Sankara Nethralaya | చూపు కోల్పోయిన వేలాదిమంది పేదల జీవితాల్లో వెలుగు నింపిన శంకర నేత్రాలయ USA, తన “అడాప్ట్-ఎ-విలేజ్” కంటి సంరక్షణ కార్యక్రమాల సక్సెస్‌పై ఒక విశిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. దాతల అంకితభావం, సేవా తపనకు సాక్ష్యంగా నిలిచిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి, దార్శనిక దాతలు, బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదారులు, మరియు సేవాభావంతో నిండి ఉన్న ట్రస్టీల సమక్షంలో అనేక మందిని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి 5 లక్షల డాలర్లను విరాళంగా అందించి మొబైల్-ఐ-సర్జికల్ యూనిట్ (MESU) ప్రారంభానికి దోహదపడ్డారు. ఈ విరాళంతో కలివెలపాలెం, కాగులపాడు, అన్నమేడు, సౌత్ మోపూర్ గ్రామాలలో నాలుగు శిబిరాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రత్యేకంగా సౌత్ మోపూర్‌లో రెండు కండ్లు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి చూపు పునరుద్ధరించారు.
ఇక తమిళనాడులోని ఎట్టియపురంలో మొబైల్ ఐ యూనిట్ స్థాపన కోసం శంకర్ సుబ్రమణియన్ 4 లక్షల డాలర్లను విరాళంగా అందించారు. పాలమూరు ఫౌండేషన్ ద్వారా దాతృత్వ సేవల్లో ముందుండే T.R. రెడ్డి, తన స్వగ్రామమైన నంది వడ్డెమాన్‌లో రెండు శిబిరాలు నిర్వహించి, ప్రస్తుతం మూడో శిబిరం కోసం కోస్గిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత భాగస్వామ్యం కోసం 50% మ్యాచింగ్ గ్రాంట్‌ను ప్రకటించారు.
Sanakara Nethralaya
తమిళనాడులోని తిరుకోయిలూరు శిబిరాన్ని లీలా కృష్ణమూర్తి నిర్వహించి, 1.45 లక్షల డాలర్లను విరాళంగా అందించారు.ఇక చార్టర్ గ్లోబల్ సంస్థ వ్యవస్థాపకులు మురళీ రెడ్డి, “ఇది విశ్వాసానికి ప్రతిరూపం” అని ప్రశంసిస్తూ, శిబిరాలను పొరుగు గ్రామాలకు విస్తరించాలని సూచించారు.
డాక్టర్ ప్రియా కొర్రపాటి నెల్లూరు జిల్లాలోని మర్రిపాడులో 162 శస్త్రచికిత్సలతో కూడిన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. భాను రామకృష్ణన్, కె.జి. వెంకట్రామన్లు మహిమలూరు, అరియలూర్‌లో శిబిరాలు నిర్వహించగా.. వంశీ మదాడి తన శిబిరం ద్వారా 111 శస్త్రచికిత్సలు చేయించేందుకు మద్దతుగా నిలిచారు.
డాక్టర్ శంకర్ కృష్ణన్ సంవత్సరానికి మూడు శిబిరాలకు మద్దతు ఇస్తుండగా, మదనపల్లిలో నిర్వహించిన శిబిరంలో అనేక పేదలకు చూపు పునరుద్ధరించబడింది. ARSR ఫౌండేషన్ ద్వారా సంవత్సరానికి 4.5 లక్షల డాలర్లు విరాళంగా ఇస్తున్నారు. డాక్టర్ మోహన్ మల్లం తొండవాడ గ్రామాన్ని దత్తత తీసుకుని, 96 శస్త్రచికిత్సలు చేయించారు. జ్యోతి చింతలపూడి వరదన్నపేటలో శిబిరం నిర్వహించి, తన తండ్రికి నివాళిగా శంకర నేత్రాలయ కోసం నిధులను సేకరించారు. శంకర నేత్రాలయ కోశాధికారి మూర్తి రేకపల్లి పుట్టపర్తిలో MESU సేవలకు కీలకంగా దోహదం చేశారు.120 శస్త్రచికిత్సలు జరిగిన శిబిరంలో పాల్గొన్న పీవీ నరసింహారావు మనవరాలు స్మిత, గౌతమ్ నెల్లుట్ల ఈ సేవలను “జీవితాన్ని మార్చే అనుభవం”గా అభివర్ణించారు. పెన్సిల్వేనియాకు చెందిన శ్రీధర్ రెడ్డి తిక్కవరపు జగదేవిపేటలో శిబిరాన్ని నిర్వహించి, “ఇది దేవుడిచ్చిన అవకాశం” అన్నారు. ఆయన డల్లాస్‌లోని నాటా సమావేశంలో 3.75 లక్షల డాలర్ల సేకరణకు సహకరించారు.
నీలిమ గడ్డమణుగు కూచిపూడిలో శిబిరాన్ని స్పాన్సర్ చేసి, 133 శస్త్రచికిత్సలు చేయించారు. ఆది మోరెడ్డి, రేఖ మోరెడ్డి పుట్టపర్తి సమీపంలోని కేశవపురంలో 138 శస్త్రచికిత్సల శిబిరానికి నాయకత్వం వహించారు. ధీరజ్ పోలా తన శిబిరంలో 166 శస్త్రచికిత్సలు చేయించి, “ప్రతి డాలర్ విలువైనదే,” అని పేర్కొన్నారు.
డాక్టర్ రెడ్డి ఊరిమిండి డల్లాస్‌లో 4 లక్షల డాలర్లు సేకరించి, అనేక మంది పోషకదాతలను ఈ మిషన్‌లో చేరేలా చేశారు. శ్యామ్ అప్పాలి తన వీడియో నైపుణ్యాలతో సంస్థ ప్రచారానికి తోడ్పడ్డారు. మల్లిక్ బండ లాస్ ఏంజిల్స్ అధ్యాయాన్ని బలోపేతం చేస్తూ, “శంకర నేత్రాలయ ద్వారా జీవితం సార్థకమైంది,” అన్నారు. వంశీ కృష్ణ ఏరువరం ఫీనిక్స్ అధ్యాయాన్ని నడిపించగా, రమేశ్ చాపరాల వార్షిక విరాళాలు, లడ్డూ వేలం, పుట్టినరోజు విరాళాల్లాంటి వినూత్న విధానాల ద్వారా నిధుల సేకరణ జరిగాయి. ఈ విధంగా గ్రామీణ భారతదేశంలో దృష్టిని పునరుద్ధరించే శంకర నేత్రాలయ ప్రయాణంలో ప్రతి దాత, ప్రతి శిబిరం ఒక ప్రత్యేక అధ్యాయమని అన్నారు.