Sridhar Reddy : తెలంగాణ తల్లి ఒడిలో పుట్టిన ఒక ఆడబిడ్డ కన్నీళ్లు కారుస్తుంటే “భారత్ మాతా కీ జై” అంటూ గొంతులు చించుకునే రాజకీయ వీరుల నోళ్లు ఎందుకో మూగబోయాయి? అని బీఆర్ఎస్ యూఎస్ఏ శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసుపై జాతీయ పార్టీల నిర్లక్ష ధోరణితో తెలంగాణ గుండె మండుతోందని, ప్రజల మౌనం తుపానుగా మారబోతోందని ఆయన హెచ్చరించారు.
“బేటీ బచావో” అంటూ దేశమంతా నినాదాలు చేసినవాళ్లు.. ఒక మైనర్ బాలిక జీవితం అగ్నిగుండంగా మారినప్పుడు మాత్రం మాటలు మింగేసి మౌనం దాల్చారు. ఇదేనా వారి దేశభక్తి? ఇదేనా వారి నైతికత? ఇదేనా రాజకీయ ధర్మం? అని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఏమీ పట్టనట్టు వ్యహరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ శ్రీధర్ రెడ్డి తూటాల్లాంటి పదాలతో తన ఆక్రోషాన్ని వెళ్లగక్కారు.
”చేతిలో జెండా పట్టుకుంటే దేశభక్తుడు కాడు.. ఆడబిడ్డకు అండగా నిలిస్తేనే నిజమైన మనిషి. పోక్సో కేసులో ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుటుంబం వినిపిస్తుంటే.. బీజేపీ నాయకుల నోళ్లు మూసుకుపోయాయి. కాంగ్రెస్ పెద్దల పెదవులు కదలట్లేదు. ముఖ్యమంత్రి మౌనం.. హోంమంత్రి మౌనం.. ఇదేనా “న్యాయం”? ఇదేనా “బేటీ బచావో”? “పులి తోలు కప్పుకున్నా నక్క నక్కే” అన్నట్టు.. ప్రజలు ఇప్పుడు అసలు ముఖాలు గుర్తిస్తున్నారు. ఒక్కో ముసుగు ఊడిపోతోంది. ఒక్కో కుట్ర బయటపడుతోంది. తెలంగాణను దోచుకున్న వాళ్లు, ప్రజల కన్నీళ్ల మీద రాజకీయ రాజభవనాలు కట్టుకున్న వాళ్లు, ఇప్పుడు తమ అక్రమాల్ని కాపాడుకోవడానికి మతోన్మాద శక్తులతో చేతులు కలుపుతున్నారు. ఇది కేవలం రాజకీయ ద్రోహం కాదు.
ఇది యావత్ సమాజానికి చేసిన నేరం.
పసిపాప ఆర్తనాదం వినిపించినప్పుడు న్యాయం కోసం నిలబడాల్సిన సమాజం బాధితురాలినే ప్రశ్నించింది. “హనీ ట్రాప్” అంటూ అసలు నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసింది. ఆ రోజే మన సమాజం కొంత చనిపోయింది. కెమెరాలు మూగబోయాయి. సాక్ష్యాలు మాయమయ్యాయి. నిజం పాతరైంది. అధికార గద్దెల కోసం మనిషితనం తాకట్టు పెట్టబడింది. రైతు ఆత్మహత్యలపై మౌనం, నిరుద్యోగ యువత కళ్లలో నిస్పృహ, మహిళలపై దాడులు, రోడ్డున పడిన కుటుంబాల రోదనలు.. ఇవన్నీ చూసి కూడా పాలకులు రాజకీయ నాటకాల్లో మునిగిపోయారు. కులాన్ని ఆయుధంగా, మతాన్ని మంటగా మలిచి ప్రజల మధ్య చిచ్చు పెట్టి అవకాశవాద రాజకీయాలకు చితి పేర్చారు. నేడు తెలంగాణలో తడిసిన ధాన్యం రైతుకే శాపమైంది.
హైడ్రా కూల్చిన ఇండ్లు పేదలు అనుభవించాల్సిన కర్మగా మిగిలాయి. న్యాయం దొరకని బిడ్డలు వార్తలుగా మారిపోయారు. కానీ దోపిడీ దొంగలందరూ ఒకే వేదికపై నవ్వుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది ప్రజల బాధలపై నిర్మించిన అపహాస్య సామ్రాజ్యం.
“మాటల మాంత్రికులు ఎక్కువైతే న్యాయం అనాథ అవుతుంది” అనే నానుడి ప్రస్తుత భారత రాజకీయాలకు అద్దం పడుతోంది. 100 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర అని గొప్పలు చెబుతారు. కానీ, 100 నిమిషాల్లో స్పందన లేదు.100 గంటల్లో పోక్సో కేసు నిందితుడిపై చర్య లేదు.100 రోజులు గడిచినా బాధితురాలికి భరోసా లేదు! ప్రజలు అన్నీ చూస్తున్నారు. గుర్తుపెట్టుకుంటున్నారు. బండి సంజయ్ .. తెలంగాణ బిడ్డల గౌరవం గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు మీ ఇంటి ముందుకొచ్చిన ఈ మంటపై ఎందుకు నిశ్శబ్దం? “ఇంట్లో మంట పుడితే పొరుగింటి పొగ కనిపించదు” అంటారు. కానీ, ప్రజలకు మాత్రం అన్నీ కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆడబిడ్డ గౌరవం రాజకీయాలకు అతీతం. పార్టీలు మారొచ్చు, పదవులు పోవొచ్చు. కానీ ఒక చిన్నారి కన్నీటి శాపం మాత్రం తరతరాలు వెంటాడుతుంది.
గజేంద్రమోక్షంలో గజేంద్రుడు మొసలి పంజాలో చిక్కుకుని చివరి ప్రయత్నంగా విష్ణుమూర్తిని వేడుకున్నట్టే.. ఇవాళ అన్యాయం, అహంకారం, అవినీతి, మోసాల పంజాలో చిక్కుకున్న తెలంగాణ ప్రజలు కూడా ఒక నిజమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. రైతుల ఆర్తనాదం వినిపిస్తోంది. నిరుద్యోగ యువత కన్నీళ్లు కారుస్తోంది. మహిళల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. ప్రజాస్వామ్యం శిథిలమవుతోంది. ఈ చీకటి కాలంలో తెలంగాణ ఆత్మను కాపాడే శక్తి రావాలని, ప్రజల గౌరవాన్ని నిలబెట్టే నాయకత్వం తిరిగి రావాలని కోట్లాది గుండెలు ప్రార్థిస్తున్నాయి. ఎందుకంటే.. ప్రజలు ఇంకా చనిపోలేదు. వాళ్ల ఆశ ఇంకా బతికే ఉంది” అని రేవంత్ సర్కార్ వైఫల్యాలు, బండి సంజయ్ కుమారుడిపై పోక్స్ కేసుపై ఆవేశంగా స్పందించిన
శ్రీధర్ రెడ్డి తెలంగాన సమాజం తిరగబడే రోజులొస్తున్నాయని హెచ్చరించారు.