Telangana Formation Day | బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన అండాలస్ గార్డెన్లో జరిగిన ఈ వేడుకల్లో కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో అరవై ఏండ్ల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూడలేక అహింసా మార్గాన ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి, చావునోట్లో తలపెట్టి మరీ కేసీఆర్ తెలంగాణను సాధించారని తెలిపారు. డిసెంబర్ 9 న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష లేకుంటే నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమే లేదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి కేసీఆర్ అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సుపరిపాలన అందించారని అన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రగతిని పరుగులు పట్టించారన్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కలకాలం నిలిచిపోతాయని.. ఎంత చెరిపిన చెరగవని అన్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ సంధర్భంగా బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అన్నారం సుమన్, చెన్నమనేని రాజేందర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అభివృద్ది నిలిచిపోయింది.. రైతులు ఇబ్బంది పడుతున్నారు.. అలాంటప్పుడు తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని.. బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారని అన్నారు. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలన్న ఒక్కటే నినాదం తెలంగాణ ప్రజల గుండెల్లో మార్మోగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులుతీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మీద విషం చిమ్మాలని కొందరు తెలంగాణ ద్రోహులు చూస్తున్నారని.. ఆ కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు సతీష్ కుమార్ , ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ , జనరల్ సెక్రటరీలు అన్నారం సుమన్ , చెన్నమనేని రాజేందర్ , కార్యదర్శులు సంగేపు దేవన్న , సంకోజీ రాణాప్రతాప్ , మల్లెల ప్రమోద్ , పుప్పలవాయి వంశీ , రాము గౌడ్ ,కిరణ్ కస్తూరి ,నర్సింహా చారి తదితరులు పాల్గొన్నారు.