాయి. ఆ తవ్వకాలు చేపట్టిన రఖల్ దాస్ బెనర్జీ ఆ విశాలమైన మందిరం మధ్యలో విగ్రహం ఉండేదేమో అన్నాడు.
కానీ, తదనంతర కాలంలో మందిరంగా భావించిన ఆ నిర్మాణం విశిష్ట లక్షణాలతో విలసిల్లిన కోనేరు (గ్రేట్ బాత్) అని తేలింది. రకరకాల పరిమాణాలు, రంగుల్లో లభించిన రింగ్ స్టోన్స్ ఉపరితలం, అడుగు భాగాలు వంకరటింకరగా ఉన్నాయట. వాటిని రఖల్ దాస్ భర్తరీలు అని పేర్కొన్నాడు. భర్తరీలు అంటే నిత్యం ప్రకాశించే హోమగుండాలు అని అర్థం. ఆ తరువాతి కాలపు తవ్వకాల్లో సింధూ నాగరికత ప్రజలు పూజించిన యోని, లింగం బొమ్మలు లభించాయి. వీటి సంయోజిత రూపమే తదనంతర కాలపు శివలింగంగా పరిణమించిందని చెప్పవచ్చు.
Indus
ద్రావిడ భాష కావచ్చు
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మొదలైనవి ద్రావిడ భాషలు. వీటికి మూలం సింధూ ప్రజల భాష కావచ్చని కొంతమంది పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారుల అభిప్రాయం. సింధూ-సరస్వతి మైదాన నగరాల్లో లభించిన అతి ముఖ్యమైన వస్తువులు వివిధ రకాలైన చిత్రాలు, అక్షరాలతో కూడిన ముద్రికలు. వేలాదిగా లభించిన ఈ ముద్రలను స్టియటైట్, రాయి, పేస్ట్, ఏనుగు దంతాలతో చేశారు. కొన్ని రాగి కడ్డీలు కూడా లభించాయి. ఈ ముద్రికలు చాలావరకు చతురస్ర ఆకారంలో ఉన్నాయి. వాటిపైన ఇప్పటికీ సరిగా అర్థం కాకుండా ఉన్న రాతలను సర్ జాన్ మార్షల్ ‘చిత్రలిపి’ (పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్) అన్నాడు. వాటిపైన ఎద్దులు, కొమ్ము ఉన్న మృగం మొదలైన జంతువుల బొమ్మలు అసాధారణంగా కనిపిస్తాయి. అనంతర కాలంలో ఆ ముద్రికలపై విశేష పరిశోధన చేసిన ఐరావతం మహదేవన్ సుమారు 4 వేల ముద్రికల పైన దాదాపు నాలుగు వందల అక్షరాలతో రాసిన శాసనాలను (లెజెండ్స్) ఒక బృహత్తర నిఘంటువులో పొందుపర్చాడు. ఆయన, అస్కో పర్పోల అనే మరో విశిష్ట పరిశోధకుడు ఆ ముద్రికల పైనున్న లిపి భాష ద్రావిడ భాషలకు సంబంధించిందని భావించారు.
ఒక రెండు విశిష్టమైన ముద్రికల పైన చిత్రితమైన యోగాసన మూర్తిని మార్టిమర్ వీలర్ అనే పురావస్తు శాఖ అధికారి ‘పశుపతి శివుడు’ కావచ్చని అభిప్రాయపడగా, ఒకరిద్దరు ఇటీవలి కాలపు పరిశోధకులు మాత్రం ఆ బొమ్మపై ‘సర్ప శైలి’లో లిఖించిన అక్షరాలను ‘రిషభ నామన్ కత’ అని చదివి, వృషభనాథుని కొడుకు భరతుడు పాలించిన భూభాగానికే భారతదేశం అనే పేరొచ్చిందని తెలిపారు. కాగా, రెండేళ్ల కిందట చేసిన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సింధూ లిపిని చదవడం పూర్తయిందని అన్నారు. అయినప్పటికీ ఆ లిపి, భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి తదితర విషయాలు సాధికారికంగా, శాస్త్రీయంగా ప్రజలకు ఇంకా తెలియవలసి ఉంది.
…? డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ
Indus Civilisation