నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు రాపోలు సీతారామరాజు అనువదించిన నెల్సన్ మండేలా ఆత్మకథ స్వేచ్చకోసం (Freedom ) సుధీర్ఘ ప్రయాణం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఆదివారం దక్షిణాఫ్రికాలో (South Africa) అక్కడి తెలుగు వారి సమక్షంలో జరిగిన కార్యక్రమానికి తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గౌతమ్ లింగా (Gautham Linga) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా వచ్చిన వేణు ఎలిగేటి, తాళ్లూరి శ్రీనివాస్ మాట్లాడారు. మండేలా పోరాటాన్ని రాపోలు సీతారామరాజు తనదైన శైలీలో అనువదించారని కొనియాడారు. ప్రేమ్ నున్నామాట్లాడుతూ సీతారామరాజు రచనా పటిమను మెచ్చుకుంటూ పుస్తకంలోని అనేక విషయాలను విశ్లేషించారు.
గుర్రాల నాగరాజు మాట్లాడుతూ దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక ఇలాంటి మంచి రచనలు మరిన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కల్లూరి శ్రీకాంత్, బద్రి, కుప్పు రాజు జయప్రకాష్, పెట్లూరి విక్రమ్, సంకు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మండలానికి చెందిన రచయిత అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండడం పట్ల మండలానికి చెందిన కవులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, కందిమల్ల రామ్ రెడ్డి, ఎల్లోజు బ్రహ్మచారి, కుకుడాల గోవర్ధన్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, పగిడి పాటి నరసింహ తదితరులు రాపోలు సీతారామరాజుకు అభినందనలు తెలియజేశారు.