హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగు నీటి పారుదలశాఖలో 1,583 ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, అగ్రికల్చర్‌కు సంబంధించి 704 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. వర్క్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫ్లడ్‌గేట్ ఆపరేటర్, జనరేటర్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్, వైర్లెస్ ఆపరేటర్లు కలిపి మొత్తంగా మరో 879 స్కిల్డ్ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆర్థికశాఖ ఆమోదానికి అధికారులు పంపించారు. త్వరలోనే వాటికి ఆమోదం లభించే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. ఆయా పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని పేర్కొన్నారు. బీటెక్ గ్రాడ్యుయేట్లు ఏఈఈ పోస్టులకు, పాలిటెక్నిక్, ఐటీఐ అభ్యర్థులు స్కిల్డ్ ఉద్యోగాలకు అర్హులని నిర్ధారించారు. ఇప్పటికే పలుశాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తదుపరి నోటిఫికేషన్లో ఇరిగేషన్‌శాఖ పోస్టులను నింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.