హైదరాబాద్: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ స్వరాష్ట్ర సాకారానికి పునాది వేసిన రోజుగా చరిత్రలో నిలిచిపోయిందని బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్‌కుమార్ అన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం బహ్రెయిన్‌లో దీక్షా దివస్ (Deeksha Divas)ను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని దేశ రాజకీయ వ్యవస్థను కదిలించిన నాయకుడి తెగువకు నిదర్శనం దీక్షా దివస్ అని ఆయన అన్నారు.
తెలంగాణ తొలి సీఎంగా పదేళ్లలో ప్రపంచ పటంలో తెలంగాణను అగ్రగామిగా కేసీఆర్ నిలిపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. సకల జనులను అవస్థల పాలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, సుమన్, కార్యదర్శులు రాజేందర్, దేవన్న, కిరణ్ గౌడ్, రాజలింగం, సాగర్, వెంకటేశ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.