H-1 B Visa | అమెరికాలో తాత్కాలిక ఉద్యోగం కోసం విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి ఒకటో తేదీ నుంచి మొదలవుతుంది. మార్చి 18 వరకు అర్హులైన ఉద్యోగులు, నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చునని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. వచ్చే ఏడాది కోటా కింద ఈ వీసాలను జారీ చేయనున్నది. ఈ వీసాల కోసం టెక్ సంస్థలు, ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని యూఎస్సీఐఎస్ వెల్లడించింది.
హెచ్-1 బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు 10 డాలర్ల ఫీజు చెల్లించాలి. మార్చి 18 వరకు వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మార్చి నెలాఖరు నాటికి సంబంధిత అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. వీసా లభించిన నిపుణులు వచ్చే అక్టోబర్ నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంటుంది.
ప్రత్యేక నిపుణులు అమెరికాలో పని చేయడానికి వీలుగా ఆ దేశ ప్రభుత్వం ప్రతిఏటా పరిమితంగా హెచ్-1 బీ వీసాలు జారీ చేస్తుంది. దాదాపు 65 వేల వీసాలు జారీ చేయడంతోపాటు మాస్టర్ డిగ్రీ కోసం మరో 20 వేల వీసాలు జారీ చేస్తుంది. నాన్ ఇమ్మిగ్రేషన్ కింద వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే అత్యధికం. సుమారు 70 శాతం మంది ఇండియన్ ఐటీ నిపుణులే హెచ్-1బీ వీసా పొందుతుంటారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గణనీయ సంఖ్యలోనే ఐటీ నిపుణులు హెచ్-1బీ వీసాపై అమెరికాలో పని చేస్తున్నారు.