హైదరాబాద్: బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిల్వల కొరతను దృష్టిలో ఉంచుకొని అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్-TPAD) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఐటీ కంపెనీ అయిన ఐటీ స్పిన ఆవరణలో టెక్సాస్‌లోని అతి పెద్ద బ్లడ్‌బ్యాంక్ కార్టర్ బ్లడ్ కేర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫ్రిస్కో, ఎల్లెన, మెక్కెన్నీ, ప్రాస్పర్, ప్లేనో, ఐర్వింగ్, కాపెల్ తదితర ప్రాంతాల నుంచి రక్తదాతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా 150 మంది చికిత్సకు సరిపోయేలా 50 పింట్ల రక్తాన్ని సేకరించారు. ఇది సుమారు 10 గుండె శస్త్రచికిత్సలకు సరిపోతుందని కార్టర్ బ్లడ్‌కేర్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిబిరానికి ఇంతగా స్పందన వస్తుందని తాము ఊహించలేదని, అంచనాలను మించి రక్తాన్ని సేకరించామని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, టీపాడ్ గత ఎనిమిదేండ్లుగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. రక్తదానానికి అవసరమైన వసతులు కల్పించిన ఐటీ స్పిన కంపెనీ యాజమాన్యం రఘువీర్ బండారు, ఉమా బండారులకు టీపాడ్ కృతజ్ఞతలు తెలిపింది.
ఎప్పటిలాగే టీపాడ్.. 2022లో కార్యక్రమాలను రక్తదాన శిబిరంతో మొదలుపెట్టడం విశేషం. డాలస్ తెలంగాణ ప్రజాసమితి సగర్వంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేణుకా చనమోలు, స్వప్న తుమ్మపాల, అజయ్‌రెడ్డి, రమణ లష్కర్, ఇంద్రాని పంచెర్పుల, పండు పాల్వాయ్ పాల్గొన్నారు.