సౌత్ ఆఫ్రికా : ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (ఆశ) ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్ నగరంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు భారత కాన్సులేట్ జనరల్ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆఆశ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆశ సంస్థ అధ్యక్షుడు రాజు జయప్రకాశ్ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంతో పాటు ఆశ ఆధ్వరంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల వివరాలు తెలియజేశారు.
అనేక విపత్తుల సమయంలో బాధితులకు ఆశ ఇచ్చిన భరోసానిచ్చి సభ్యులందరిలోనూ కొత్త ఉత్సాహం నింపేలా చేశారని ఆయన పేర్కొన్నారు. మిస్ వరల్డ్ 2024 గా ఎంపికైన దక్షిణాఫ్రికన్ అందాల తార జొలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్ ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజయం సాధించినవారికి బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారుల ఆట, పాటలు యువత ప్రదర్శించిన నృత్యరూపకాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.