అమెరికాలోని హ్యూస్టన్‌లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలకు మాత్రమే ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో ఈ నెల 16, 17వ తేదీల్లో జరిగిన ఈ సాహితీ సదస్సులో భారత్ నుంచి 15 మంది ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికాలో పలు నగరాల చి 75 మందికి పైగా విచ్చేసి, 28 విభిన్న వేదికలలో పాల్గొని సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు భాషా, సాహిత్య సౌరభాలని పంచుకున్నారు.
హ్యూస్టన్‌లో తెలుగు బడి, మన బడి బాలబాలికలకు తెలుగు నేర్పుతున్న ఉపాధ్యాయులకు గురువందన సత్కారాలతో మొదలైన ఈ జాతీయ స్థాయి సాహిత్య సదస్సును “పద్మభూషణ్” ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంఛనప్రాయంగా ప్రారంభించారు. భారతదేశం నుంచి తొలిసారి అమెరికా విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ “సినిమా సాహిత్యం, తెలుగు భాష” అనే అంశం మీద సాధికారంగా చేసిన ప్రధానోపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు.
కాలిఫోర్నియాలోని ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పురోభివృధ్ధికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు లక్ష డాలర్ల భూరి విరాళం చెక్కును సభాముఖంగా ఆ విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజు చామర్తికి అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా, సాహిత్యాలకి ఎవరో, ఏదో చేయాలనే కంటే ఉన్న వ్యవస్థలను పటిష్టం చేయాలని వంగూరి చిట్టెన్ రాజు పిలుపునిచ్చారు. దానికి ఆచార్య యార్లగడ్డ, రాజు చామర్తి సముచితంగా స్పందించారు. శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, బుర్రా సాయి మాధవ్ పాల్గొన్న ఈ ప్రత్యేక వేదిక సదస్సు విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సదస్సులో మొత్తం 17 నూతన తెలుగు గ్రంథాలు ఆవిష్కరించగా అందులో 5 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణలు కావడం విశేషం. పాణిని జన్నాభట్ల నిర్వహణలో జరిగిన ‘అమెరికా కథ’ చర్చా వేదిక, విన్నకోట రవిశంకర్ నిర్వహణలో జరిగిన కవితా చర్చా వేదిక, బుర్ర సాయి మాధవ్‌తో శాయి రాచకొండ నిర్వహించిన ముఖాముఖి, ఉరిమిండి నరసింహారెడ్డి, శారదా కాశీవజఝ్ఝల నిర్వహించిన సాహిత్య ప్రహేళికల కార్యక్రమాలు, కథా రచన పోటీ మొదలైన ఆసక్తికరమైన అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డాలస్ నివాసి, తానా సాహిత్య వేదిక అధ్యక్షులు, అమెరికాలో ప్రముఖ సాహితీవేత్త డా. తోటకూర ప్రసాద్‌కు వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం అందించి సత్కరించింది.
రెండు రోజులపాటు 50కి పైగా వక్తలు పాల్గొన్న వివిధ ప్రసంగ వేదికలలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బుర్రా సాయి మాధవ్, ఈమని శివనాగిరెడ్డి, జి.వల్లీశ్వర్, రాధిక మంగిపూడి, కోసూరి ఉమాభారతి, హరి మద్దూరి, శారద ఆకునూరి, జ్యోతి వలబోజు, ఇర్షాద్ జేమ్స్, దయాకర్ మాడా, సత్యం మందపాటి, మద్దుకూరి విజయ చంద్రహాస్, కె గీత, అఫ్సర్, కల్పనా రెంటాల, వ్యాసకృష్ణ, జెపి శర్మ, కొండపల్లి నిహారిణి, విజయ సారథి జీడిగుంట, అత్తలూరి విజయలక్ష్మి, కేతవరపు రాజ్యశ్రీ తదితరులు ప్రసంగించారు. అమెరికా డయాస్పోరా కథ షష్టిపూర్తి ప్రత్యేక వేదికలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, సి నారాయణస్వామి, భాస్కర్ పులికల్ ప్రసంగించారు.
సదస్సు నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేసిన వదాన్యులకు ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీకాంత్ రెడ్డి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సదస్సు నిర్వాహకవర్గ సభ్యులుగా శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, ఇంద్రాణి పాలపర్తి, కోటి శాస్త్రి, పంకజ్, రామ్ చెరువు, పుల్లారెడ్డి, కావ్య రెడ్డి, ఇందిర చెరువు, శాంత సుసర్ల, ఉమా దేశభొట్ల, వాణి దూడల తదితరులు వ్యవహరించారు. రెండు రోజుల కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.