Nikitha Godishala | అమెరికాలో తెలుగు యువతి నిఖిత గొడిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య అనంతరం ఇండియాకు పారిపోయి వచ్చిన అర్జున్ శర్మను ఇంటర్‌పోల్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా మేరీల్యాండ్‌లోని ఎలికాట్ సిటీలో నిఖిత గొడిశాల(27)ను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ హత్య చేశాడు. ఏమీ తెలియనట్లుగా డిసెంబర్ 31 నుంచి నిఖిత కనిపించడం లేదని హోవర్డ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం జనవరి 2వ తేదీన ఇండియాకు పారిపోయి వచ్చేశాడు. అయితే అర్జున్ ఫిర్యాదు మేరకు సెర్చ్ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. అర్జున్ ఉండే అపార్ట్మెంట్లోనే నిఖిత మృతదేహాన్ని గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లను గమనించారు. అయితే డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. క్రమంలో అర్జున్ కోసం ఆరా తీయగా.. జనవరి 2వ తేదీ సాయంత్రమే భారత్‌కు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడే నిఖితను హత్య చేసి దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డ్ కేసుల కింద అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఇండియాకు పారిపోయిన అర్జున్ను గుర్తించేందుకు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఇంటర్‌పోల్ పోలీసులు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు.