Mahesh Bigala | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సర్కార్ రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా మండిపడ్డారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఫార్ములా ఈ రేస్ నిర్వహణ పూర్తి పారదర్శకతతో జరిగింది. అయితే గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమంపై అబద్ధాలు, వక్రీకరణలు ప్రచారం చేస్తూ, వాస్తవాలను దాచిపెట్టి కేటీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. స్వంత పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి తప్పుడు కేసులు పెడుతున్నారని మహేశ్ బిగాలా మండిపడ్డారు.
అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బీఆర్ఎస్ ఎన్నారైల తరఫున మేము ఖండిస్తున్నాం అని మహేష్ బిగాల తెలిపారు. తమ పాలనలో ప్రజలకు చూపించడానికి ఏ అభివృద్ధి పనులు లేకపోవడం, కొత్త విజయాలు లేకపోవడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా కేసుల మార్గాన్ని ఎంచుకుని బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోంది అని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ ప్రతీకార చర్యలను గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఇటువంటి ప్రయత్నాలు ఎప్పటికీ విజయం సాధించవు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కేటీఆర్‌పై బురద జల్లేందుకు చేస్తున్న కుటిల ప్రయోగం స్పష్టంగా కనిపిస్తుంది. మీ అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. న్యాయపరంగా, చట్టపరంగా ఎదుర్కుంటాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని మహేశ్ బిగాలా పేర్కొన్నారు.