నవీపేట, జనవరి 18: జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని నిజామాబాద్ ఆర్డీవో రవి అన్నారు. మండలంలోని కోస్లీ, యంచ, మిట్టాపూర్ గ్రామ రైతులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎన్‌హెచ్ 161 బిబి రహదారి నిర్మాణంలో 9 కిలోమీటర్ల పొడవు వరకు భూ సేకరణ కార్యక్రమం సాగుతోందని అన్నారు. ఈ గ్రామాల్లో 295 మంది రైతులకు చెందిన 42 ఎకరాలు రహదారి నిర్మాణంలో పోతుందని అన్నారు.
మార్కెట్ ధర కన్నా మూడింతలు ఎక్కువ ధరతో ప్రభుత్వం పరిహారం చెల్లించి న్యాయం చేస్తుందని ఆర్డీవో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన రైతులు పలు సమస్యలను ఆర్డీవో కు విన్నవించారు.తమకు ప్రభుత్వం నోటీసులు పంపించిన విధంగా కాకుండా ఎక్కువ భూమి విస్తరణ చేస్తూ హద్దులు పెట్టారని ఆర్డీవో దృష్టికి తెచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ మరో సారి సర్వే చేసి ఎంత భూమిని కోల్పోతారో ఆ భూములకు పరిహారం చెల్లిస్తామని రైతులకు భరోసా కల్పించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ వీర్‌సింగ్, ఆర్ఐ మోహన్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.