సారంగాపూర్, మే 15: ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని మనస్తాపం చెందిన యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన జల్లాపురం సాయిలుకు సొంతిల్లు లేకపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అదే గ్రామంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందనే నమ్మకంతో తనకున్న స్థలంలో బేస్మెంట్ వరకు ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అధికారులు ఇటీవల ఇంటింటి సర్వే నిర్వహించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు సొంత స్థలంలోఎలాంటి నిర్మాణం లేని వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. దీంతో అధికారులు అర్హుల జాబితా నుంచి అతడి పేరును తొలగించారు. ఈ విషయమై తీవ్ర మనస్తాపం చెందిన సాయిలు.. గురువారం ఉదయం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. అదే ప్రాంతం మీదుగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడు పరిస్థితిని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఫోన్ ద్వారా చేరవేశారు. ఎమ్మెల్యే స్పందించి.. కాన్ఫరెన్స్ ద్వారా బాధితుడితో మాట్లాడారు.
ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని.. టవర్ దిగాలని భరోసా కల్పించాడు. ఎమ్మెల్యే హామీతో సాయిలు టవర్ దిగాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సాయిలు సెల్ టవర్ ఎక్కిన విషయం దావనంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రభుత్వం పెట్టిన పలు నిబంధనలు పేదలకు శాపంగా మారాయని, వాటిని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమ స్థోమత మేరకు బేస్మెంట్, రెంటల్ లెవర్ వరకు ఇల్లు నిర్మించుకున్న వారికి కూడా ‘ఇందిరమ్మ’ జాబితాలో అర్హత కల్పించాలని కోరుతున్నారు.