Sri vasavi Kanyaka Parameswari | డబ్లిన్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి జైజై వాసవి మాత నినాదాల నడుమ అమ్మవారి పల్లకి సేవను ఘనంగా చేపట్టారు. ఈ ఏడాది ప్రత్యేకంగా నిర్వహించిన రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేసంగా ఆకట్టుకుంది. సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలాగే ఈ యేడు కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత, దూడను దర్శించుకొని పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.
నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలతో..
పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలతో అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతి, సంప్రదాయాలను దైనందిన జీవితంలో ఎలా అలవరుచుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలతో ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక, దైవిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తర్వాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దంపతులందరూ దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా.. కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు, వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.


