ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఐఐటీ హైదరాబాద్(IIT Hyderabad)తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజినీరింగ్‌లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణల్లో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్‌తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ (internship) అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఇటీవల వాషింగ్టన్ డీసీ (Washington DC)లో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
సంవత్సరం కాలపరిమితి వరకు ఐఐటీలో ఇంటర్న్‌షిప్ అవకాశం లభించనున్నది. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. దాంతో విద్యార్థులు ఆధునిక పరిశోధన, ఇన్నోవేషన్‌ల్లో అనుభవం పొందే అవకాశం ఉంటుందని జయంత్ చల్లా తెలిపారు. టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడంలో యువతకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. తొలిసారిగా భారతదేశం వెలుపల ఐఐటీ ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని ప్రొఫెసర్ మూర్తి అన్నారు. అర్హులైన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ వసతి, ఇతర సదుపాయాలను నామమాత్రపు ఫీజుతో కల్పిస్తుందని వివరించారు.