ఇందల్వాయి, ఫిబ్రవరి 21: ఇటీవల హైదరాబాద్‌లో కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి అండగా ఉంటామని ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మంగళవారం ఆయన ఎంపీపీ రమేశ్ నాయక్‌తో కలిసి ఇందల్వాయిలో ఉండే బాలుడి తల్లిదండ్రులు ముత్యం గంగాధర్-మేఘనలను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాలుడి మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బాలుడి మృతి కుటుంబానికి తీరని లోటన్నారు.ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారన్నారు. అదే విధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట సొసైటీ చైర్మన్ చింతపల్లి గోవర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ రాజేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాశంకుమార్, నాయకులు తదితరులు ఉన్నారు.