బాన్సువాడ రూరల్, అక్టోబర్ 16 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కొనసాగిన జోనల్‌స్థాయి స్పోర్ట్స్ మీట్- 2023 సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గురుకులాల స్పోర్ట్స్ అధికారి రామలక్ష్మణ్ హాజరై మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసంతోపాటు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతాయని అన్నారు. జోనల్‌స్థాయి స్పోర్ట్ మిట్లో 3వ జోన్ పరిధిలోని కామారెడ్డి, సిద్దిపేట్ జిల్లాల గురుకుల పాఠశాలల విద్యార్థినులు 1,275 మంది పాల్గొన్నారు. అండర్- 14, 17, 19 విభాగాల్లో గేమ్స్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు.
హ్యాండ్‌బాల్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాల్‌బ్యాడ్మింటన్, అథ్లెటిక్ పోటీల్లో విజేతలకు బహుమతులను జిల్లా ఇంటర్ మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, ఆర్సీవో అలివేలు, బాన్సువాడ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ప్రదానం చేశారు. క్రీడాపోటీల ముగింపు సందర్భంగా విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బోర్లం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మకుమారి, ప్రిన్సిపాళ్లు లక్ష్మీబాయి, శోభారాణి, పుష్పలత, నళిని, సవిత, స్వప్న, సత్యనారాయణ, పూర్ణచందర్రావు, స్రవంతి, కల్పన తదితరులు పాల్గొన్నారు.